అవినీతి వ‌ల్లే కుంగిన బ‌రాజ్‌: రాహుల్‌గాంధీ

  • Publish Date - November 1, 2023 / 05:01 AM IST
  • కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి
  • అందుకే శిథిలావ‌స్థ‌కు చేరిన ప్రాజెక్టు
  • ప్రజల సొమ్ము లూటీ చేసిన కుటుంబం
  • వ‌సూలు చేసి ప్ర‌జ‌ల‌కోసం ఖ‌ర్చు చేస్తాం
  • ధ‌ర‌ణితో భూములు గుంజుకుంటున్నారు
  • దొరల తెలంగాణ కాదు ప్రజల తెలంగాణ రావాలి
  • ఆరు గ్యారెంటీ పథకాలతో పేదల సంక్షేమం
  • రైతుల‌తోపాటు.. కౌలు రైతుల‌కూ స‌హాయం
  • ఈ ఎన్నికలు దొరలు.. పేదల మధ్య సమరం
  • బీజేపీ, బీఆరెస్‌, ఎంఐఎం మూడూ ఒక్కటే
  • కొల్లాపూర్ సభలో రాహుల్‌గాంధీ విమ‌ర్శ‌లు


విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: తెలంగాణలో లక్ష కోట్లు ప్రజాధనం లూటీ చేసిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును విడిచిపెట్టమని, తిన్న సొమ్ము కక్కించేదాక వదలమని ఏఐసీసీ అగ్ర నేత రాహుల్ గాంధీ అన్నారు. మంగళవారం కొల్లాపూర్ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన సభలో ఆయన కేసీఆర్‌ పాలనపై నిప్పులు చెరిగారు. తెలంగాణ రాష్ట్ర ఖజానా మొత్తం కల్వకుంట్ల కుటుంబం దోచుకుని దాచుకుందని, ఈ కుటుంబంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు పంచుకున్నారన్నార‌ని మండిప‌డ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందని, ఈ డబ్బంతా కేసీఆర్ దగ్గర ఉందని రాహుల్ అన్నారు.



 ఇంత అవినీతి జరిగినందుకే ఈ ప్రాజెక్టు అప్పుడే శిథిలావస్థ‌కు చేరుకుంద‌ని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో నిర్మించిన నాగార్జున సాగర్, శ్రీరామ్ సాగర్, జూరాల, ఇంకా పలు ప్రాజెక్టులు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయన్నారు. తెలంగాణలో అభివృద్ధి పేరుతో అంతా అవినీతి జరుగుతున్న‌ద‌ని విమ‌ర్శించారు. దోచిన డబ్బు తిరిగి తెప్పించి, తెలంగాణ ప్రజల అభివృద్ధికి ఖర్చు చేస్తామ‌ని రాహుల్ పేర్కొన్నారు. బీజేపీ, బీఆరెస్‌, ఎంఐఎం ఒకే తాను గుడ్డలని రాహుల్ ఆరోపించారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీకి ఎంఐఎం మద్దతుగా నిలుస్తుందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఈ మూడు పార్టీలు ఒక్కటిగా ఉంటాయని చెప్పారు.


ధ‌ర‌ణితో భూములు గుంజుకునే య‌త్నం


తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు సోనియా గాంధీ ప్రతేక రాష్ట్రం ఇస్తే ఇక్కడ ఉన్న కేసీఆర్‌ తెలంగాణను ఆగం చేశారని రాహుల్ అన్నారు. రెవిన్యూ, ఎక్సైజ్‌, ఇతర కీల‌క శాఖ‌లు కేసీఆర్ కుటుంబం ఆధీనంలోనే ఉన్నాయ‌ని అన్నారు. ఆ శాఖ‌ల నుంచి వచ్చే డ‌బ్బంతా కేసీఆర్ కుటుంబానికికే అందుతున్న‌ద‌ని విమ‌ర్శించారు. ధరణి పోర్టల్ తెచ్చి రైతుల భూములు లాక్కునే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నార‌ని ఆరోపించారు. ధరణి ని రద్దు చేస్తేనే రైతుల భూములకు రక్షణ ఉంటుందన్నారు. 



కెసిఆర్ ఎన్ని అక్రమాలు చేసిన ఈడి, సిబిఐ దాడులు ఉండవని, కాంగ్రెస్ నేతలు అవినీతికి పాల్పడకున్నా బీజేపీ చేతిలో ఉన్న ఈడి, సిబిఐ తో దాడులు చేస్తుంన్నదన్నారు. కెసిఆర్, మంత్రుల, ఎమ్మెల్యే అవినీతి బీజేపీ కి కనపడం లేదా అని, దదీన్ని బట్టి చూస్తే బీజేపీ, బీ ఆర్ ఎస్ ఒక్కటే అని ప్రజలు తెలుసుకోవాలని రాహుల్ అన్నారు.తెలంగాణ లో వచ్చే ఎన్నికల్లో ప్రజలు మోసపోకుండా తెలంగాణ రాష్ట్ర o ఇచ్చిన కాంగ్రెస్ కు అండగా ఉండాలని రాహుల్ కోరారు.


ఆరు గ్యారెంటీలు ఖాయం


కాంగ్రెస్ పార్టీ ప్ర‌క‌టించిన‌ ఆరు గ్యారంటీలను తాము అధికారంలోకి రాగానే అమ‌లు చేస్తామ‌ని కొల్లాపూర్ స‌భ సాక్షిగా హామీ ఇస్తున్నాన‌ని రాహుల్‌గాంధీ చెప్పారు. రైతులతో పాటు కౌలు రైతులకు ఆర్థిక స‌హాయం అందిస్తామ‌ని, పేదలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ ఇస్తామని తెలిపారు. చేయూత పథకం కింద నాలుగు వేలు అందిస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వస్తేనే పేదల బతుకులు బాగుపడతాయన్నారు. అనారోగ్యంతో ప్రియాంక రాలేక పోవడంతో ఢిల్లీ కేంద్ర ఎన్నికల కమిటీ ముఖ్య సమావేశం ఉన్నా తెలంగాణ ప్రజల కోసం ఇక్కడికి వ‌చ్చాన‌ని రాహుల్‌గాంధీ చెప్పారు.


కొల్లాపూర్‌కు వస్తానని ప్రియాంక హామీ ఇచ్చార‌ని, అనారోగ్యం కారణంగా ఆమె రాలేకపోవడంతో మీరు నిరాశ చెందవద్దనే ఉద్దేశంతో తానే వ‌చ్చాన‌ని తెలిపారు. రాహుల్ వెంట, తెలంగాణ రాష్ట్ర పరిశీలకులు మాణిక్ రావు ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, నేతలు భ‌ట్టి విక్రమార్క, కాంగ్రెస్ అభ్యర్థులు జూపల్లి కృష్ణారావు, ఎన్నం శ్రీనివాస్ రెడ్డి, వంశీ కృష్ణ, సంపత్ కుమార్, సరిత రాజేష్ రెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి ఇతర కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.


సోనియ‌మ్మ రుణం తీర్చుకుందాం


ల‌క్ష కోట్లు దోచుకున్న కేసీఆర్‌.. మ‌రో ల‌క్ష కోట్లు దోచుకునేందుకే మ‌రోసారి గెలిపించాల‌ని కోరుతున్నార‌ని టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. బీఆరెస్ మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తే.. రాష్ట్రాన్ని కొల్ల‌గొడ‌తార‌ని హెచ్చ‌రించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చి, తెలంగాణ కల సాకారం చేసిన సోనియమ్మ రుణం తీర్చుకుందామ‌ని పిలుపునిచ్చారు. పేదోళ్ల దేవత ఇందిరమ్మని, పేదల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ఉక్కుమహిళని అన్నారు. చివరి రక్తపు బొట్టు వరకు దేశం కోసం తపించిన వీర వనిత వర్ధంతి సందర్భంగా రేవంత్‌రెడ్డి నివాళుల‌ర్పించారు.


ఇందిరమ్మ రాజ్యంలోనే పేదలకు సంక్షేమ ఫలాలు అందుతాయి. పాలమూరు జిల్లాలో 14 కు 14 సీట్ల‌లో కాంగ్రెస్‌ను గెలిపించాల్సిన బాధ్యత ఇక్కడి ప్రజలపై ఉంద‌ని చెప్పారు. పాలమూరు పసిడి పంటల జిల్లాగా మారాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాల‌న్నారు. రైతు భ‌రోసాతో రైతుల‌కు 15వేలు, రైతు కూలీల‌కు 12వేలు సోనియాగాంధీ ప్ర‌క‌టించార‌న్న రేవంత్‌రెడ్డి.. కాంగ్రెస్ వస్తే రైతు బంధు రద్దవుతుందని కేసీఆర్ అన‌డానికి బుద్ధి లేదా? అని ప్ర‌శ్నించారు.


దుబ్బాక బీఆరెస్ అభ్యర్థిపై దాడి నెపం కాంగ్రెస్ పై నెట్టే ప్రయత్నం చేస్తున్నార‌ని రేవంత్‌రెడ్డి విమ‌ర్శించారు. దాడులు చేయద‌లచుకుంటే కేసీఆర్‌, ఆయ‌న కుటుంబం బ‌య‌ట తిరిగేది కాద‌ని అన్నారు. ప్రాణాలు ఇవ్వడమే కానీ… దాడుల సంస్కృతి కాంగ్రెస్‌ది కాద‌ని స్ప‌ష్టం చేశారు. కాంగ్రెస్ పై నెపం నెట్టి బీఆరెస్ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్న‌ద‌ని చెప్పారు.