రాఖీకి దూరమైన రాజకీయ తోబుట్టువులు!

తెలుగు రాష్ట్రాలలో ఒకప్పుడు రాఖీ పండుగకు స్పెషల్ అట్రాక్షన్ గా హంగామా చేసిన ఆ రాజకీయ తోబుట్టువులను మాత్రం రాఖీ పండుగ కూడా దగ్గర చేయలేకపోతుండటం ఆసక్తికరం. వారెవరో కాదు..తెలంగాణలో కల్వకుంట్ల అన్నా చెల్లెళ్లు కేటీఆర్ కవిత, ఏపీలో వైఎస్ అన్నా చెల్లెళ్లు జగన్, షర్మిలలు.

విధాత, హైదరాబాద్ : రక్షాబంధన్(రాఖీ పౌర్ణమి) పండుగ.. అన్నాచెల్లెళ్లు, అక్కా తమ్ముళ్లు రాఖీలు కట్టుకుని పరస్పర ప్రేమాభిమానాలను చాటుకునే ఆత్మీయ అనుబంధాల పర్వదినం. ఆస్తుల గొడవలు, మాట పట్టింపులతో దూరమైన వారు కూడా రాఖీ పండుగ వేదికగా తమ అనుబంధాలను, రక్త సంబంధాలను గుర్తుచేసుకుంటూ దగ్గరవుతుండటం చూస్తుంటాం. కాని తెలుగు రాష్ట్రాలలో ఒకప్పుడు రాఖీ పండుగకు స్పెషల్ అట్రాక్షన్ గా హంగామా చేసిన ఆ రాజకీయ తోబుట్టువులను మాత్రం రాఖీ పండుగ కూడా దగ్గర చేయలేకపోతుండటం ఆసక్తికరం. వారెవరో కాదు..తెలంగాణలో కల్వకుంట్ల అన్నా చెల్లెళ్లు కేటీఆర్ కవిత, ఏపీలో వైఎస్ అన్నా చెల్లెళ్లు జగన్, షర్మిలలు.

ఆస్తుల వివాదాలు..రాజకీయ పంతాలతో రాఖీ వేడులకు దూరం..

బీఆర్ఎస్ లో తనకు సరైన స్థానంతో పాటు తండ్రి కేసీఆర్ ఆస్తులలో సరైన వాటా దక్కడం లేదన్న వివాదాల నేపథ్యంలో కల్వకుంట్ల అన్నా చెల్లెళ్లు కేటీఆర్, కవితలు విడిపోగా..ఏకంగా కవిత తెలంగాణ రక్షణ సమితి పేరుతో సొంత పార్టీనే పెట్టి తన రాజకీయం తాను కొనసాగిస్తుంది. తరుచూ అధికార కాంగ్రెస్, బీజేపీలతో పాటు తండ్రి కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ విధానాలపైన, సోదరుడు కేటీఆర్, బావ హరీశ్ రావులపైన విమర్శలు సంధిస్తూ రాజకీయాల్లో తనదైన ప్రత్యేక ముద్ర కొనసాగిస్తుంది. ఈ నేపథ్యంలో అన్నా చెల్లెళ్లు కేటీఆర్- కవితల మధ్య దూరం పెరిగిపోయింది. అయినా తను ఓ సోదరిగా కేటీఆర్ కు రాఖీ పండుగ రోజున రాఖీ కట్టేందుకు సిద్దమేనని.. గతేడాది రాఖీ కడుతానంటే హైదరాబాద్ లో ఉండకుండా పోయాడని, ఈ దఫా అడగకుండానే విదేశాలకు పోయాడని కవిత తాజాగా వెల్లడించారు. ఆడబిడ్డలుగా మాకూ ఆత్మగౌరవం ఉంటుందని, మాకూ రోషం ఉందని, ఎన్నిసార్లు అడుగుతామని కేటీఆర్ తీరుపై సోదరి కవిత అసహనం వ్యక్తం చేశారు.

వైఎస్ అన్నాచెల్లెళ్లు కూడా అదే దారి..

ఇక వైఎస్ జగన్ – షర్మిలల వ్యవహారం కూడా సరిగ్గా కేటీఆర్- కవితల తరహా పంచాయతీనే కావడం విశేషం. రాజకీయ గుర్తింపు, తండ్రి ఆస్తుల వాటాల తేడాలతో పరస్పరం దూరమైపోయిన జగన్ – షర్మిలలు .. రక్షా బంధన్ వేడుకలకు దూరం అయిపోయారు. జగన్ – షర్మిలల మధ్య ఆస్తుల వివాదాలు కొనసాగుతుండగా..ఇంకోవైపు సొంత రాజకీయ అస్తిత్వం కోసం షర్మిల ముందుగా సొంత పార్టీ పెట్టి..ప్రస్తుతం కాంగ్రెస్ ఏపీ చీఫ్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. నాయకులుగా ఆదర్శనీయ స్థితిలో రక్త సంబంధాన్ని గౌరవించి, తోబుట్టవుల అనుబంధాలను చాటాల్సిన కల్వకుంట్ల, వైఎస్ అన్నా చెల్లెళ్లు ఆర్థిక, రాజకీయ వివాదాలతో పరస్పరం దూరంగా ఉండటం విచారకరమే.

రేవంత్ వ్యవహార శైలిపై చర్చ..!

రక్తం పంచుకుని పుట్టిన చెల్లెళ్లను కేటీఆర్, జగన్ లు దూరం చేసుకున్న వేళ..తాజాగా సీఎం రేవంత్ రెడ్డి మంత్రి కొండా సురేఖను రాఖీ కట్టేందుకు తన ఇంటికి ఆహ్వానించడం తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో ఆసక్తిగా నిలిచింది. ఇటీవలే కొండా సురేఖ కూతురు సుస్మిత సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేయడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. కూతురు వ్యాఖ్యలను సురేఖ ఖండించనూలేదు. ఈ వివాదంతో సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రి కొండా సురేఖకు దూరం పెరిగిపోయింది.

అయినా రేవంత్ రెడ్డి రాఖీ పండుగ రోజు కొండా సురేఖను తన ఇంటికి అనుమతించి..రాఖీ కట్టించుకోవడం రాజకీయ వర్గాలను సైతం విస్మయ పరిచిందని చెప్పవచ్చు. కొండా సురేఖను కేబినెట్ నుంచి తొలగించాలని ఓ వైపు రేవంత్ వర్గం ఎమ్మెల్యేల, ఎమ్మెల్సీల డిమాండ్.. ఇంకోవైపు క్రమశిక్షణా సంఘం సిఫారసు చేసినప్పటికి అవన్ని మనసులో పెట్టుకోకుండా కొండా సురేఖతో రాఖీ వేడుక జరుపుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. తన పెద్దమనసుతో సీఎం రేవంత్ రెడ్డి ఓ రకంగా రాజకీయంగానే కాదు..వ్యక్తిత్వపరంగా కూడా ప్రత్యర్థులపై పైచేయి సాధించారని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

 

Latest News