ధ‌ర‌ణిక‌న్నా మేలైన‌ది తెస్తాం: రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తే ఉచిత విద్యుత్తు ఇవ్వ‌ద‌ని సీఎం కేసీఆర్ చెప్ప‌డంపై పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు

  • Publish Date - November 11, 2023 / 12:41 PM IST
  • కేసీఆర్‌కు ఆకలి ఎక్కువ ఆలోచన తక్కువ
  • మేడిగడ్డ పనికిరాదు.. అన్నారం అక్కరకు రాదు
  • కాంగ్రెస్ నిర్మించిన ప్రాజెక్టు చెక్కుచెదరలేదు
  • ఎమ్మెల్యే దుర్గం చిన్న‌య్య దుర్మార్గుడు
  • జైల్లో పెట్టాల్సిన వ్య‌క్తికి బీఆరెస్ టికెట్టా?
  • స్వ‌రాష్ట్రంలోనూ అభివృద్ధికి నోచ‌ని జిల్లా
  • ఆదిలాబాద్‌ను దత్తత తీసుకొని అభివృద్ధి
  • రైతులకు 24 గంటలు ఉచిత కరెంట్ ఇస్తాం
  • ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి 5 లక్షల ఇస్తాం
  • బెల్లంప‌ల్లి స‌భ‌లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి


విధాత ప్ర‌తినిధి, ఉమ్మడి అదిలాబాద్: కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తే ఉచిత విద్యుత్తు ఇవ్వ‌ద‌ని సీఎం కేసీఆర్ చెప్ప‌డంపై పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు అప్ప‌డ‌ప్పుడు పిసలేస్త‌ద‌, ఎప్పుడు ఏం మాట్లాడుతారో తెలియ‌ద‌ని అన్నారు. ఉచిత విద్యుత్తు అనేది వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ప్రారంభించార‌ని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలో రాగానే 24 గంటల ఉచిత విద్యుత్తు ఇస్తామని స్ప‌ష్టం చేశారు. ధరణి తీసేసి దాని స్థానంలో కొత్త పోర్ట‌ల్ తీసుకువ‌స్తామ‌ని, భూ స‌మ‌స్య‌ల‌న్నీ ప‌రిష్క‌రిస్తామ‌ని హామీ ఇచ్చారు.


రైతులకు ఎకరానికి 15,000 రైతు భరోసా ఇస్తామని తెలిపారు. కౌలు రైతుకు సైతం 15వేల రూపాయలు అందజేస్తామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన సాగునీటి ప్రాజెక్టుల‌న్నీ 60, 70 ఏళ్లు దాటినా చెక్కుచెదరకుండా పటిష్టంగా ఉన్నాయని, సీఎం కేసీఆర్ అద్భుతమని చెప్పి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నాలుగేళ్లకే కుంగడం, బుంగలు పడటం బీఆరెస్‌ ప్రభుత్వ పనితీరుకు నిదర్శమని రేవంత్‌రెడ్డి అన్నారు.


శ‌నివారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో ఏర్పాటుచేసిన భారీ బహిరంగ సభలో ఆయ‌న మాట్లాడుతూ కాంగ్రెస్ హ‌యాంలో చేప‌ట్టిన‌ ప్రాణ‌హిత-చేవెళ్ల ప్రాజెక్టు పూర్త‌యితే ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో 1.60 ల‌క్ష‌ల ఎక‌రాల‌కు నీళ్లు అందించే అవ‌కాశం ఉండేద‌ని చెప్పారు. తుమ్మ‌డి హెట్టి వ‌ద్ద నిర్మించాల్సిన ప్రాజెక్టును మేడిగ‌డ్డ వ‌ద్ద నిర్మించార‌ని చెప్పారు. కాళేశ్వ‌రం పేరుతో నాణ్య‌త లేకుండా క‌ట్ట‌డంతో బ‌రాజ్ కుంగిపోయింద‌ని విమ‌ర్శించారు. 38,500 కోట్ల అంచనాతో ప్రారంభమైన కాళేశ్వరం ప్రాజెక్టును 1,50,000 కోట్లతో నిర్మించాడని ఆరోపించారు.


గోదావరి రావడంతో మోట‌ర్లు మునిగిపోయాయ‌ని, మేడిగడ్డ కుంగిందని, అన్నారం పగిలిందని విమర్శించారు. నాణ్యత లోపాలతో ఇసుకతో నిర్మాణం చేస్తే ఇలానే కుంగుతాయని అన్నారు. కేసీఆర్‌కు ఆకలి ఎక్కువ, ఆలోచన తక్కువని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అందుకే ఇలాంటి నాసిరకం నిర్మాణాలు చేపట్టారని పేర్కొన్నారు. ఇసుక మీద ప్రాజెక్టులు, బ‌రాజ్‌లు క‌డితే ఇలా ఉంటాయ‌న్న రేవంత్‌రెడ్డి.. మేడిగడ్డ అణా పైసాకు పనికిరాదని, అన్నారం అక్కరకు రాద‌ని అన్నారు.


చిన్న‌య్య‌ను జైల్లో పెట్టాలి


బెల్లంప‌ల్లి ఎమ్మెల్యేపై తీవ్ర‌స్థాయిలో విరుచుప‌డిన రేవంత్‌రెడ్డి.. నియోజకవర్గంలో దుర్మార్గుడు దుర్గం చిన్నయ్య ఉన్నాడని, ఖాళీ జాగా క‌నిపించినా, ఆడ‌పిల్ల క‌నిపించినా క‌బ్జాచేసే ర‌క‌మ‌ని విమ‌ర్శించారు. అలాంటి వ్య‌క్తిని జైల్లో పెట్టాల్సిందిపోయి.. ఆయ‌న‌కు టికెట్ ఇచ్చి గెలిపించాల‌ని కేసీఆర్ కోరుతున్నార‌ని మండిప‌డ్డారు. ఇంత‌కంటే సిగ్గుమాలిన ప‌ని ఉండ‌ద‌న్నారు.


చిన్న‌య్య గెలిస్తే మ‌ళ్లీ ఆడ‌పిల్ల‌ల‌కు ర‌క్ష‌ణ ఉండ‌ద‌ని, ఖాళీ భూములు క‌బ్జాల‌కు గుర‌వుతాయ‌ని హెచ్చ‌రించారు. చెన్నూరులో బాల్క సుమ‌న్ ఐదేళ్ల కాలంలో వేల కోట్లు ఎలా సంపాదించాడ‌ని ప్ర‌శ్నించారు. గడ్డం వివేక్ రోజుకు 18 గంటల కష్టపడి వ్యాపారం చేసి ఓ స్థితికి వచ్చాడని తెలిపారు. ఆయన సంపాదించిన డబ్బులతో పేదలను ఆదుకుంటున్నాడని చెప్పారు.


సింగ‌రేణి భూములు అమ్ముకున్న సుమ‌న్‌


సింగరేణి భూములు, ఉద్యోగాల‌ను బాల్క సుమ‌న్ అమ్ముకున్నాడ‌ని రేవంత్ విమ‌ర్శించారు. సింగరేణి డిపెండెంట్ సర్టిఫికెట్ల కోసం లక్షలు దండుకున్నాడ‌ని, అక్రమంగా ఇసుక అమ్ముకున్నారని ఆరోపించారు. ప్రజల సంక్షేమం కన్నా అక్రమ సంపాదనపైనే బాల్క సుమ‌న్ దృష్టిసారించాడ‌ని విమ‌ర్శించారు. ప్ర‌శ్నించిన‌వారిపై అక్ర‌మ‌కేసులు పెట్టాడ‌ని, తాము గెల‌వ‌గానే చిన్న‌య్య‌, సుమ‌న్ పెట్టించిన అక్ర‌మ‌కేసుల‌ను ర‌ద్దు చేస్తామ‌ని హామీ ఇచ్చారు.


ఆదిలాబాద్ జిల్లా వెనుకబడిందని, ఈ జిల్లాను దత్తత తీసుకొని అభివృద్ధి పథంలో తీసుకువస్తాన‌ని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గడ్డం వినోద్, గడ్డం వివేక్ గడ్డం వంశీకృష్ణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తొలుత ఆయ‌న‌కు కాంగ్రెస్ పార్టీ మంచిర్యాల‌ జిల్లా అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, బెల్లంపల్లి, చెన్నూరు అభ్యర్థులు వినోద్, వివేక్ ఘనంగా స్వాగతం పలికారు.