కేసీఆర్ నియంత పాలన పోవాలి: రేవంత్ రెడ్డి

  • Publish Date - November 3, 2023 / 08:14 AM IST
  • ప్రజాస్వామిక తెలంగాణ రావాలి
  • కేసీఆర్ క్రిమినల్ పొలిటిషియన్‌
  • మీట్ ది ప్రెస్ లో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి



విధాత: బలిదానాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ సాగిస్తున్న నియంతృత్వ, అవినీతి, కుటుంబ పాలన పోయి ప్రజాస్వామిక తెలంగాణ రావాలని కాంగ్రెస్ కోరుతుందని ఈ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించి ప్రజా తెలంగాణకు పట్టం కట్టాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం హైద్రాబాద్ ప్రెస్ క్లబ్‌లో ఆయన మీట్ ది ప్రెస్‌లో మాట్లాడుతూ.. కేసీఆర్ కుటుంబం బాగుపడాలని తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ ఇవ్వలేదన్నారు.తెలంగాణ ప్రజల పోరాటంలో న్యాయం, ధర్మం ఉందని నమ్మిన సోనియాగాంధీ ఏపీలో కాంగ్రెస్ భవిష్యత్తును ఫణంగా పెట్టి తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చారన్నారు.


కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రభుత్వాన్ని చూసి ప్రజలే భయపడేలా కేసీఆర్ పాలన సాగుతుందన్నారు. కేసీఆర్ ఎప్పుడూ చెప్పే మాట మట్టికి పోయిన ఇంటోడు పోవాలని అంటాడని, ఆయన చెప్పిన నీళ్లు రాలేదని, పల్లెలకు నిధులు అందలేదని, ఇచ్చిన హామీలు ఏవి అమలు కాలేదన్నారు. రాచరిక పోకడలు కనిపించేలా సర్కార్ అధికారిక ముద్ర ఉందన్నారు. అందులో త్యాగాల గుర్తులు లేవన్నారు. ఉద్యమ ఆకాంక్షలు విస్మరించబడగా, ప్రశ్నించిన ప్రజల హక్కులను ప్రభుత్వం కాలరాసిందన్నారు. ఉద్యమంలో టీజీ అని రాసుకుంటే కేసీఆర్ వచ్చాక టీఆర్‌ఎస్ కనిపించేలా టీఎస్ రాసిండని విమర్శించారు.


తెలంగాణ తల్లి కూడా శ్రీమంతుల తల్లిగా భుజకీర్తిలతో కనిపిస్తుందన్నారు. సమైక్య పాలనలో సీమాంధ్రుల చేతుల్లో తెలంగాణ ప్రాంతం నలిగిపోతుందని, మా నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ కావాలని పోరాటం చేశామని తెలిపారు. రాష్ట్రం కోసం వందలాది మంది ప్రాణాలు బలితీసుకున్నారన్నారు. ఒక్క కేసీఆర్ దీక్ష చేస్తే తెలంగాణ రాలేదన్నారు. తెలంగాణ గురించి మాట్లాడాలంటే జూన్ 2, 2014 ముందు, వెనుక అంటామన్నారు. కేసీఆర్ చెప్పిన బంగారు తెలంగాణ ఫలాలు ఎవరికి అందడం లేదన్నారు. డబ్బు, మద్యం పంపిణీ చేయకుండా ఎన్నికల్లో తలపడాలన్న తన సవాల్‌ను బీఆరెస్ స్వీకరించాలన్నారు.


కల్లలైన ఉద్యమ ఆకాంక్షలు


స్వరాష్ట్రంలో ఎన్నో మార్పులు వస్తాయని ఆశించిన యువత ఆశలు అడియాశలయ్యాయని, పరీక్షల నిర్వాహణలో టీఎస్‌పీఎస్సీ విఫలమైందన్నారు.ప్రజా సంఘాలకు, అఖిల పక్ష నేతలకు ప్రాధాన్యత లేకుండా పోయిందని, అసెంబ్లీ హాల్‌లో కూడా ప్రతిపక్ష నేతల సీట్లు మార్చారని, మీడియాపై ఆంక్షలు పెట్టారని, సచివాలయంలో ప్రవేశానికి నో ఎంట్రీ అంటున్నాని దుయ్య బట్టారు. ప్రతిపక్ష నాయకులకు కూడా అనుమతి లేదన్నారు. ఉద్యమ సమయంలో కూడా ఇలాంటి అణిచివేత పరిస్థితి కనిపించలేదన్నారు.


గతంలో సీఎంను ఎవరైనా నేరుగా కలిసే అవకాశం ఉండేదని, కేసీఆర్ నియంత పాలనలో ప్రగతి భవన్ గడిగా మారిందన్నారు. కేసీఆర్‌ నియంత మాత్రమే కాదని, క్రిమినల్ పొలిటిషన్ అని రేవంత్ ఆరోపించారు. నియంత ముసుగులో ఉన్న క్రిమినల్ కేసీఆర్‌ను ఎదుర్కోనేందుకు కొత్త దారులు వెతుక్కోవాల్సివుందన్నారు. అన్నివర్గాల ప్రజలను మోసం చేసిన కేసీఆర్ చివరకు జర్నలిస్టులను కూడా మోసం చేశారన్నారు. కాళేశ్వరం పేరుతో రాష్ట్రం అప్పుల పాలవ్వగా, కేసీఆర్ పాపాల పుట్ట పగిలిందని, మేడిగడ్డ బ్యారేజీ కుంగిందని, అన్నారం పలిగిందని, నాణ్యత లేకుండా ప్రాజెక్టులు కట్టారని విమర్శించారు.


కేసీఆర్ ఉద్యమ కాలంలో, గత రెండు అసెబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు కాలేదన్నారు. కేసీఆర్ ఇచ్చిన పాత హామీల అమలునే ప్రజలు నేటికి డిమాండ్ చేస్తున్నారన్నారు. కాళోజీ స్ఫూర్తితో తెలంగాణకు మోసం చేసిన ద్రోహి కేసీఆర్‌ను తరమాలని పిలుపునిచ్చారు. తెలంగాణకు దేశంలోనే ప్రత్యేక స్థానముందన్నారు. ఇప్పుడేమో కర్ణాకటలో ఇది చేస్తలేదు అది చేస్తలేదని అంటున్నారని బీఆరెస్‌పై మండిపడ్డారు. కర్ణాకటలో కాంగ్రెస్ గెలవడం ద్రోహం, నేరం అంటున్నారని.. మరి బీజేపీ గెలవాలా అని ప్రశ్నించారు.


అంటే బీజేపీ, బీఆర్‌ఎస్ ఒక్కటే అని.. మోడీ కేడీ ఒక్కటే అంటూ వ్యాఖ్యలు చేశారు. మంత్రి కేటీఆర్ పప్పు వ్యాఖ్యలపై స్పందిస్తూ నేను ప్రజలకు ఆరోగ్యాన్నిచ్చే కంది పప్పు అని, కేటీఆర్ ప్రాణాలు తీసే గన్నేరు పప్పు అని దుయ్యబట్టారు. కమ్యూనిస్టులతో పొత్తుల చర్చలు ముగిసిపోలేదన్నారు. కాంగ్రెస్ దశాబ్ధాల పాలనపైన, బీఆరెస్ పదేళ్ల పాలనపైన చర్చకు సిద్దమని సవాల్ చేశారు. మా పార్టీ నుంచి నేను, భట్టి వస్తామని, మిగతా పార్టీల నుంచి ఇద్దరు చొప్పున రావాలని సవాల్ చేశారు.


2050 ప్రణాళికతో ముందుకు..


బీఆరెస్ పాలనలో ధ్వంసమైన తెలంగాణ పునర్ నిర్మాణానికి పక్కాగా 2050 ప్రణాళికతో ముందుకొస్తున్నామన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించబోతుందన్నారు. తమ పార్టీ ఇచ్చిన ప్రతి ఎన్నికల వాగ్ధానాలను అధికారంలో వచ్చిన మొదటి రోజు నుంచే అమలు చేస్తుందన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్న చరిత్ర ఉన్న పార్టీ అన్నారు. నిరుద్యోగులు, రైతులు, మహిళలు, విద్యార్థుల ఆకాంక్షలను కాంగ్రెస్ నెరవేరుస్తుందన్నారు.