మేడిగడ్డ పరీక్షల పూర్తికి మే నెలాఖరు డెడ్‌లైన్‌.. బరాజ్‌ను సందర్శించిన సీఎం రేవంత్..

మేడిగడ్డ బరాజ్‌ను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. రూ.198 కోట్లతో కాళేశ్వరం దేవాలయ పునరాభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

విధాత, ప్రత్యేక ప్రతినిధి:

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం పునరాభివృద్ధి పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమిపూజ నిర్వహించారు. అనంతరం కాళేశ్వరం బస్‌స్టేషన్‌కు శంకుస్థాపన చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం కాళేశ్వరంతోపాటు మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా కాళేశ్వరంలో రూ.198 కోట్లతో చేపట్టిన శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం పునరాభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. తదుపరి కాళేశ్వర ముక్తేశ్వర స్వామినీ, శుభానందాదేవి అమ్మవారిని దర్శనం సీఎం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సీఎంతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎంపీ గడ్డం వంశీకృష్ణ తదితరులు ఉన్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో కాళేశ్వరం చేరుకున్న సీఎంకు మంత్రులు శ్రీధర్ బాబు, వివేక్ వెంకటస్వామి తదితరులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సంకీర్త్ తదితరులు పాల్గొన్నారు. హెలిపాడ్ నుంచి కాళేశ్వరం ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రికి దేవస్థాన మర్యాదల్లో భాగంగా పూర్ణకుంభ స్వాగతం పలికారు.

మేడిగడ్డ బరాజ్ వద్ద పనులు పరిశీలన

కాళేశ్వరం ముక్తేశ్వర ఆలయంలో మొక్కులు సమర్పించుకున్న అనంతరం ఆయన మేడిగడ్డ బరాజ్‌కు రోడ్డు మార్గంలో వెళ్ళారు. అక్కడ బరాజ్ పునరుద్ధరణ కోసం చేపట్టిన పరీక్షలను స్వయంగా పరిశీలించారు. మేడిగడ్డ బరాజ్ 20, 21, 22 పియర్స్ వద్ద బోర్ రిగ్స్ ద్వారా జియో టెక్నికల్, జియో ఫిజికల్, జీపీఆర్, శాంపిల్స్ సేకరణను పనులను సీఎం, మంత్రులు, ఉన్నతాధికారులు స్వయంగా పరిశీలించారు. 520 బోర్ రిగ్స్ ద్వారా శాంపిల్స్ సేకరించి CWPRS కు వీటిని ప్రభుత్వం పంపిస్తోంది. అక్కడ ల్యాబ్‌లో పరీక్షల అనంతరం బరాజ్ డ్యామేజీపై పూర్తి అవగాహన రానుంది. బరాజ్ వద్ద సీకేంట్ పైల్స్‌కు సంబంధించి ప్యారలల్ క్రాస్ హోల్ సెస్మిక్ టెస్ట్ వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ పనులు పూర్తయి ల్యాబ్ రిపోర్టు వచ్చిన తర్వాత బరాజ్ పునరుద్ధరణ కోసం ప్రత్యేకంగా రూపొందించే డిజైన్‌ను ఎన్డీఎస్ఎ ఆమోదంతో చేపట్టనున్నారు. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. తాజాగా సేకరిస్తున్న శాంపిల్స్‌తో బరాజ్‌కు వినియోగించిన సిమెంట్, స్టీల్ క్వాంటిట్, నిర్మాణాల నాణ్యత, సామర్ధ్యం తదితర విషయాలు వెల్లడికానున్నాయి. ఒక విధంగా ప్రస్తుతం నిర్వహిస్తున్న పరీక్షలతో బరాజ్ శక్తి, సామార్ధ్యాలు, లోపాలు వెలుగు చూసే అవకాశం ఉంది. దీంతో చేపట్టాల్సిన చర్యలు, బరాజ్ పునరుద్ధరకు అవసరమైన ప్లాన్ రూపొందించేందుకు మార్గం సుగమం అవుతోంది. దీనికోసం వివిధ విభాగాల మధ్య సమన్వయం కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు.

ఈ వేసవినాటికి, వర్షాకాలం ప్రారంభానికి ముందే ఈ పనులన్నీ పూర్తి చేస్తే తదుపరి పునురుద్ధరణ పనులు చేపట్టేందుకు వీలుంటుందని భావించి మే చివరి నాటికి అవసరమైన పరీక్షలు పూర్తి చేయాలని డెడ్ లైన్ విధించారు. పనుల పరిశీలన అనంతరం సీఎం, మంత్రులు ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్షించారు. ఇప్పటి వరకు చేపట్టిన పనుల వివరాలు, సమస్యలను ఈ సందర్భంగా సీఎంకు నివేదించారు. అంనతరం సీఎం తగిన సూచనలు చేశారు. అనంతరం కాటారం మండంలోనిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొననున్నారు.

ఇవి కూడా చదవండి :

త్వరలో భూముల విలువలు పెంపు…రిజిస్ట్రేషన్ ఛార్జీల మోత తప్పదా
పరిషత్ ఎన్నికలు ఇప్పట్లో లేనట్లే.. అవి వచ్చాకే నిర్వహణ..

Latest News