హైలైట్స్:
- ముత్తోజిపేటలో మృతదేహం వద్ద తీవ్ర ఉద్రిక్తత
- నర్సంపేటకు తరలించేందుకు కార్మికుల యత్నం
- పోలీసులు, ఆర్టీసీ కార్మికుల మధ్య తీవ్ర వివాదం
- బీఆర్ఎస్, రాజకీయవర్గాల రాకతో టెన్షన్, టెన్షన్
- మాజీ ఎమ్మెల్యే పెద్దిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
విధాత, ప్రత్యేక ప్రతినిధి:
డ్రైవర్ శంకర్ గౌడ్ మృతితో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె హైటెన్షన్‌లోకి వెళ్ళింది. రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. శుక్రవారం ఉదయం నుంచి ముత్తోజిపేటలో శంకర్ గౌడ్ మృతదేహం వద్ద క్షణం క్షణం ఏమవుతోందనే టెన్షన్ వాతావరణం నెలకొంది. శంకర్ గౌడ్ మృతి ప్రభావం ఉమ్మడి వరంగల్ జిల్లాలో తీవ్ర ప్రభావానికి గురిచేయగా, నర్సంపేటలో బంద్ కు పిలుపునిచ్చారు. బంద్‌కు అన్నివర్గాలు మద్దతు తెలుపడంతో తీవ్ర ఉద్రిక్తంగా మారింది. ఆర్టీసీ సమ్మె మూడవ రోజుకు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా కార్మికుల నిరసనలతో సమ్మె కొనసాగుతుండగా, రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కార్మిక జేఏసీ ప్రతినిధులను చర్చలకు ఆహ్వానించారు. రాష్ట్ర సచివాలయంలో ముందుగా ఐఏఎస్ అధికారుల కమిటీతో చర్చిస్తారు. అనంతరం ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నంతో జేఏసీ ప్రతినిధులు చర్చిస్తారు. ఒక వైపు శంకర్ గౌడ్ సజీవదహనం, మరో వైపు ప్రభుత్వంతో చర్చల నేపథ్యంలో సమస్యల పరిష్కారం ఓ కొలిక్కివస్తాయనే ఆశాభావం సర్వత్రా వ్యక్తమవుతోంది. లేకుంటే సమ్మెను మరింత తీవ్రం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే ఆర్టీసీ కార్మిక జేఏసీ ప్రకటించింది.
ఇదిలా ఉండగా నర్సంపేటతోపాటు, నల్లగొండలో ఒక డ్రైవర్ ఆత్మహత్యాయత్నం చేయగా తోటి కార్మికులు అడ్డుకున్న విషయం తెలిసిందే. భూపాలపల్లి డిపోలో పనిచేసే రవీందర్ అనే డ్రైవర్ పురుగుల మందు తాగగా, చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అయితే వ్యక్తిగత కారణాలతో ఆయన ఆత్మహత్యకు యత్నించినట్లు చెబుతున్నారు. మరో డ్రైవర్ భద్రాచలం జిల్లాలో ఆత్మహత్యకు పాల్పడినట్లు చెబుతున్నారు. వరుస సంఘటనలో సమ్మెపై తీవ్ర ప్రభావం కనబరుస్తోందని అంటున్నారు.
ముత్తోజీపేటలో టెన్షన్ టెన్షన్
గురువారం ఒంటిపై పెట్రోల్ పోసుకొని సజీవ దహనానికి పాల్పడిన వరంగల్ జిల్లా నర్సంపేట డిపోలో డ్రైవర్‌గా పనిచేసే కోలా శంకర్ గౌడ్ (56) శుక్రవారం అర్ధరాత్రి హైదరాబాద్‌లోని హాస్పిటల్‌లో చికిత్సపొందుతూ మృతి చెందారు. ఆయన గత 25 సంవత్సరాలుగా ఆర్టీసీలో పనిచేస్తున్నారు. మృతునికి భార్య హేమలత, కుమార్తె షామిలి, కుమారుడు హేమంత్ ఉన్నారు. శంకర్ గౌడ్ మృతదేహాన్ని ఆయన కుమార్తె గ్రామం ముత్తోజీపేటకు తరలించారు. శంకర్ గౌడ్ స్వగ్రామం ఖానాపూర్‌లో ఆయనకు సొంత ఇల్లు కూడా లేకపోవడంతో బిడ్డ ఇంటికి మృతదేహాన్ని తరలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ మృతికి నిరసనగా నర్సంపేట బంద్ కు పిలుపు నివ్వడంతో పరిస్థితి అప్పటికే ఉద్రిక్తంగా మారింది.
శంకర్ గౌడ్‌కు నివాళులర్పించేందుకు శుక్రవారం ఉదయం నుంచే చుట్టుపక్కల రాజకీయ వర్గాలతో పాటు, సహచర ఆర్టీసీ కార్మికులు పెద్ద సంఖ్యలో ముత్తోజీపేటకు తరలివచ్చారు. మృతదేహాన్ని ఆయన పనిచేసే నర్సంపేట డిపోకు తరలించి అక్కడ తాము ఘనంగా నివాళులు తెలియజేస్తామంటూ ప్రకటించారు. ఇంటికంటే కార్మికులు, యూనియన్ కోసమే శంకర్ ఎక్కువగా పనిచేశారంటూ కార్మికులందరూ ఆయనకు నివాళులు అర్పించే అవకాశం కల్పించాలని కోరారు. మృతదేహాన్ని నర్సంపేటకు తరలించేందుకు యత్నించారు. నర్సంపేటకు మృతదేహాన్ని తరలిస్తే పరిస్థితి అదుపుతప్పి తీవ్ర ఉద్రిక్తతలు నెలకొంటాయని పోలీసులు నివారించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికులు, పోలీసుల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మరో వైపు అక్కడే ఆర్టీసీ కార్మికులు టెంట్ వేసి నిరసన తెలియజేసేందుకు ప్రయత్నించగా అడ్డుకున్నారు. అప్పటికే నర్సంపేట, ములుగు ప్రధాన రహదారి పూర్తిగా స్తంభించింది. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి , బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో అక్కడి వచ్చి మృతదేహాన్ని నర్సంపేటకు తరలించేందుకు యత్నించారు. కార్మికులకు మద్ధతుగా నిలిచారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట నెలకొంది. దీంతో పెద్ది సుదర్శన్ రెడ్డి, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని నర్సంపేటకు తరలించేందుకు వాహనం ఎక్కించగా బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకోవడంతో మరికొంతసేపు వాగ్వివాదం, తోపులాట ఏర్పడింది. పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. శంకర్ గౌడ్ అంత్యక్రియలకు పోలీసులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉన్నప్పటికీ అంత్యక్రియలు ముగిసేవరకు ఏం జరుగుతుందో చెప్పలేమంటున్నారు. శంకర్ గౌడ్ కు నివాళులు అర్పించేందుకు వివిధ రాజకీయ పక్షాలు, ప్రజాసంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
Viral Video | హోటల్‌లో మూడు రోజులు బస.. టవల్స్, స్పూన్స్‌ను దొంగిలించిన టూరిస్టులు.. వీడియో
Jackky Bhagnani | రకుల్ పక్కన ఉన్నప్పుడు నా ప్రేయసి కాల్ చేస్తే ఏం చేస్తానంటే… జాకీ భగ్నానీ ఆసక్తికర వ్యాఖ్యలు