RTC Strike | 12 గంట‌ల చ‌ర్చ‌లు స‌ఫ‌లం.. రోడ్డెక్కిన ఆర్టీసీ బ‌స్సులు

RTC Strike | ఆర్టీసీ కార్మిక సంఘాల నేత‌ల‌తో శుక్ర‌వారం రోజు 12 గంట‌ల పాటు చ‌ర్చ‌లు జ‌రిపింది. ఎట్ట‌కేల‌కు ఈ చ‌ర్చ‌లు ఫ‌లించాయి. దీంతో అర్ధ‌రాత్రి స‌మ్మె విర‌మిస్తున్న‌ట్టు ఆర్టీసీ కార్మిక సంఘాలు ప్ర‌క‌టించాయి.

RTC Strike | అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీ మేర‌కు త‌మ డిమాండ్ల‌ను నెర‌వేర్చాల‌ని తెలంగాణ ఆర్టీసీ కార్మికులు నిర‌వ‌ధిక స‌మ్మె చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. రెండో రోజు స‌మ్మె పాల్గొన్న న‌ర్సంపేట ఆర్టీసీ డిపో డ్రైవ‌ర్ శంక‌ర్ గౌడ్ ఆత్మాహుతికి పాల్ప‌డ్డాడు. దీంతో వెంట‌నే దిగొచ్చిన రాష్ట్ర ప్ర‌భుత్వం.. ఆర్టీసీ కార్మిక సంఘాల నేత‌ల‌తో శుక్ర‌వారం రోజు 12 గంట‌ల పాటు చ‌ర్చ‌లు జ‌రిపింది. ఎట్ట‌కేల‌కు ఈ చ‌ర్చ‌లు ఫ‌లించాయి. దీంతో అర్ధ‌రాత్రి స‌మ్మె విర‌మిస్తున్న‌ట్టు ఆర్టీసీ కార్మిక సంఘాలు ప్ర‌క‌టించాయి. ఈ క్ర‌మంలో శ‌నివారం తెల్ల‌వారుజాము నుంచే ఆర్టీసీ బ‌స్సులు రోడ్డెక్కాయి. దీంతో మూడు రోజుల నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ప్ర‌యాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన సచివాలయంలో ఆర్టీసీ జేఏసీ నేతలతో శుక్ర‌వారం మంత్రుల బృందం భేటీ అయింది. ఈ సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్‌, శ్రీధర్‌బాబు, వివేక్‌, అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ పాల్గొన్నారు.

మంత్రుల బృందం, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య దాదాపు 12 గంటల పాటు చర్చలు జరిగాయి. ఆర్టీసీ కార్మికులు లేవనెత్తిన 32 డిమాండ్లపై ప్రధానంగా చర్చ జరిగింది. 11 శాతం పీఆర్‌సీ, ప్రభుత్వంలో విలీనం, ఆర్టీసీ సంఘాల ఎన్నికలకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. మిగిలిన సమస్యల పరిష్కారానికి ఆర్టీసీ యాజమాన్యం సమ్మతించింది. దీంతో కార్మికులు సమ్మె విర‌మించారు.

ఆర్టీసీ కార్మికులు స‌మ్మె విర‌మించిన నేప‌థ్యంలో టీజీఎస్ ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి మీడియాతో మాట్లాడారు. శ‌నివారం మొద‌టి షిఫ్ట్ నుంచి 100 శాతం బ‌స్సులు రోడ్డెక్కుతాయ‌ని తెలిపారు. ప్ర‌జా ర‌వాణాకు ఎలాంటి ఆటంకం లేకుండా బ‌స్సులు అందుబాటులో ఉంటాయ‌న్నారు. స‌మ్మె కార‌ణంగా మూడు రోజుల పాటు ప్ర‌యాణికులు ఎదుర్కొన్న ఇబ్బందుల‌కు చింతిస్తున్న‌ట్లు తెలిపారు. ఆర్టీసీ కార్మిక సంఘాల ఎన్నిక‌ల‌కు చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు.

Latest News