Saleshwaram Jathara | ‘వస్తున్నాం లింగమయ్యా’.. రేపట్నుంచి సలేశ్వరం జాతర షురూ..
Saleshwaram Jathara | దక్షిణాది అమర్‌నాథ్ యాత్ర( Amarnath Yatra )గా పేరుగాంచిన సలేశ్వరం లింగమయ్య( Saleshwaram Lingamaiah ) దర్శనానికి సర్వం సిద్ధమైంది. ప్రతి ఏడాది చైత్ర పౌర్ణమికి లింగమయ్యను దర్శించుకుంటారు. ఈ నేపథ్యంలో శుక్రవారం(ఏప్రిల్ 11) నుంచి సలేశ్వరం జాతర( Saleshwaram Jathara ) ప్రారంభమై మూడు రోజుల పాటు కొనసాగనుంది.

Saleshwaram Jathara | దక్షిణాది అమర్‌నాథ్ యాత్ర( Amarnath Yatra )గా పేరుగాంచిన సలేశ్వరం లింగమయ్య( Saleshwaram Lingamaiah ) దర్శనానికి సర్వం సిద్ధమైంది. ప్రతి ఏడాది చైత్ర పౌర్ణమికి లింగమయ్యను దర్శించుకుంటారు. ఈ నేపథ్యంలో శుక్రవారం(ఏప్రిల్ 11) నుంచి సలేశ్వరం జాతర( Saleshwaram Jathara ) ప్రారంభమై మూడు రోజుల పాటు కొనసాగనుంది. అంటే రేపట్నుంచి 13వ తేదీ వరకు ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్వామి వారిని దర్శించుకునేందుకు అనుమతి ఇవ్వనున్నారు. సలేశ్వరం లింగమయ్య స్వామి వద్ద చెంచులే పూజారులుగా వ్యవహరించడం ఎన్నో ఏండ్ల నుంచి కొనసాగుతున్న ఆనవాయితీ.
సాహసోపేతమైన యాత్ర
ఇక సలేశ్వరం జాతర ఒక సాహసోపేతమైన యాత్రగా చెప్పొచ్చు. ఎందుకంటే.. దట్టమైన నల్లమల అడవిలో నడక ప్రయాణం కొనసాగించాలి. పులులు, ఇతర వన్య మృగాల మధ్య కాలు కదపాల్సి ఉంటుంది. వన్య మృగాలను పక్కనపెడితే.. పచ్చదనంతో నిండిన కొండలు.. కోనలు.. లోయలు.. గుహలు.. పక్షుల కిలకిలరావాలు.. జాలువారే జలపాతాలు.. ఎటుచూసినా ప్రకృతి రమణీయతే.. ఇంతటి ఆహ్లాదకరమైన వాతావరణంలో లింగమయ్య కొలువుదీరడం అద్భుతం. ఇవన్నీ ప్రత్యేక అనుభూతులను మిగిల్చుతాయి.
‘వస్తున్నాం లింగమయ్యా’..
సలేశ్వరం జాతర ఈ నెల 11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు మూడు రోజుల పాటు కొనసాగుతుంది. ఉగాది తరువాత తొలి పౌర్ణమికి జాతర మొదలవుతుంది. సలేశ్వరం లింగమయ్య దర్శనానికి ఉమ్మడి జిల్లాతోపాటు తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు నుంచి భక్తులు లక్షలాదిగా తరలివస్తారు. దర్శనానికి వెళ్లేముందు ‘వస్తున్నాం లింగమయ్యా’.. అని, తిరిగి వెళ్లే సమయంలో ‘వెళ్లొస్తాం లింగమయ్యా’.. అంటూ దారి పొడవునా నామస్మరణ మార్మోగనున్నది.
4 కిలోమీటర్ల దూరం నడక ప్రయాణం..
సలేశ్వరం జాతరకు వెళ్లే భక్తులు.. శ్రీశైలం-హైదరాబాద్ రహదారిలో ఫరహాబాద్ పులిబొమ్మ నుంచి లోపలికి వెళ్లాలి. ఆ పులి బొమ్మ నుంచి 35 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవుల్లో సలేశ్వరం క్షేత్రం ఉంటుంది. పది కిలోమీటర్ల దూరం వెళ్లగానే రోడ్డు పక్కన నిజాం కాలం నాటి పురాతన కట్టడం ఉంటుంది. నిజాం విడిది నుంచి ఎడమవైపున 23 కిలోమీటర్ల దూరం వెళ్లిన తర్వాత సలేశ్వ రం బేస్‌క్యాంపు వస్తుంది. అక్కడ రాంపూర్ చెంచుపెంట వద్ద వాహనాలు పార్కింగ్ చేయాలి. అక్కడి నుంచి సలేశ్వరం జలపాతం చేరుకోవడానికి 4 కిలోమీటర్ల దూరం నడక ప్రయాణం సాగించాలి. రాంపూర్ చెంచు పెంట నుంచి సలేశ్వరం వరకు భక్తులకు దాతలు తాగునీటిని ఏర్పా టు చేస్తారు.
ఆ దారిలో ఎన్నో గుహలు, సన్నని జలధారలు..
మోకాల చెరువు, గాడిదదొన్న కాల్వ వద్ద భక్తులు విశ్రాంతి తీసుకునేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తారు. అక్కడి నుంచి మైసమ్మకట్ట, పాపనాశనం, లోయప్రాంతం, భైరవుడి గుడి, లోయలోకి ముందుకు దిగితే శంకుతీర్థం, సలేశ్వర తీర్థం గుండాలు వస్తాయి. నడక దారిలో 250 అడుగుల నుంచి 400 అడుగుల ఎత్తు ఉండే రెండు సమాంతర గుట్టలు.. వాటి మధ్యలో లోతైన లోయలోకి జలధార పడుతుంది. తూర్పు గుట్టకు సమాంతరంగా అర కిలోమీటర్ దిగి తరువాత దక్షిణం వైపునకు తిరిగి పశ్చిమ వైపున ఉన్న గుట్టపైన కిలోమీటర్ నడవాలి. ఆ గుట్ట కొనను చేరుకున్న తరువాత మళ్లీ ఉత్తరవైపునకు తిరిగి గుట్టల మధ్య లోయలోకి దిగాలి. ఆ దారిలో ఎన్నో గుహలు, సన్నని జలధారలు కనిపిస్తాయి.
అనేక వనమూలికలతో కలిసిన ఆ నీరు ఆరోగ్యానికి మంచిదని..
గుండం కొంత దూరం ఉండగానే.. లోయ అడుగు భాగానికి చేరుకుంటాం. గుండం నుంచి పారే నీటి ప్రవాహం వెంట రెండు గుట్టల మధ్య ఇరుకైన లోయ ఉంటుంది. ఇక్కడ చా లా జాగ్రత్తగా నడవాలి. ఒక్కోచోట బెత్తెడు దారి మాత్రమే ఉంటుంది. గుండం చేరిన తర్వాత అక్కడి దృశ్యం చాలా కనువిందు చేస్తుంది. గుండంలోని నీరు అతి చల్లగా ఉంటుంది. అనేక వనమూలికలతో కలిసిన ఆ నీరు ఆరోగ్యానికి మంచిదని.. భక్తులు నీటిని తీసుకెళ్తుంటారు. గుండం ఒడ్డు వైపు తూర్పు ముఖంగా రెండు గుహలు ఒకదానిపై ఒకటి ఉంటాయి. ఆ గుహలోనే ప్రధాన దైవమైన లింగమయ్యస్వామి కొలువుదీరాడు. కింది గుహలో కూడా లింగం ఉంటుంది. గుడి ముందు మాత్రం వీరభద్రుడు, గంగమ్మ విగ్రహాలున్నాయి.
ప్రత్యేక బస్సుల ఏర్పాటు..
సలేశ్వ రం క్షేత్రానికి నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్, కల్వకుర్తి, వనపర్తి డిపోలతో పాటు హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్ నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నారు. ఫరహాబాద్ వద్ద ఆర్టీసీ బస్సులకు టోల్‌ప్లాజా నుంచి మినహాయింపు ఉంటుంది.