మాకు ఆంధ్రాలో ఓటే ముఖ్యం.. ఏపీకి తరలి వెళుతున్న సెటిలర్లు

పార్లమెంటు ఎన్నికల కన్నా తమకు ఏపీ అసెంబ్లీ ఎన్నికలే ముఖ్యమని హైదరాబాద్, నగర శివారు ప్రాంతాల్లోని ఆంధ్రా సెటిలర్లు తేల్చి చెబుతున్నారు. ఏపీలోనే తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు భారీగా సొంత రాష్ట్రానికి తరలివెళుతున్నారు.

మాకు ఆంధ్రాలో ఓటే ముఖ్యం.. ఏపీకి తరలి వెళుతున్న సెటిలర్లు

అసెంబ్లీ ఎన్నికల్లో సెటిలర్ల ఓటు కారుకే
హైదరాబాద్, చుట్టుపక్కల బీఆరెస్‌ ఎమ్మెల్యేలు
ఇప్పుడు ఆ ఓట్లు గణనీయంగా తగ్గే చాన్స్‌
అది బీఆరెస్‌కు నష్టం చేస్తుందా?

విధాత: పార్లమెంటు ఎన్నికల కన్నా తమకు ఏపీ అసెంబ్లీ ఎన్నికలే ముఖ్యమని హైదరాబాద్, నగర శివారు ప్రాంతాల్లోని ఆంధ్రా సెటిలర్లు తేల్చి చెబుతున్నారు. ఏపీలోనే తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు భారీగా సొంత రాష్ట్రానికి తరలివెళుతున్నారు. పోలింగ్‌కు ముందే ఏపీకి వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. పైగా వేసవి సెలవులు కూడా తోడు కావడంతో ఎన్నికలకు వెళ్లి ఆ తరువాత కొద్ది రోజులు సొంతూరులో బంధువులు, స్నేహితులతో కలిసి సరదాగా గడపవచ్చునని భావిస్తున్నారు. దీంతో రైళ్లన్నీ ఫుల్ అయ్యాయి. అదనపు రైళ్లు కూడా నడపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా ఏపీఎస్ ఆర్టీసీ ఒక్క హైదరాబాద్ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు 626 అదనపు బస్సులు నడపడానికి ఏర్పాట్లు చేసింది. అలాగే బెంగుళూరు నుంచి 200 బస్సులు నడుపనున్నది. పైగా నియోజకవర్గాలవారీగా హైదరాబాద్, బెంగుళూరులలో ఉన్న తమ వారిని తీసుకు వెళ్లడం కోసం ఆయా పార్టీల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు ప్రైవేట్ బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిసింది. అయితే ఈ బస్సులు కూడా ఫుల్ కావడంతో ఏదైనా బస్సు పట్టుకొని ఊరికి వచ్చి ఓటు వేయండి.. బస్సు చార్జీలతో పాటు ఖర్చులకు డబ్బులు ఇస్తామని చెబుతున్నారని సమాచారం.

‘ఉద్యోగాలు, వ్యాపారాలు హైదరాబాద్‌లోనే చేస్తున్నారు. పిల్లలను ఇక్కడే చదివిస్తున్నారు కదా… మరి ఓటు మాత్రం అక్కడ వేయాలని ఎందుకు అనుకుంటున్నారని ప్రశ్నిస్తే.. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉండటంతో తమకు ఏపీనే తొలి ప్రాధాన్యం అవుతుందని బదులిస్తున్నారు. తమకు రెండు చోట్ల ఓటు ఉన్నా.. తెలంగాణ కంటే ఏపీనే ముఖ్యమని చెపుతున్నారు. పైగా ఏపీ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు కావడంతో తాము అక్కడకే వెళుతున్నామని ప్రకాశం జిల్లాకు చెందిన సురేశ్‌ తెలిపారు. హైదరాబాద్ కన్నా తమకు పుట్టిన ఊరే ముఖ్యమని, ఆంధ్రాలో తాము కోరుకున్న ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకు రావడం కోసం అక్కడ ఓటు వేయడానికి వెళుతున్నామని చీరాలకు చెందిన కృష్ణ అన్నారు. ప్రభుత్వం మారాలని కోరుకునే వాళ్లంతా ఏపీకి వెళుతున్నారని కృష్ణ అనడం గమనార్హం.

తగ్గే సెటిలర్ ఓట్ల ప్రభావం ఎవరిపై?

ఏపీ నుంచి హైదరాబాద్‌కు వచ్చి సెటిల్ అయిన వాళ్లు అసెంబ్లీ ఎన్నికల కారణంగా సొంతూర్లకు తరలి వెళుతుండడంతో తెలంగాణలో తగ్గే ఓట్ల ప్రభావం ఎవరిపైన పడుతుందన్న చర్చ రాజకీయ వర్గాలలో జోరుగా జరుగుతోంది. 2023 డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సెటిలర్లు బీఆరెస్‌కే పట్టం కట్టారన్న అభిప్రాయం ఉంది. అందుకే జీహెచ్ఎంసీ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలలో బీఆరెస్ గెలిచిందని రాజకీయ పరిశీలకులు చెపుతున్నారు. అసెంబ్లీ ఓటింగ్ సరళిని పరిశీలిస్తే సెటిలర్లు లోక్‌సభ ఎన్నికల్లో ఏపీకి వెళ్లడం వల్ల బీఆరెస్‌కే ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంటుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. సెటిలర్లు ఆంధ్రాకు ఓటు వేయడానికి వెళితే ఆ మేరకు కాంగ్రెస్ పార్టీకే మేలు జరిగే అవకాశం ఉంటుందన్న చర్చ కూడా రాజకీయ పరిశీలకుల్లో జరుగుతోంది. హైదరాబాద్‌లో ఉన్న ముస్లిం, క్రిస్టియన్‌ మైనార్టీలతోపాటు తమిళ, కేరళ ప్రాంత సెటిలర్లు కాంగ్రెస్ పార్టీకే ఓట్లు వేసే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దీంతో కాంగ్రెస్‌కు ఉండే సంప్రదాయ ఓటుతోపాటు అదనంగా ఈ వర్గాల ఓట్లు తోడవడం జీహెచ్ఎంసీ పరిధిలోని పార్లమెంటు స్థానాలలో కాంగ్రెస్‌కు కలిసొచ్చే సానుకూల అంశంగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇది ముఖ్యంగా సికింద్రాబాద్, చేవెళ్ల లోక్‌సభ సీట్లపై ప్రభావం చూపే అవకాశం ఉంటుందన్న చర్చ జరుగుతోంది.