దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు కేంద్రం తీవ్ర అన్యాయం
దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాల విషయంలో కేంద్రం తీవ్ర అన్యాయం, వివక్ష చూపుతున్నదని, ఈ రాష్ట్రాలు నియోజకవర్గాల పునర్విభజన పై పోరాటానికి సిద్ధం కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
- రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
విధాత, హైదరాబాద్:
దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాల విషయంలో కేంద్రం తీవ్ర అన్యాయం, వివక్ష చూపుతున్నదని, ఈ రాష్ట్రాలు నియోజకవర్గాల పునర్విభజన పై పోరాటానికి సిద్ధం కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలలో 50 శాతం పెంపు ఏ లెక్కల ప్రకారం జరుగుతుందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పుడు ఎంపీ స్థానాల్లో ఉత్తరాది దక్షిణాది రాష్ట్రాల మధ్య అంతరం ఎంత ఉందో అంతే స్థాయిలో సీట్ల పెంపు జరగాలి అన్నారు. 50 శాతం సీట్ల పెంపు అనేది ఫైనల్ బుల్లెట్ అని, ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్ల పెంపుతో దక్షిణాది రాష్ట్రాల అవసరం లేకుండా కేంద్రం లో ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. 50 శాతం సీట్ల పెంపు వల్ల కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో మా అవసరం లేకుండా పోతుందన్నారు. కేంద్ర ప్రభుత్వంలో జాతీయ రాజకీయాల్లో దక్షిణాది రాష్ట్రాల నేతలకు చోటు లేకుండా పోతుందని వివరించారు. జనాభా ఆధారంగా సీట్ల పెంపు జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందన్నారు. అన్ని పక్షాలతో చర్చ జరిపి సీట్ల పెంపు పై కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు వెళ్ళాలి అన్నారు. నియోజకవర్గాల పెంపు దక్షిణాది రాష్ట్రాలకు వ్యతిరేకం అని, ఉత్తర భారతానికి దక్షిణ భారతానికి మధ్య అంతరాన్ని ఎన్డీఏ ప్రభుత్వం పెంచుతుందన్నారు. దక్షిణాది రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీలో మంగళవారం నాడు ఒక టీవీ ఛానల్ నిర్వహించిన ఇండియా ఏం ఆలోచిస్తోంది అనే సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు.
దక్షిణాదిపై అన్యాయం, వివక్ష
మోడీ త్రీడీ పాలసీకి వ్యతిరేకంగా దక్షిణ భారతం ఐక్యం కావాల్సి ఉందని, కేరళ, తెలంగాణ, ఏపీ, తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక నుంచి కేంద్రంలో ప్రాతినిధ్యం తక్కువగా ఉందన్నారు. బీజేపీ సీనియర్ నాయకుడు ఎం.వెంకయ్య నాయుడును ఢిల్లీ నుంచి ఖాళీ చేయించి ఇంటికి పంపించారన్నారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి ఉన్నవారికి కేంద్ర హోం శాఖ మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదో సమాధానం చెప్పాలన్నారు. వెంకయ్య నాయుడును ఎందుకు రాష్ట్రపతి చేయలేదో అర్థం కావడం లేద, మొదటి నుంచి పార్టీలో ఉన్న వ్యక్తిని ఎందుకు పక్కన పెట్టారని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు దక్షిణాది నుంచి రాష్ట్రపతులు అయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఇండియా ఒక్కటేనన్న సందేశం ఇచ్చిందన్నారు. 12 ఏళ్లలో మా గుర్తింపు ఏదంటూ, రాజకీయ వివక్ష బీజేపీలోనే ఉందన్నారు. సొంత పార్టీ నేతలపైనే నమ్మకం లేదని, దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాల విషయంలో అన్యాయం, వివక్ష చూపుతున్నారన్నారు. కేంద్రంలోని టాప్ 10 పదవులు మోడీ హయాంలో దక్షిణాది రాష్ట్రాలకు రాలేదన్నారు. 50 శాతం సీట్ల పెంపు అనేది ఫైనల్ బుల్లెట్ అని, నియోజకవర్గాల పునర్విభజనపై పోరాటానికి సిద్ధం కావాలన్నారు. తమిళనాడు, పుదుచ్చేరి కలిపి 40 ఎంపీ స్థానాలు ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాలలో పెరిగితే 60 ఎంపీ స్థానాలు అవుతాయన్నారు. యూపీలో పెరిగితే 160 అవుతాయని వివరించారు. 50 శాతం పెంపు ఏ లెక్క ప్రకారం జరుగుతుందనేది తేలిపోయిందన్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్ల పెంపుతో దక్షిణాది రాష్ట్రాల అవసరం లేకుండా కేంద్రం లో ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఇప్పుడు ఎంపీ స్థానాల్లో ఉత్తరాది దక్షిణాది రాష్ట్రాల మధ్య అంతరం ఎంత ఉందో అంతే స్థాయిలో సీట్ల పెంపు జరగాలన్నారు. చర్చలు జరిపి సీట్ల పెంపు పై ముందుకు వెళ్ళాలని, నియోజకవర్గాల పెంపు దక్షిణాది రాష్ట్రాలకు వ్యతిరేకం అన్నారు. నరేంద్ర మోడీ, అమిత్ షా దేశం గురించి పట్టించుకోవడం లేదని, రాహుల్ గాంధీ దేశం గురించి ఆలోచిస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకున్న తరువాత ఆల్ పార్టీ మీటింగ్ కి పిలుస్తున్నారు. మీరు చెప్పింది వినడానికి మమ్మల్ని ఆల్ పార్టీ సమావేశానికి పిలుస్తున్నారా అని ప్రశ్నించారు.
మోడీ గుజరాత్ కు పెట్టుబడులు తీసుకెళ్తున్నారు…
తెలంగాణ మోడల్ రేర్ మోడల్ అని, అహ్మదాబాద్ కి హైదరాబాద్ తో పోలిక లేదన్నారు. గుజరాత్ లో టాక్స్ హాలిడే అనుమతులు అన్ని ఇస్తున్నారని, పెట్టుబడులు పెట్టడానికి ప్రధాని మోదీ గుజరాత్ ను సూచిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ కూడా దేశం లో భాగమని, దేశానికి బ్రాండ్ అంబాసిడర్ లా మోడీ వ్యవహరించాలన్నారు. గుజరాత్ మోడల్ ను తెలంగాణ మోడల్ అనుకరిస్తుందన్న దానిపై స్పందించిన రేవంత్ రెడ్డి.. మంచి నిర్ణయాలు, విధానాలు ఎక్కడున్నా పాటిస్తామన్నారు. గుజరాత్ లో సబర్మతి రివర్ ఫ్రంట్ ను డెవలప్ చేశారని, హైదరాబాద్ లో మూసీ రివర్ ను డెవలప్ చేస్తుంటే బీజేపీ అడ్డుకుంటుందన్నారు. మహాత్మా గాంధీ విగ్రహానికి రూ.70-80 కోట్లు ఖర్చు చేస్తున్నామని, నది వద్ద బాపు ఘాట్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. మూసీ ఫేజ్ 1 గురించి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ లో నల్గొండ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు వివరించానన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ చెప్పింది బీజేపీ చేస్తుందని విమర్శించారు. రాజ్యాంగం రూపొందించిన అంబేద్కర్ కాంగ్రెస్ వ్యక్తి అని, ఆయన రాసిన రాజ్యాంగం ద్వారా మోదీ ప్రధాని అయ్యారన్నారు. కేంద్ర, రాష్ట్ర సంబంధాలు బావుండాలని, రాష్ట్రానికి మూడు బుల్లెట్ రైళ్లు ఇచ్చినందుకు కేంద్రానికి కృతఙ్ఞతలు తెలిపానన్నారు. మోడీ మంచి చేస్తే మంచి చేశారని చెబుతా… తప్పు చేస్తుంటే తప్పని చెబుతానని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
అధిక వడ్డీలకు బీఆర్ఎస్ పాలకులు అప్పులు చేశారు…
ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఆరు గ్యారెంటీలు ఇచ్చామని, ఆర్థిక వనరులు తక్కువ ఉన్నాయి కాబట్టి కొన్ని పెండింగ్ లో ఉన్నాయని రేవంత్ రెడ్డి అన్నారు. మేము అధికారం లోకి వచ్చిన నాటికి అనుకున్న దానికంటే అధిక అప్పులు ఉన్నాయని తెలిసిందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై శ్వేతప్రతం విడుదల చేశామన్నారు. గత బీఆర్ఎస్ పాలకులు 11.90 వడ్డీకి రూ.2 లక్షల కోట్ల అప్పు తీసుకున్నారని, 6-7 శాతం వడ్డీ కింద ఇచ్చే రుణాలను వదిలేసి అధిక వడ్డీలకు తీసుకున్నారు. నచ్చితే నజరానా నచ్చకపోతే జరిమానా అన్నట్లుగా గత ప్రభుత్వ వైఖరి ఉండేదన్నారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపి విద్యార్థులను తీసుకువచ్చినట్లు యుద్ధాన్ని ఆపి ప్రధాని మోదీ చమురు తీసుకురావచ్చు కదా అన్నారు. దేశంలో గ్యాస్, పెట్రోల్ కొరత ఏర్పడుతుందని, అయినా మేము మోడీకి మద్దతుగా ఉంటామని రేవంత్ రెడ్డి అన్నారు.
ఒకే దెబ్బకు రెండు పార్టీలు ఖతం…
మాజీ సీఎం కేసీఆర్ నాకు రాజకీయ ప్రత్యర్థి మాత్రమేనని, నాకు వ్యక్తిగతంగా ఆయనతో సమస్యలు లేవన్నారు. కేసీఆర్ కుటుంబంలోని వారే పదవుల కోసం పాకులాడుతున్నారని ఆరోపించారు. వారసత్వ రాజకీయాలు కోసం కుమార్తె కవిత, కుమారుడు కేటీఆర్ పోటీ పడుతున్నారన్నారు. కేసీఆర్ మేనల్లుడు టీ.హరీష్ రావు ముఖ్యమంత్రి అవుతా అంటున్నారు. ఇప్పటికైనా కేసీఆర్ అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్ర పోషించాలని, ఇది వారి కుటుంబ సమస్య అని అన్నారు. పార్లమెంట్ లో బీఆర్ఎస్ కు గుండు సున్నా వచ్చిందని, తరువాత ఎన్నికల్లో డిపాజిట్లు పోయాయని, ఉప ఎన్నికలు, పంచాయతీ, మునిసిపల్ ఎన్నికల్లో ఓడిపోయారని గుర్తు చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో కేటీఆర్ బెట్టింగ్ పెట్టించారు.. అయినా ఓడిపోయారన్నారు. తనకు తెలంగాణ ప్రజలు 2024-34 వరకు అవకాశం ఇస్తారని, ఇది తెలంగాణ ట్రెడిషన్ అని అన్నారు. ఒక్క దెబ్బకి రెండు పిట్టలు కొట్టాలన్నది నా లెక్క అని, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీలను కాంగ్రెస్ పార్టీ ఓడిస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు.
ఇంకా ఎనిమిదేళ్లు సీఎం గా ఉంటా…
నేను కార్యకర్తల మిత్రుడిని, నన్ను కార్యకర్తలు ఇష్టపడతారని రేవంత్ రెడ్డి వివరించారు. పేదలు, దళితులు తెలంగాణ లో నిజాం రాజు కి వ్యతిరేకంగా పోరాడారు. తెలంగాణ డీఎన్ఏ ఇతర ప్రాంతాలతో పోలిస్తే భిన్నంగా ఉంటుందన్నారు. దేశవ్యాప్తంగా ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా ఉన్నా… ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి 41 మంది ఎంపీలు గెలిచారు. గాంధీ కుటుంబానికి తెలంగాణాతో అంతటి సంబంధం ఉందన్నారు. రావణుడు ఉన్నాడు కాబట్టే రాముడు పేరు గడించారు. తెలంగాణలో విలన్ల వల్లే ప్రజలు నన్ను హీరో చేశారు, ఇంకా ఎనిమిదేళ్లు తెలంగాణలో అధికారంలో ఉంటానని ధీమా వ్యక్తం చేశారు. నేను దేశ రాజకీయాల్లో పనిచేయాలనేది పార్టీ నిర్ణయిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram