Telangana Speaker Gaddam Prasad : టెన్షన్ టైమ్..నేడే ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తీర్పు

బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ గడ్డం ప్రసాద్ నేడు తీర్పు వెలువరించనున్నారు. సుప్రీంకోర్టు గడువు నేపథ్యంలో ఐదుగురు ఎమ్మెల్యేల భవిష్యత్తుపై ఉత్కంఠ నెలకొంది.

Telangana Speaker Gaddam Prasad : టెన్షన్ టైమ్..నేడే ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తీర్పు

విధాత, హైదరాబాద్ : తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారిన బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంపై నేడు స్పీకర్ గడ్డం ప్రసాద్ తన తీర్పును వెలువరించబోతున్నారు. బీఆర్ఎస్ నుంచి 10మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరిన నేపథ్యంలో వారిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బీఆర్ఎస్ పిటీషన్ ను విచారించిన సుప్రీంకోర్టు ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతను విచారించి చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ నెల 18వ తేదీ లోపు ఏదో ఒకటి తేల్చాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో స్పీకర్ గడ్డం ప్రసాద్ తొలి విడతలో ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను విచారించి తీర్పు రిజర్వ్ చేశారు. మలి విడతలో మరో ముగ్గురు ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, డాక్టర్‌ సంజయ్‌, పోచారం శ్రీనివాస్‌రెడ్డిలపై విచారణ చేపట్టారు. ఇకపోతే కడియం శ్రీహరి, దానం నాగేందర్ లు మాత్రం స్పీకర్ నోటీసులకు సమాధానం ఇవ్వడంలో మరింత సమయం అడిగారు.

ఐదుగురి అనర్హత అంశంపై నేడు తీర్పు

తొలి విడతగా అరికెపూడి గాంధీ, తెల్లం వెంకట్రావ్‌, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ప్రకాశ్ గౌడ్‌, గూడెం మహిపాల్‌రెడ్డి అనర్హత పిటిషన్లపై నేడు బుధవారం స్పీకర్ ప్రసాద్ తన తీర్పును ప్రకటించనున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఐదుగురు ఎమ్మెల్యేల అడ్వకేట్లకు స్పీకర్ నోటీసులు పంపించారు. బీఆర్ఎస్, ఫిరాయింపు ఎమ్మెల్యేల అడ్వకేట్లు మధ్యాహ్నం 3.30 గంటలకు స్పీకర్‌ కార్యాలయానికి రానున్నారు. అటు ఫిర్యాదుదారులైన బీఆర్ఎఎస్ ఎమ్మెల్యేలు సైతం స్పీకర్ కార్యాలయంలో హాజరవుతారు. స్పీకర్ ఓపెన్ కోర్టులో తన తీర్పు వెలువరిస్తారు. అలాగే శాసనసభ వెబ్‌సైట్‌లో తీర్పు ప్రతులను అధికారులు అప్‌లోడ్‌ చేస్తారు. ఐదుగురి ఫిరాయింపు ఎమ్మెల్యేపై స్పీకర్ ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు..వారిపై అనర్హత ఉంటుందా? లేదా అన్నదానిపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

ఇవి కూడా చదవండి :

Black Thread | కాలికి నల్ల దారం కట్టుకున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోండి!
Silver Price Today| వెండి ధర రూ.11వేలు పైకి..రూ.2లక్షల 22వేలు