New DGP Shivadhar Reddy | తెలంగాణ కొత్త డీజీపీగా శివధర్‌రెడ్డి నియామకం

తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా ప్రస్తుత ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ శివధర్‌ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. శుక్రవారం తన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి.. శివధర్‌ రెడ్డికి నియామక పత్రాన్ని అందజేశారు.

New DGP Shivadhar Reddy | తెలంగాణ కొత్త డీజీపీగా శివధర్‌రెడ్డి నియామకం

హైదరాబాద్, సెప్టెంబర్ 26 (విధాత ప్రతినిధి):

New DGP Shivadhar Reddy | తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా బత్తుల శివధర్ రెడ్డి నియామిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుతం డీజీపీగా ఉన్న జితేందర్ పదవీకాలం ఈ నెల 30వ తేదీతో ముగుస్తుండటంతో రేవంత్ రెడ్డి సర్కార్ శివధర్ రెడ్డిని ఎంపిక చేసింది. 1994 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన శివధర్ రెడ్డి ప్రస్తుతం రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్‌గా విధులు నిర్వహిస్తున్నారు. శుక్రవారం రేవంత్ రెడ్డి చేతులు మీదుగా తన నియామక పత్రాన్ని అందుకున్నారు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం అక్టోబర్ 1 వ తేదీన తెలంగాణ డీజీపీగా శివధర్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.

తొలి పోస్టింగ్‌ విశాఖపట్నం జిల్లాలో

హైదరాబాద్‌లో జన్మించిన బత్తుల శివధర్ రెడ్డి కుటుంబ స్వస్థలం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తూలేకలాన్ (పెద్దతుండ్ల) గ్రామం స్వస్థలం. ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు హైదరాబాద్‌లో చదువుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసి కొంతకాలం అడ్వకేట్‌గా ప్రాక్టీస్ చేశారు. ఆ తరువాత యూపీఎస్సీ పరీక్షలు రాసి 1994లో ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. శిక్షణ తరువాత తొలుత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలోని అనకాపల్లి, నర్సిపట్నం, చింతపల్లిలో ఏఎస్పీగా పనిచేశారు. గ్రేహౌండ్స్‌ స్క్వాడ్రన్ కమాండర్‌గా, బెల్లంపల్లి, ఆదిలాబాద్, నల్లగొండ, శ్రీకాకుళం, నెల్లూరు, గుంటూరు జిల్లాల ఎస్పీగా సేవలు అందించారు. ఈ జిల్లాలో ఎస్పీగా పని చేస్తున్న సమయంలో అనేక సెన్సేషనల్ కేసులను ఛేదించారు. విశాఖపట్నం పోలీస్ కమిషనర్ గా పనిచేసిన సమయంలో రోడ్ భద్రత కోసం అరైవ్ అలైవ్ క్యాంపెయిన్ నిర్వహించారు. జిల్లా ఎస్పీగా, ఎస్ఐబీ డీఐజీగా మావోయిస్టులను అణచివేయడంతో పాటు జనజీవన స్రవంతిలో కలిసేలా కీలక భూమిక పోషించారు. టఫ్ టాస్క్‌మాస్టర్‌గా, ఆపరేషన్‌లను మెటిక్యులస్‌గా ఎగ్జిక్యూట్ చేస్తారని ఆయనకు పేరు. పాస్‌పోర్టుల వెరిఫికేషన్‌ విషయంలో ఆయన నాయకత్వంలో తెలంగాణ పోలీస్ దేశంలో మొదటి స్థానం సాధించింది. పోలీస్–డెవలప్డ్ సిస్టమ్ ద్వారా స్విఫ్ట్ వెరిఫికేషన్ అమలు చేశారు. ఇది ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చింది.

హైదరాబాద్‌లో శాంతి భద్రతల రక్షకుడు

2007లో హైదరాబాద్ మక్కా మసీదులో బాంబు పేలుళ్లు, పోలీసు కాల్పులలో 14 మంది చనిపోయిన సంఘటన తర్వాత, శాంతి భద్రతలను కాపాడేందుకు హైదరాబాద్ సౌత్ జోన్ డీసీపీగా అప్పటి ప్రభుత్వం శివధర్ రెడ్డిని నియమించింది. అత్యంత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన ఆ సమయంలో రాత్రి పగలు శ్రమించి, అన్ని వర్గాల ప్రజలలో ధైర్యం నింపి, శాంతి భద్రతలను సమర్థంగా కాపాడిన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏసీబీ అడిషనల్ డైరెక్టర్ గా, డైరెక్టర్ తో పాటు పర్సనల్ వింగ్‌లో ఐజీ, అడిషనల్ డీజీగా విధులు నిర్వర్తించిన ఆయనకు రోడ్డు సేఫ్టీ అడిషనల్ డీజీపీగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. మావోయిస్టుల సమస్యల పరిష్కారం తనవంతుగా కృషి చేయడమే కాకుండా లొంగిపోయి వారికి పునరావసం సహాయం అందేలా తనవంతు చర్యలు తీసుకున్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2014–16 మధ్య తెలంగాణ తొలి ఇంటలిజెన్స్ చీఫ్‌గా పనిచేశారు. తెలంగాణ రాష్ట్రసాధన ఉద్యమం పట్ల ఆయనకు ఉన్న సానుకూల భావన కారణంగానే అప్పటి కేసీఆర్‌ ప్రభుత్వం ఆయనను ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా నియమించిందనే అభిప్రాయాలు అప్పట్లో వ్యక్తమయ్యాయి. పోలీసు వ్యవస్థ ఆధునీకరణలో ఆయన కీలక పాత్ర పోషించారు. 2016లో గ్యాంగ్‌స్టర్‌ నయీం ఎన్ కౌంటర్‌ను ఆయనే పర్యవేక్షించారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఐక్య రాజ్య సమితి శాంతిపరిరక్షక దళంలో భాగంగా యునైటెడ్ నేషన్స్ మిషన్ ఇన్ కొసావోలో కూడా పని చేసిన అనుభవం ఉంది. 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్ గా మళ్ళీ శివధర్ రెడ్డి నియామకం అయ్యారు. గతేడాది ఆగస్టులో డీజీపీగా పదోన్నతి పొందారు. గ్యాలంట్రీ మెడల్, పోలీస్ మెడల్, ప్రెసిడెంట్ మెడల్, ఐక్యరాజ్యసమితి మెడల్ సహా అనేక అవార్డులు అందుకున్నారు. శివధర్ రెడ్డి నియామకం తెలంగాణ పోలీస్ వ్యవస్థకు కొత్త ఊపిరి పోస్తుందని పోలీసు ఉన్నాధికారులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఆయన నాయకత్వంలో ఇంటెలిజెన్స్, శాంతి భద్రతల విషయాల్లో మరిన్ని ఆధునీకరణలు రావచ్చని అంచనా వేస్తున్నారు.