కేసీఆర్ సమక్షంలో తిరిగి బీఆర్ఎస్ లోకి
పరస్పర ప్రయోజనాలతో ఇరువురు రాజీ
స్టేషన్ ఉప ఎన్నికలొస్తే అభ్యర్ధిగా అవకాశం
విధాత ప్రత్యేక ప్రతినిధి: వీడిని చోటికి రాజయ్య తిరిగొచ్చారు. నిన్నటి వరకు వద్దనుకున్న బీఆర్ఎస్ పార్టీకి రాజయ్య, ఆయనకు బీఆర్ఎస్ పార్టీ ముద్దయ్యింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరేందుకు తీవ్రంగా ప్రయత్నించిన స్టేషన్ ఘన్ పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమ-క్షంలో ఆదివారం తిరిగి పార్టీలో చేరారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్యను కాదని శ్రీహరికి అవకాశం ఇస్తే గెలిచిన తర్వాత బీఆర్ఎస్ ను కాదని ఆయన కాంగ్రెస్ లో చేరారు. ప్రస్తుతం స్టేషన్ ఘన్ పూర్ పార్టీ ఇంచార్జ్ స్థానం ఖాళీగా ఉంది. ఈ బాధ్యతలు రాజయ్యకు ఇవ్వనున్నారు. కాలం కలిసొచ్చి స్టేషన్ ఘన్ పూర్ లో ఉప ఎన్నికలొస్తే రాజయ్యను బీఆర్ఎస్ అభ్యర్ధిగా ప్రకటించనున్నారు.
రెండు రోజుల క్రితం హైడ్రామా
రెండు రోజుల క్రితం ఎంపీ అభ్యర్ధి ఎంపిక నేపథ్యంలోనే రాజయ్యను కేసీఆర్ ఆహ్వనించారు, రాజయ్య కూడా తనకే ఎంపీ అభ్యర్ధిగా అవకాశం కల్పిస్తారని భావించి కేసీఆర్ ను కలిసేందుకు బయలుదేరి వెళ్ళారు. ఎర్రవెల్లిలోని తన ఫాంహౌజ్ లో వరంగల్ జిల్లా నాయకులు, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులతోపాటు జడ్పీ చైర్మన్, ప్రస్తుతం ఎంపీ అభ్యర్ధి మారపల్లి సుధీర్ కుమార్ తో కేసీఆర్ చర్చస్తునట్లు తెలిసి. తనను కాదని మారపల్లి వైపు మొగ్గు చూపుతున్నారని భావించి మధ్యలో నుంచి తిరిగి వచ్చారు. మారపల్లి సుధీర్ కుమార్ ను ఎంపీ అభ్యర్ధిగా ప్రకటించారు. కానీ, రెండు రోజుల్లో మరే పరిణామాలు జరిగాయేమోగానీ రాజయ్య తిరిగి బీఆర్ఎస్ చేరారు. కాంగ్రెస్ పార్టీలో కూడా సానుకూలంగా లేనందున రాజకీయ ప్రాతినిధ్యం కూడా అవసరమని భావించి ఒక్కడుగు వెనక్కుతగ్గినట్లు చర్చసాగుతోంది.
ఉప ఎన్నికల్లో పోటీ పై ఆశ
బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన కడియం తాను ఎమ్మెల్యేగా రాజీనామా చేయలేదు. ఈ విషయం పై బీఆర్ఎస్ మండిపడుతోంది. కడియం శ్రీహరికి నైతికత లేదంటూ విమర్శిస్తున్నారు. కడియాన్ని అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. ఈ పరిణామాల్లో కడియం తప్పకుండా రాజీనామా చేయాల్సి వస్తుందని బీఆర్ఎస్ గట్టిగా భావిస్తోంది. కడియం రాజీనామా చేస్తే అక్కడ ఉప ఎన్నికలొచ్చే అవకాశం ఉననట్లు అంచనా వేస్తున్నారు. బీఆర్ఎస్ ఊహించినట్లు ఉప ఎన్నిక వస్తే అక్కడ బీఆర్ఎస్ నుంచి అభ్యర్ధిగా రాజయ్యకు అవకాశం కల్పిస్తామనే ముందస్తు అంగీకారం మేరకు రాజయ్య పార్టీలో చేరుతున్నట్లు చెబుతున్నారు. పార్టీలో ప్రస్తుతం ఇంచార్జ్ తో పాటు కలిసొస్తే పోటీ చేసే అవకాశమొస్తుందనే ఆశతో రాజయ్య పార్టీలో చేరుతున్నారు. ఆశ ఎంతటివారినైనా మెట్టుదిగేట్టు చేస్తుందికదా?
సిట్టింగ్ ఎమ్మెల్యేగా అవమానం
స్టేషన్ ఘన్ పూర్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రాజయ్యను కాదని ఎమ్మెల్సీగా ఉన్న కడియం శ్రీహరికి మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్ సీటు కేటాయించింది. అధినేత కేసీఆర్ మాట కాదనలేదు. ఎన్నికలయ్యే వరకు రాజయ్య ఆ పార్టీలో ఉన్నారు. రైతు సమన్వయ సమితి రాష్ట్ర చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ, స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గాల్లో ఆయన పనిచేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోర ఓటమి తర్వాత ఆ పార్టీకి రాజీనామా ప్రకటించిన మొదటి నాయకుడు డాక్టర్ రాజయ్య. తన పట్ల అధిష్టానం వ్యవహరిస్తున్న తీరు పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ముఖ్యనాయకులను కలిసేందుకు ప్రయత్నించినా స్పందించలేదంటూ పార్టీకి రాజీనామా చేశారు. వరంగల్ ఎంపీ సీటు తనకు కేటాయించాలని కోరేందుకు ప్రయత్నించినా పట్టించుకోలేదని విమర్శించారు. తర్వాత కాంగ్రెస్ లో చేరేందుకు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఆ పార్టీ నుంచి సానూకూల స్పందన రాలేదు. రాజయ్య చేరికను స్టేషన్ ఘన్పూర్ కాంగ్రెస్ వర్గాలు వ్యతిరేకిస్తూ గాంధీ భవన్ ముందు ధర్నా చేశారు. ఈ స్థితిలో రాజయ్య చేరిక నిలిచిపోయింది.
పరస్పర ప్రయోజనంతో రాజీ
అవమానించిన రాజయ్యను ఆహ్వానించి పార్టీ స్టేషన్ ఘన్ పూర్ ఇంచార్జ్ బాధ్యతలుఇచ్చేందుకు సిద్ధం కావడం వెనుక ఆ పార్టీ అవసరం, రాజయ్య రాజకీయ భవిష్యత్తుకు ఉన్నందున పరస్పరం రాజీకి వచ్చినట్లు చెబుతున్నారు. నేడో, రేపో అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయి. ప్రస్తుత పరిస్థితిల్లో పార్టీ సీనియర్ నాయకునిగా, మాదిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీకి ఉపయోగకరంగా ఉంటుందని భావించినట్లు చెబుతున్నారు.