చంద్రబాబుతో కాసాని ములాఖత్‌.. టీడీపీపై కీలక చర్చలు

  • Publish Date - October 14, 2023 / 01:01 PM IST
  • తెలంగాణలో టీడీపీపై కీలక చర్చలు
  • బాబు ఆరోగ్యంపై ఆందోళన


విధాత : టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడుతో తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ శనివారం రాజమండ్రి జైలులో ములాఖత్‌లో కలిశారు. బాబు సతీమణి నారా భువనేశ్వరి, నారా లోకేశ్‌లతో కలిసి కాసాని బాబుతో భేటీ అయ్యారు. తెలంగాణలో 119అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ పోటీ చేయాలని నిర్ణయించిన క్రమంలో బాబుతో ఎన్నికల వ్యూహాలు, అభ్యర్థుల ఎంపిక, జాబితా ప్రకటన వంటి అంశాలపై కాసాని చర్చించినట్లుగా సమాచారం.


ములాఖత్ అనంతరం కాసాని మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని, స్వయంగా చూశానన్నారు. బాబు ఆరోగ్య పరిస్థితి బాగలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన సరిగా మాట్లాడలేక పోతున్నారని, 45ఏళ్ల ప్రజా జీవితంలో కీలక పదవులు నిర్వర్తించిన చంద్రబాబును జైల్లో ఆ పరిస్థితుల్లో చూడటం తీవ్రంగా కలిచివేసిందన్నారు. చంద్రబాబు త్వరలోనే బయటకొస్తారని ధీమా వ్యక్తం చేశారు.


కాగా ములాఖత్ పిదప భువనేశ్వరి, లోకేశ్‌లు మీడియాతో మాట్లాడకుండానే చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని తలుచుకుంటు కన్నీటి పర్యంతమై అక్కడి నుంచి వెళ్లారు. ములాఖత్ సందర్భంగా లోకేశ్ జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్‌ను ప్రభుత్వ వైద్యులు బాబు ఆరోగ్య చికిత్సలపై అందించిన నివేదిక మేరకు దుకు చర్యలు తీసుకోలేదంటు నిలదీశారు. మాజీ సీఎం ఆరోగ్యం పట్ల ఇంత నిర్లక్ష్యం వహించడం పట్ల లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.


అయితే ములాఖత్ సమయం అయిపోయిందని, ఇక మీరు వెళ్లవచ్చంటూ డీఐజీ దురుసుగా సమాధానం చెప్పారంటూ లోకేశ్ ఆయన తీరును తప్పుబట్టారు. చంద్రబాబుకు పరీక్షలు నిర్వహించిన వైద్య బృందం తన నివేదికలో ఆయన డీహైడ్రేషన్‌తో బాధలు పడుతున్నారని, దాని ప్రభావం గుండెపైన ఉండే అవకాశముందని పేర్కోన్నట్లుగా తెలిసింది. అలాగే స్కిన్ అలర్జీ కూడా పెరిగిందని, బాబుకు చల్లని వాతావరణం ఉండేలా చర్యతీసుకోవాలని, ఐదు రకాల మందులను బాబు చికిత్సలో సిఫార్సు చేశారని సమాచారం.


అయితే రవికిరణ్ మాట్లాడుతూ చంద్రబాబు ఆరోగ్యాంగానే ఉన్నారని, హై ఫ్రోఫైల్డ్ ఖైదీల పట్ల ప్రత్యేకంగానే ఉంటామని, జైలుకొచ్చిన వారు అంతా ఖైదీలేనన్నారు. ప్రభుత్వ వైద్యులు డాక్టర్ శివకుమార్ మాట్లాడుతూ చంద్రబాబు పర్సనల్ డాక్టర్లను సంప్రదించి మందులు ఇచ్చామన్నారు. కూల్ ఎన్విరాల్‌మెంట్‌ను కూడా సిఫారసు చేశామని, ఇప్పుడున్న వాతావరణంలో ప్రతి ఒక్కరికి డీ హైడ్రేషన్ ఉంటుందన్నారు. చంద్రమాబు 67కిలోల బరువుతో ఉన్నారన్నారు. ఆసుపత్రికి పంపించాల్సిన అవసరం లేదన్నారు. ఎలాంటి స్టెరాయిడ్స్ ఇవ్వడం లేదన్నారు.