జోరుందుకున్న ఎన్నికల ప్రచారం.. 17న రాహుల్‌గాంధీ, అమిత్‌షాల రాక

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో నామినేషన్ల ఘట్టం ముగిసిపోవడంతో అన్ని పార్టీలు ప్రచార పర్వంలో జోరు పెంచాయి.

  • Publish Date - November 13, 2023 / 11:46 AM IST
  • నిత్య సభలతో సీఎం కేసీఆర్ ప్రచార హోరు


విధాత : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో నామినేషన్ల ఘట్టం ముగిసిపోవడంతో అన్ని పార్టీలు ప్రచార పర్వంలో జోరు పెంచాయి. బీఆరెస్ పార్టీ సీఎం కేసీఆర్‌తో రోజుకు రెండు మూడు సభల చొప్పున నిర్వహిస్తూ ప్రచార క్షేత్రంలో దూసుకుపోతుంది. సోమవారం అశ్వరావుపేట, నర్సంపేట నియోజకవర్గాల సభలలో కేసీఆర్ ప్రసంగించారు.


కేసీఆర్‌తో తోడుగా ఇంకోవైపు మంత్రులు కేటీఆర్‌, టి.హారీశ్‌రావులు సైతం నియోజకవర్గాల ప్రచార సభల్లో పాల్గొంటూ బీఆరెస్ ఎన్నికల ప్రచారాన్ని ముందుకు దూకిస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీలతో తొలి విడత ప్రచారం పూర్తి చేయగా, రెండో విడతగా ఈనెల 17న రాహుల్‌గాంధీ తెలంగాణకి రానున్నారు.


ఈనెల 17న పాలకుర్తి, వరంగల్, భువనగిరిలో రాహుల్ సభలు నిర్వహించనున్నారు. ఆరు రోజులు తెలంగాణలోనే రాహుల్ మకాం వేయనున్నారు. అలాగే 17 తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కూడా విస్తృతంగా పర్యటించనున్నారు. ఇక ఒకే రోజు తెలంగాణలో రాహుల్, ప్రియాంక, ఖర్గే సమావేశాలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో కాంగ్రెస్ ముఖ్యనేతల పర్యటనలు ఉండేలా కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది.


బీజేపీ సైతం ఇప్పటికే తొలి విడతగా ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్‌లతో ప్రచారం నిర్వహించింది. బీసీ సీఎం ప్రకటన సభ, మాదిగల విశ్వరూప సభలకు హాజరైన మోడీ బీజేపీ శ్రేణుల్లో జోష్ నింపే ప్రయత్నం చేశారు.తదుపరి ప్రచార షెడ్యూల్‌లో భాగంగా ఈనెల 17న కేంద్ర మంత్రి అమిత్ షా మరోసారి తెలంగాణ ఎన్నికల ప్రచారానికి హాజరుకానున్నారు.


17వ తేదీని సోమాజిగూడ బీజేపీ మీడియా సెంటర్‌లో తెలంగాణ బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టోను అమిత్ షా విడుదల చేస్తారు. అనంతరం అదే రోజు నల్లగొండ, వరంగల్‌, గద్వాల్‌, రాజేంద్రనగర నియోజకవర్గాల్లో బీజేపీ ఎన్నికల ప్రచార సభల్లో అమిత్ షా ప్రసంగించనున్నారు.