తెలంగాణ ప్రభుత్వోద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్.. వీరికి మాత్రం షాక్!
తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల బదిలీలపై నిషేధాన్ని ఎత్తివేసింది. మే 1 నుంచి 31 వరకు ట్రాన్స్‌ఫర్లు జరుగనున్నాయి. అయితే జనగణన పనుల్లో ఉన్న సిబ్బందికి బదిలీలు వర్తించవని ప్రభుత్వం స్పష్టం చేసింది.
తెలంగాణలో మే 1 నుంచి ఉద్యోగుల బదిలీలు ప్రారంభం కానున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
Telangana Govt Issues Orders on Employee Transfers from May 1, Census Staff Excluded
హైలైట్ పాయింట్స్
- ● తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల బదిలీలపై నిషేధం ఎత్తివేత
- ● మే 1 నుంచి మే 31, 2026 వరకు ట్రాన్స్‌ఫర్ల నిర్వహణ
- ● జనగణన పనుల్లో ఉన్న సిబ్బందికి బదిలీలు వర్తించవు
- ● ఉపాధ్యాయులు, అధ్యాపకుల్లో అలుముకున్న అసంతృప్తి
విధాత తెలంగాణ డెస్క్ | 21 ఏప్రిల్ 2026 | హైదరాబాద్:
తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల బదిలీల ప్రక్రియ మే 1 నుంచి మే 31 వరకు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అయితే జనగణన (Census) విధుల్లో ఉన్న సిబ్బందిని ఈ ప్రక్రియ నుంచి తప్పించడం ఉద్యోగుల్లో అసంతృప్తికి దారితీసింది.
జనాభా లెక్కల సిబ్బందికి నిరాశ
ప్రభుత్వ ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్న ఆదేశాల ప్రకారం, జనగణన పనులకు నియమించబడిన లేదా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు బదిలీలు వర్తించవు. ముఖ్యంగా ఉపాధ్యాయులు, లెక్చరర్లు పెద్ద సంఖ్యలో జనాభా లెక్కల విధుల్లో ఉండటంతో వారికి బదిలీ ఆశలు దెబ్బతిన్నాయి.
ఎవరు అర్హులు.. ఎవరు కాదు?

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల ఉత్తర్వుల నేపథ్యంలో కార్యాలయాల్లో పనిలో నిమగ్నమైన సిబ్బంది.
- 2026 జనవరి 1 నాటికి ఒకే చోట 3 సంవత్సరాలు పూర్తి చేసిన ఉద్యోగులు బదిలీకి అర్హులు.
- అయితే ఉద్యోగ దంపతుల ఆధారంగా (Spouse Grounds) కోరే బదిలీలకు ఈ 3 సంవత్సరాల నిబంధన వర్తించదు.
- 2025 డిసెంబర్ 31 నాటికి 4 సంవత్సరాలకు పైగా ఒకే చోట పనిచేసిన వారిని కొనసాగించరాదు.
- కానీ 2027 మే 31 లోపు పదవీ విరమణ చేసే ఉద్యోగులు, వారు కోరుకోనంతవరకు బదిలీ చేయరాదు.
శాఖల వారీగా ప్రత్యేక మార్గదర్శకాలు
ఉపాధ్యాయులు, లెక్చరర్ల బదిలీల కోసం విద్యాశాఖ ప్రత్యేక విధివిధానాలు రూపొందించనుంది. పోలీసు సిబ్బంది బదిలీలకు పోలీసు శాఖ వేరు మార్గదర్శకాలు జారీ చేయనుంది.
ఆర్డర్ వచ్చిన మూడు రోజుల్లో రిలీవ్
బదిలీ ఉత్తర్వులు వచ్చిన తర్వాత మూడో రోజు ముగిసే సరికి ఉద్యోగి రిలీవ్ అయినట్టే పరిగణిస్తారు. దీనిపై ఎలాంటి ఉల్లంఘన జరిగినా ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించింది.
ఉద్యోగుల్లో మిశ్రమ స్పందన
బదిలీలపై నిషేధం ఎత్తివేయడాన్ని ఉద్యోగులు స్వాగతించినప్పటికీ, జనగణన సిబ్బందిని మినహాయించడం వల్ల ముఖ్యంగా ఉపాధ్యాయులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై ఉద్యోగ సంఘాలు స్పందించే అవకాశముంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram