విధాత, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం రోడ్డు రవాణా సంస్థ(టీజీ ఎస్ ఆర్టీసీ)లో 1,500 కండక్టర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వం నుంచి అనుమతి రావడంతో ఆర్టీసీ యాజమాన్యం కండక్టర్ల భర్తీ ప్రక్రియకు సిద్దమవుతుంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అనంతరం టీజీఎస్‌ఆర్టీసీ ఆవిర్భవించిన తర్వాత ఇప్పటివరకు కండక్టర్ పోస్టులను భర్తీ చేయలేదు. ప్రతి ఏటా ఉన్న ఉద్యోగులే రిటైరవుతుండటంతో ఖాళీలు పెరుగుతూ వస్తున్నాయి. ఈ మేరకు కొంతకాలం క్రితం ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో తాత్కాలికంగా హైదరాబాద్, సికింద్రాబాద్ సహా వివిధ రీజియన్ల పరిధిలోని డిపోల్లో నియమించింది. ఇప్పుడు ప్రభుత్వం అనుమతించడంతో 1,500 కండక్టర్ పోస్టుల భర్తీకి లైన్ క్లియర్ అయ్యింది. పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా ఈ పోస్టులకు ఉద్యోగుల్ని ఎంపిక చేయనున్నట్లు సమాచారం.
ఎంపికపై స్పష్టత కోసం కసరత్తు
గతంలో రీజియన్ల వారీగా ఖాళీలు, రిజర్వేషన్లను పరిగణనలోకి తీసుకుంటూ నియామక ప్రక్రియ జరిగేది. కండక్టర్ పోస్టులకు పదో తరగతిలో వచ్చిన మార్కుల శాతాన్ని ఆధారంగా తీసుకుని ఎంపిక చేసే విధానం ఆర్టీసీలో ఉండేది.ఆ తర్వాత పదో తరగతిలో గ్రేడింగ్ విధానం అమల్లోకి వచ్చింది. మళ్లీ ఇప్పుడు గ్రేడింగ్ విధానం పోయి మార్కుల శాతం వచ్చింది. దీంతో కండక్టర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల నియామకాలలో ఇప్పుడు మార్కుల శాతం, గ్రేడింగ్ లలో ఏ విధానాన్ని పరిగణనలోకి తీసుకోవాలన్న అంశంపై ఆర్టీసీ యాజమాన్యం కసరత్తు చేస్తుంది. స్పష్టత కోసం ఎస్సెస్సీ బోర్డుకు ఆర్టీసీ యాజమాన్యం తాజాగా లేఖ రాసింది. గ్రేడింగ్‌ను మార్కుల శాతంగా ఎలా లెక్కించాలి అనే విషయంపై ఎస్సెస్సీ బోర్డు నుంచి స్పష్టత తీసుకుని..కండక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆర్టీసీ యాజమాన్యం భావిస్తుంది.