హైదరాబాద్ లో టెస్లా ఇవి కార్ల షోరూం…

ఇవి వాహనాల దిగ్గజ సంస్ధ టెస్లా త్వరలో హైదారాబాద్ లో విక్రయ, సేవల కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. శుక్రవారం నాడు ఆ సంస్థ ఇండియా ప్రతినిధులను ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో బేటీ అయిన సందర్భంగా తాము ఇక్కడ అమ్మకాలు ప్రారంభించేందుకు ఆసక్తితో ఉన్నటు వెల్లడించారు

విద్యుత్తు వాహనాలు, ఇంటెలిజెంట్ మొబిలిటీ వ్యవస్థలకు అవసరమైన అత్యాధునిక సాంకేతికతలతో కూడిన ఎకోసిస్టంను తెలంగాణాలో అభివృద్ధి చేసినట్టు ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఈ సందర్బంగా తెలిపారు. సెమీ కండక్టర్ డిజైన్, ఆటోమొబైల్ సాఫ్ట్ వేర్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, డీప్ టెక్నాలజీ రంగాలకు ప్రధాన కేంద్రంగా రాష్ట్రం ఎదిగిందని చెప్పారు. హైదరాబాద్ లో టెస్లా విద్యుత్తు వాహనాల సేల్స్, సర్వీసు సెంటర్లను ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చిన టెస్లా ఇండియా జనరల్ మేనేజర్ శరద్ అగర్వాల్, లీడ్ పబ్లిక్ పాలసీ, బిజినెస్ డెవలప్‌మెంట్ డైరెక్టర్ రజత్ లను శ్రీధర్ బాబు ప్రత్యేకంగా అభినందించారు. టెస్లా ఇప్పటి వరకు దేశంలో నాలుగు సేల్స్ షోరూంలను ఏర్పాటు చేయగా తదుపరి కేంద్రంగా హైదరాబాద్ ను ఎంపిక చేసుకోవడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేసారు.
టెస్లా కేవలం ఇవి కార్ల కంపెనీ మాత్రమే కాదని, ఎలక్ట్రిక్ వాహనాల సాఫ్ట్‌వేర్, సెమీకండక్టర్లు, కృత్రిమ మేధస్సు (ఏఐ), రోబోటిక్స్, బ్యాటరీ టెక్నాలజీలు, అధునాతన తయారీ రంగాల్లో నూతన ఆవిష్కరణలను పరిచయం చేసిన సంస్థగా ఎదిగిందని మంత్రి పేర్కొన్నారు. టెస్లా దీర్ఘకాలిక సాంకేతిక లక్ష్యాలకు తెలంగాణలో ఉన్న ఎకోసిస్టం బాగా సరిపోతుందని ఆయన తెలిపారు.
నగరంలో ఉన్న సెమీకండక్టర్ సంస్థలు ప్రపంచవ్యాప్తంగా తదుపరి తరం ఎలక్ట్రిక్, స్మార్ట్ మొబిలిటీ వ్యవస్థలకు అవసరమైన చిప్స్, సెన్సార్ల అభివృద్ధిలో కీలకంగా పనిచేస్తున్నాయని తెలిపారు.

దేశంలో ప్రస్తుతం కార్ల మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాల వాటా సుమారు 4 శాతం మాత్రమే ఉందని, ఈ రంగంలో భారీ అవకాశాలు ఉన్నాయని మంత్రి వివరించారు. తెలంగాణ ప్రభుత్వం భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడంతో పాటు, హైదరాబాద్‌ను క్లీన్ టెక్నాలజీ, ఆధునిక మొబిలిటీకి ప్రపంచస్థాయి కేంద్రంగా అభివృద్ధి చేసే సంకల్పంతో ఉందని పేర్కొన్నారు.

తెలంగాణలో టెస్లాకు సంబంధించిన అనుబంధ పరిశ్రమల విస్తరణ అవకాశాలను పరిశీలించాలని మంత్రి టెస్లా ప్రతినిధులను కోరారు. పరిశ్రమలు, సాంకేతిక రంగాల్లో పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. సమావేశంలో ప్రభుత్వ ఐటి సలహాదారు సాయికృష్ణ, టిజిఐఐసి ఎండీ శశాంక, పరిశ్రమల శాఖ కమిషనర్ నిఖిల్ చక్రవర్తి, ప్రత్యేక కార్యదర్శి రఘురామ శర్మ తదితరులు పాల్గొన్నారు.

Latest News