విధాత : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి ఎలాగైన విజయం సాధించాలన్న పట్టుదలతో సాగుతున్న కాంగ్రెస్ పార్టీ విపక్షాల మధ్య ప్రభుత్వ వ్యతిరేక ఓట్ల చీలికకు అడ్డుకట్ట వేసేందుకు చేస్తున్న ప్రయత్నాలు రెండడుగులు ముందుకు…ఒక అడుగు వెనక్కి అన్న చందంగా మారాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓట్ల చీలిక నివారించేందుకు తెలంగాణ జన సమితి, టీడీపీ, వైఎస్సార్టీపీ పార్టీలను పోటీ నుంచి తప్పించడంలో సఫలీకృతమైంది. తద్వారా ఆ పార్టీలకు మద్దతునిచ్చే ఓటర్లను కాంగ్రెస్ వైపు సమీకరించడంలో విజయంతమైంది. ఆ పార్టీల మద్దతుతో సెటిలర్లు, విద్యావంతులు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో కాంగ్రెస్ విజయవకాశాలు మెరుగుపడినట్లయ్యింది.
ముఖ్యంగా గ్రేటర్ హైద్రాబాద్, ఖమ్మం, నిజామాబాద్, మెదక్, నల్లగొండ, వరంగల్ వంటి జిల్లాల నియోజకవర్గాల్లో ఆ పార్టీల మద్దతుదారులు, సెటిలర్ల సంఖ్య గణనీయ స్థాయిలో ఉంది. మేడ్చల్, పటాన్ చెరు, కూకట్‌పల్లి, శేరిలింంగపల్లి, సనత్‌నగర్, మల్కాజిగిరి, ఉప్పల్, ఎల్‌బీ నగర్, కుత్బుల్లాపూర్, నిజామాబాద్, కోదాడ, హుజూర్‌నగర్, అంబర్‌పేట, సికింద్రాబాద్, జూబ్లిహిల్స్, చేవెళ్ల, మలక్‌పేట, రాజేంద్రనగర్, మెదక్, సంగారెడ్డి సహా దాదాపుగా 25నుండి 35స్థానాల్లో ఆయా వర్గాల ఓటర్ల ప్రభావం ఉండనుంది. టీజేఎస్, టీడీపీ, వైఎస్సార్టీపీలు పోటీ నుండి తప్పుకోవడంతో సదరు నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు కలిసి రానుంది. ఇదే సమయంలో అధికార బీఆరెస్‌కు ప్రతికూలంగా మారనుంది.
కమ్యూనిస్టుల దూరంతో గుబులు
ఎన్నికల్లో టీజేఎస్, టీడీపీ, వైఎస్సార్టీపీలను పోటీ నుంచి తప్పించి విజయవకాశాలు మెరుగుపరుచుకున్నామన్న ఆనందం కాంగ్రెస్ పార్టీకి కమ్యూనిస్టు పార్టీలు దూరమవ్వడంతో అవిరైపోయేలా కనిపిస్తున్నది. సీపీఐ, సీపీఎం, వాటి అనుబంధ సంఘాలు కూడా రాష్ట్రంలో కనీసంగా 20నుంచి 30స్థానాల్లో గెలుపు ఓటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నాయి. ఆ పార్టీలతో పొత్తు చర్చలు విఫలమైన నేపధ్యంలో ఉభయ కమ్యూనిస్టులు పరస్పరం మద్దతుతో ఎన్నికల్లో పోటీకి సిద్ధపడ్డారు.
ఇప్పటికే సీపీఎం 17 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించింది. సీపీఐ సైతం ఇదే రీతిలో కనీసం 15 స్థానాల్లో పోటీ చేసే అవకాశం లేకపోలేదు. సీపీఐ పార్టీ ఇంకా కాంగ్రెస్‌తో పొత్తు చర్చలకు తెరదించలేదు. అయితే పొత్తు కుదరకపోతే సీపీఐ కూడా సొంతంగా సీపీఎం మద్దతుతో బరిలోకి దిగేందుకు సిద్ధమైంది. ఈ నేపధ్యంలో కమ్యూనిస్టులు బలంగా ఉన్న చోట ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడంతో పాటు కమ్యూనిస్టు పార్టీలకు చెందిన వారి ఓట్లు వారికి పడినా ఆ మేరకు విపక్షాల ఓట్ల శాతానికి గండి కొట్టే ప్రమాదముంది.
ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, వరంగల్, కరీనంగర్ జిల్లాల్లో సీపీఐ, సీపీఎం పార్టీల పోటీతో విపక్షాల మధ్య ఓట్ల చీలిక తలెత్తవచ్చన్న ఆందోళన కాంగ్రెస్‌ను కలవరపరిచే అంశమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఖమ్మం, పాలేరు, కొత్తగూడెం, భద్రాచలం, వైరా, మధిర, సహా హుస్నాబాద్, బెల్లంపల్లి, మునుగోడు, నకిరేకల్, మిర్యాలగూడ, దేవరకొండ, నల్లగొండ, సూర్యాపేట, జనగామా, ఆలేరు, వరంగల్ వంటి స్థానాల్లో నిర్ణయాత్మక శక్తిగా ఉన్న కమ్యూనిస్టులు సొంతంగా పోటీ చేస్తే కాంగ్రెస్‌కు కొంత విజయవకాశాలు తగ్గనున్నాయని విశ్లేషిస్తున్నారు.