నిజామాబాద్ అర్బన్ కాంగ్రెస్ టికెట్ కొలిక్కి

  • Publish Date - November 4, 2023 / 12:37 PM IST
  • షబ్బీర్ అలీ వైపు అధిష్టానం మొగ్గు?
  • అధికారక ప్రకటనే తరువాయి..
  • ప్రముఖల సహకారం కోరిన షబ్బీర్
  • చివరి దాకా రేసులో సంజయ్


విధాత ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణ ఎన్నికల నామినేషన్ల పక్రియ మొదలైన నేపథ్యంలో అభ్యర్థుల తుది జాబితా ప్రకటనకు కాంగ్రెస్ పార్టీ రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. అభ్యర్థుల కసరత్తులు ఎట్టకేలకు కొలిక్కి తెచ్చింది. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం అభ్యర్థిగా మాజీ మంత్రి షబ్బీర్ అలీ పేరును ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం.


ఈ మేరకు శుక్రవారం రాత్రే ఢిల్లీలో ఉన్న ఆయనకు కాంగ్రెస్ పెద్దలు పిలిచి చెప్పినట్లు తెలుస్తోంది. అధికారికంగా ఖరారు కావడంతో షబ్బీర్ గత రాత్రే నగరంలో కొంతమంది ప్రముఖులకు నేరుగా ఫోన్ చేసి సహకారం కోరినట్లు సమాచారం. నిజామాబాద్ నగరంలోని పార్టీ నేతలందరికీ ఆయనే స్వయంగా ఫోన్ చేసి, తనకు టికెట్ ఖరారైన విషయం స్పష్టంగా చెప్పారు. దీంతో అర్బన్ టికెట్ విషయంలో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది.


నిజానికి అర్బన్ లో కాంగ్రెస్ అభ్యర్థిగా బీసీ సామాజిక వర్గంనుంచే వుండాలని పార్టీలో చర్చ జరిగింది. అర్బన్ మినహా మిగతా స్థానాలు రెడ్డి సామాజిక వర్గానికే ఖరారు కావడంతో, బీసీ నేతలు అర్బన్ మీదే ఆశలు పెట్టుకున్నారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్, మాజీ మేయర్ సంజయ్ లు టికెట్ కోసం ఢిల్లీ స్థాయిలోనే పావులు కదిపారు. మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి.. సంజయ్ విషయంలోనే గుట్టగా నిలబడ్డారు. అందుకే టికెట్ రేసులోకి రావడం మహేష్ కు అనివార్యమైందన్న చర్చ సాగుతోంది.


40 శాతం ముస్లిం ఓట్లు


నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో దాదాపు 40 శాతం ముస్లిం ఓట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అర్బన్ ను ముస్లింలకే కేటాయించాలని కొందరు సీఈసీ సభ్యులు ప్రతిపాదించారు. దీంతో అనూహ్యంగా మైనారిటీలకే కేటాయిస్తున్నట్లు అధిష్టానం స్పష్టం చేసింది. మహేష్ ను పిలిచి బుజ్జగించింది. భవిష్యతుకు భరోసా ఇచ్చింది. మహేష్ తప్పుకోవడంతో మైనారిటీ లో గెలుపు గుర్రం కోసం పార్టీ అన్వేషణ మొదలుపెట్టింది. కానీ కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్ మీద పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధం కావడంతో, షబ్బీర్ అలీ పేరు అర్బన్ తెరమీదికి వచ్చింది.


రాష్ట్రస్థాయి నేతగా ఖ్యాతి ఉన్న షబ్బీర్ ను ఆర్బన్ లో సర్దుబాటు చేయడానికి అధిష్టానం సిద్ధమైంది. కానీ జిల్లాలో బీసీలకు ఎక్కడా ఒక్క సీటు ఇవ్వకపోతే పార్టీకి ప్రతికూలంగా మారుతుందనే వాదన మొదలైంది. దీంతో అర్బన్ సెగ్మెంట్ ను పెండింగ్ లో పెట్టేసింది. ఈసారి సంజయ్ పేరే నానింది. ఒక్కో లోకసభ పరిధిలో రెండు బీసీలకు ఇవ్వాలనే కాంగ్రెస్ సిద్ధాంతం ఈసారి బుట్టదాఖలు చేసారు. అర్బన్ మైనారిటీకి ఇవ్వాలని నిర్ణయించిన తర్వాత వెనక్కి పొతే అదికూడా నష్టమే అనే ఆలోచనతో కనీసం బాన్స్ వాడ లోనైనా బీసీకి కేటాయించి, అర్బన్ యథావిధిగా షబ్బీర్ ను ఖరారు చేసినట్లు సమాచారం.