పాలమూరులో గులాబీకి ఎదురు గాలి

  • Publish Date - October 25, 2023 / 10:20 AM IST
  • ప్రచారాల్లో హామీల గోలతో కలవరం
  • ఎమ్మెల్యేలకు నిలదీతలు, అడ్డగింతలే..
  • సగానికి పైగా నియోజకవర్గాల్లో ఎదురీత
  • చక్కదిద్దేందుకు సీఎం కేసీఆర్ టూర్లు
  • ఎన్నికల ముంగిట బీఆరెస్ కు సంకటం


విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: అధికార బీఆరెస్ కు ఓట్ల ముందు హామీల గోల కలవరపెడుతోంది. గత ఎన్నికల్లో అలవిగాని హామీలతో గద్దెనెక్కిన కేసీఆర్ సర్కార్ కు, ప్రజల నుంచి నిరసన సెగ తాకుతోంది. ఈ దఫా ఎన్నికల్లో గెలుపు అంత సునాయాసంగా లేదన్న సంకేతాలు అధిష్టానాన్ని సంకటంలో పడేస్తున్నాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో బీఆర్ఎస్ కొన్ని నియోజకవర్గాల్లో గెలుపు కోసం ఎదురీదాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే టికెట్ దక్కించుకున్న సిటింగ్ ఎమ్మెల్యేలు ప్రచారంలో జనం మధ్య నానా తిప్పలు పడుతున్నారు. ఓటర్లను ఆకర్శించేందుకు సంక్షేమ పథకాలను అస్త్రంగా వాడుతున్నారు.


దళితబంధు, కుల వృత్తిదారులకు రు.లక్ష, డబుల్ బెడ్రూమ్ ఇళు, అసంపూర్తిగా రైతు రుణ మాఫీ వంటి పథకాలపై ప్రజలు అడుగడుగునా నిలదీస్తున్నారు. ముఖ్యంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అర్హులకు అందలేదని, కేవలం బీఆరెస్ కార్యకర్తలకు మాత్రమే అందాయని ఎమ్మెల్యేలను అడ్డుకుంటున్నారు. అక్కడక్కడా నిలదీతలూ తప్పడం లేదు. ఈ పథకాలను బీఆర్ఎస్ గాలికొదిలేసిందంటూ కాంగ్రెస్ పార్టీ విమర్శలు ఎక్కుపెడుతోంది. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ నేతలు ఇవే ప్రచారాస్త్రాలతో ఎక్కడికక్కడ బీఆర్ఎస్ ను ఉతికి ఆరేస్తున్నారు. రగులుతున్న ప్రజలు గులాబీపై దుమ్మెత్తి పోస్తున్నారు. వీటిని తిప్పికొట్టడంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విఫలం చెందుతున్నారు.


ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పలు నియోజకవర్గాల్లో పార్టీ ఇక్కట్లకు దిద్దుబాటు చర్యలు చేపట్టేందుకే బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పాలమూరు జిల్లా పై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే జడ్చర్ల నియోజకవర్గంలో సీఎం సభతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. ఈ సభ ద్వారా జిల్లాలో ఎన్నికల శంఖరావం మోగించారు. కాగా ప్రజల నుంచి అధిష్టానం ఆశించినంత స్పందన కానరాలేదు. దీన్ని పసిగట్టిన కేసీఆర్ మళ్ళీ ఈజిల్లాపైనే అధిక శ్రద్ధ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈనెల 26న గురువారం అచ్చంపేట, వనపర్తిలో బహిరంగ సభలకు హాజరుకానున్నారు.


అచ్చంపేట: ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు వ్యతిరేకత లేకున్నా, ఇక్కడి అభ్యర్థి, ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఇదే ఆపార్టీకి మైనస్ గా మారింది. ఎమ్మెల్యే ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోయిందనే విమర్శలున్నాయి. కార్యకర్తలకు కూడా అందుబాటులో ఉండరనీ, దురుసు ప్రవర్తనతో పార్టీకి చెడ్డ పేరు వచ్చిందనే అభిప్రాయం శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. కొన్నిసార్లు లైంగిక ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు. ఇవన్నీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు మైనస్ గా మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ వంశీ కృష్ణ ఇవే అంశాలపై జనంలోకి పోవడం బీఆరెస్ కు మింగుడు పడడం లేదు.


వనపర్తి: ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించలేదు. బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి నిరంజన్ రెడ్డి తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇక్కడ మంత్రికి కొంత వ్యతిరేకత ఉన్నా, దిద్దుబాటు చర్యల్లో పడ్డారు. పార్టీ అధినేత సీఎం కేసీఆర్ ను రంగంలోకి దింపుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా మేఘారెడ్డికి టికెట్ వస్తే కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశం ఉండడంతో మంత్రి ముందుగానే ఓటర్ల ను తమవైపు తిప్పుకునే పనిలో నిమగ్నమయ్యారు. ముందస్తుగానే జాగ్రత్త పడ్డ మంత్రి తనకు మద్దతుగా టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డిని బీఆర్ఎస్ లో చేర్పించారు.


కల్వకుర్తి: ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు గడ్డు పరిస్థితి ఉంది. ఇక్కడి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కు తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ కు బలమైన నేతలుగా ఉన్న కసిరెడ్డి నారాయణ రెడ్డి, బాలాజీ సింగ్ పార్టీని వీడి, కాంగ్రెస్ లో చేరారు. కసిరెడ్డికి కాంగ్రెస్ టికెట్ రావడంతో ఇక్కడి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అధికంగా కసిరెడ్డి వైపు ఉండడంతో బీఆర్ఎస్ కు చుక్కలు కనిపిస్తున్నాయి. ఇక్కడ బీజేపీ కూడా పటిష్ట నాయకత్వం కలిగి ఉంది. ఇప్పటికే బీజేపీ అభ్యర్థిగా ఆచారిని ప్రకటించడంతో అ పార్టీకి ఊపు వచ్చింది. కాంగ్రెస్, బీజేపీ మధ్య బీఆర్ఎస్ నెట్టుకురావడం కష్టమే అని స్థానికంగా చర్చ సాగుతోంది.


కొడంగల్: ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గెలుపు కోసం ఎదురీదాల్సిందే. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి టీపీపీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి బరిలో ఉండడంతో బీఆర్ఎస్ కు ఓటమి తప్పదని అ పార్టీ నేతలే అంటున్నారు. ఈ నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే పై తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇతర ప్రాంతానికి చెందిన వారు కావడంతో నియోజకవర్గాన్ని పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇదే ఆయన కు మైనస్ గా మారింది.


మక్తల్: ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి హయాంలో అభివృద్ధి ఏ మాత్రం జరగలేదనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. అంతలోపే ప్రచారంలో ముందుండి కాంగ్రెస్ కు అవకాశం ఇవ్వొద్దనే ఆలోచనలో చిట్టెం ఉన్నారు. ఇక్కడ నారాయణ పేట డీసీసీ అధ్యక్షులు వాకిటి శ్రీహరికి కాంగ్రెస్ టికెట్ వస్తే బీఆర్ఎస్ గెలుపు కోసం తంటాలు పడాల్సిందే.


అలంపూర్, గద్వాల: అలంపూర్ నియోజకవర్గంలో సిటింగ్ ఎమ్మెల్యే అబ్రహంకు బీఆరెస్ బీ ఫారం ఇవ్వలేదు. కాంగ్రెస్ అభ్యర్థిగా సంపత్ కుమార్ రంగంలోకి దిగారు. దీంతో బీఆర్ఎస్ కు గడ్డు పరిస్థితి తప్పదను భావనలో అ పార్టీ నేతలు ఉన్నారు. గద్వాల నియోజకవర్గంలో బీ ఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డిపై కూడా కొంత వ్యతిరేకత వచ్చింది. కాంగ్రెస్ టికెట్ దక్కించుకున్న సరిత ప్రచారం లో దూసుకుపోతున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ ఎదురీదాల్సిన పరిస్థితి కనపడుతోంది. షాద్ నగర్ నియోజకవర్గంలో కూడా బీఆర్ఎస్ గెలుపునకు శ్రమించాల్సి ఉంది. అభ్యర్థి, ఎమ్మెల్యే అంజయ్య యాదవ్పై తీవ్ర వ్యతిరేకత ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి శంకర్ తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఇక్కడ కూడా బీఆర్ఎస్ కు గడ్డు పరిస్థితి ఉంది.


నారాయణ పేట: ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ప్రచారంలో దుసుకుపోతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిని ఇంకా ప్రకటించక పోవడంతో ఇదే అనుకూలంగా భావించిన రాజేందర్ రెడ్డి ప్రచారంలో గ్రామాలను చుట్టివచ్చారు. ఇక్కడ కాంగ్రెస్ నుంచి కుంభం శివకుమార్ రెడ్డికి టికెట్ వస్తే బీఆర్ఎస్ కు ఎదురుగాలి వీచే అవకాశం ఉందన్న చర్చ నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ కొంత ప్రజా వ్యతిరేకత ను కూడగట్టుకుంది. అందుకే అ పార్టీ అధినేత కేసీఆర్ ఈ జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టారు.