జూన్‌ 30లోగా తెలంగాణ బొగ్గు గనుల వేలం పూర్తి చేయాలి

తొమ్మిదేళ్లలో తెలంగాణ ప్రభుత్వం ఒక్క మినరల్‌ బ్లాకును కూడా వేలం వేయలేదని కేంద్ర గనుల శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో జూన్ 30 నాటికి ఖచ్చితంగా కనీసం ఆరింటికి వేలం పూర్తిచేయాలని సూచిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర మంత్రిత్వశాఖ లేఖ రాసింది

  • Publish Date - June 16, 2024 / 05:53 PM IST

కేంద్ర బొగ్గు గనుల శాఖ ఆదేశాలు

విధాత, హైదరాబాద్‌ : తొమ్మిదేళ్లలో తెలంగాణ ప్రభుత్వం ఒక్క మినరల్‌ బ్లాకును కూడా వేలం వేయలేదని కేంద్ర గనుల శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో జూన్ 30 నాటికి ఖచ్చితంగా కనీసం ఆరింటికి వేలం పూర్తిచేయాలని సూచిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర మంత్రిత్వశాఖ లేఖ రాసింది. ఈ విషయంలో విఫలమైతే ఆ ప్రక్రియను కేంద్రమే చేపట్టాల్సి వస్తుందని స్పష్టం చేసింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 11 బ్లాకుల జియాలాజికల్ నివేదికలను పంపినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. వీటిలో ఐదు ఇనుప ఖనిజం, ఐదు సున్నపురాయి, ఒకటి మాంగనీస్ బ్లాకు ఉన్నట్లు తెలిపాయి. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర గనుల శాఖ పలుమార్లు గుర్తు చేసినప్పటికీ.. ఒక్క బ్లాక్‌ను కూడా వేలం వేయలేదని తెలిపింది. కాగా తెలంగాణాలో మేజర్, మైనర్ మినరల్ బ్లాకులను వేలం పద్ధతిలో కేటాయించేందుకు గనులశాఖ సిద్ధమైందని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు ఇటీవల వెల్లడించాయి. ఖనిజాల వారీగా ప్రతిపాదనల్ని ప్రభుత్వానికి పంపినట్లు తెలిపాయి.

ఇందులో మూడు సున్నపురాయి బ్లాకులు కాగా, మరో 12 చిన్నతరహా ఖనిజాల బ్లాక్‌లు. సీఎం రేవంత్‌రెడ్డి ఆమోదం రాగానే వేలం ప్రక్రియను ప్రారంబించాలని మంత్రిత్వ శాఖ భావిస్తున్నట్లు తెలుస్తోంది. వేలంలో అర్హత సాధించిన వారికి ఆయా గనుల్ని 20 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వనున్నట్లు సమాచారం. మినరల్ బ్లాకుల వేలం ప్రక్రియ 2015లో ప్రారంభమైంది. 2021లో నిబంధనలను సవరించారు. వాటి ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వం నిర్దిష్ట గడువులోగా వేలం ప్రక్రియను పూర్తి చేయాలి. లేదంటే వాటిని నిర్వహించే అధికారం కేంద్రానికి సంక్రమిస్తుంది. కొత్త విధానం. అమల్లోకి వచ్చినప్పటి నుంచి దేశవ్యాప్తంగా 354 ప్రధాన మినరల్ బ్లాక్‌లను వేలం వేశారు. 48 చోట్ల ఉత్పత్తి ప్రారంభమైందని, తద్వారా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయం గణనీయంగా పెరిగిందని కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ తెలిపింది.

Latest News