విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎన్నికల వేడి తారస్థాయికి చేరుకుంటోంది. అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య టఫ్ పైట్ నెలకుంది. సునాయాసంగా గెలుస్తామని ఇంతకాలం అనుకున్న బీఆర్ఎస్ అభ్యర్థులకు కాంగ్రెస్ పార్టీ చుక్కలు చూపిస్తోంది. జిల్లాలో కాంగ్రెస్ బలం రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో బీఆర్ఎస్ అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని జిల్లాలో రాజకీయ చర్చ తెరపైకి వస్తోంది.
ప్రస్తుత ఎన్నికల్లో కేసీఆర్ అమలుచేస్తున్న పథకాలను మరిచిపోయే విధంగా కాంగ్రెస్ ఆరు గ్యారంటీ పథకాలు జనంలోకి దూసుకెళ్లాయని ఆపార్టీ శ్రేణులు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతల ప్రచారంలోనూ ఆరు గ్యారంటీలపైనే ఎక్కువ దృష్టి పెట్టారు. ప్రజలకు అర్థమయ్యే విధంగా పథకాలు వివరిస్తున్నారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టో ఇంతవరకు ప్రజల్లోకి పెద్దగా వెళ్లినట్లు కనిపించడం లేదనే అభిప్రాయం ఆపార్టీ నేతల్లో ఉంది. ఇప్పటికే జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రచారం చేసి వెళ్లినా పెద్దగా ప్రయోజనం లేదనే ఉద్దేశం ఆపార్టీ నేతల్లో ఉంది.
టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సైతం జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించి, ఓవైపు కేసీఆర్ పై విమర్శలు చేస్తూ.. కాంగ్రెస్ ఆరు గ్యారంటీ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. జిల్లాలో అత్యధికంగా 14 స్థానాలు ఉండడంతో ఇరు పార్టీల అధినేతలు ఈ జిల్లాపైనే ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఇక్కడ ఏ పార్టీకి అధిక స్థానాలు వస్తే రాష్ట్రంలో అధికారం వస్తుందనే సెంటిమెంట్ ఉండడంతో అధినేతల దృష్టి అంతా పాలమూరు జిల్లాపైనే ఉంది. నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల బలాబలాలు పరిశీలిస్తే..
కొడంగల్: ఈనియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి బరిలో ఉన్నారు. ఈయన గెలుపు సునాయాసంగా ఉన్నా, భారీ మెజారిటీ సాధించి చరిత్ర సృష్టించాలనే ఉద్దేశంలో కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కొడంగల్ ను పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. గత ఎన్నికల్లో రేవంత్ రెడ్డిని ఓడించి తప్పు చేశామనే ఉద్దేశంలో నియోజకవర్గ ప్రజలు ఉన్నారు. ఈసారి భారీ మెజారిటీతో అసెంబ్లీకి పంపుతామనే ధోరణిలో ఇక్కడి జనం ఉన్నారు.
ఇప్పటికే రేవంత్ రెడ్డి రెండుసార్లు కొడంగల్ లో ప్రచారం చేశారు. నరేందర్ రెడ్డి తరపున మంత్రి కేటీఆర్ ప్రచారం చేసినా ఉపయోగం కనిపించడం లేదు. ఇక్కడ వార్ వన్ సైడ్ అనే విధంగా రేవంత్ రెడ్డికి ఉంది. మహబూబ్ నగర్: ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. బీఆర్ఎస్ నుంచి మంత్రి శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ నుంచి ఎన్నం శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ నుంచి మిథున్ రెడ్డి బరిలో ఉన్నారు. ప్రచారంలో ముగ్గురూ దూసుకెళుతున్నారు.
2014 ఎన్నికల్లో శ్రీనివాస్ గౌడ్ తక్కువ ఓట్ల మెజారిటీతో ఎన్నం చేతిలో గెలుపొందారు. 2018లో ఎన్నం పోటీ చేసే అవకాశం రాలేదు. ప్రస్తుత ఎన్నికల్లో మళ్ళీ ఇద్దరు శ్రీనివాస్ ల మధ్య పోటీ బిగ్ ఫైట్ గా మారనుంది. నువ్వా, నేనా అన్నట్లు ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్ నేషనల్ ముస్లిం లీగ్ మద్దతుగా నిలబడడంతో ఆపార్టీకి ఈ నియోజకవర్గంలో మైనారిటీల సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో వారి ఓట్లు కాంగ్రెస్ కు పడతాయనే ఆశతో ఉన్నారు. ఇదే జరిగితే పాలమూరులో గెలుపుపై ప్రభావం చూపే ఓట్లు మైనారిటీలవి ఉన్నాయి. ఇరు పార్టీల అభ్యర్థులకు ఈ ఎన్నికలు చావో రేవో అన్నట్లు ఉంది.
దేవరకద్ర: ఈనియోజకవర్గంలో రెండు పార్టీల మధ్య రసవత్తర పోటీ నెలకొంది. బీఆర్ఎస్ నుంచి ఆల వెంకటేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి గౌవినోళ్ల మధుసూదన్ రెడ్డి బరిలో ఉన్నారు. బీఆర్ఎస్ సునాయాసంగా గెలుస్తామని అనుకున్నా.. మధుసూదన్ రెడ్డి బరిలోకి వచ్చాక సీన్ మారింది. గెలుపు అంతా ఈజీ కాదని బీఆర్ఎస్ నేతల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఈనియోజకవర్గంలో సీఎం కేసీఆర్ ఓ పర్యాయం ప్రచారం చేసి వెళ్లారు.
ఈ సందర్భంగా ఆల వెంకటేశ్వర్ రెడ్డి చేసిన అభివృద్ధిని కేసీఆర్ ప్రజలకు వివరించారు. కేసీఆర్ రాకతో బీఆర్ఎస్ కు కొంత గ్రాఫ్ పెరిగిందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి అధినేతలు ప్రచారం చేయకపోవడంతో ఆపార్టీ నాయకులు కొంత నిరాశలో ఉన్నారు. ఒక్కసారి రేవంత్ రెడ్డి ప్రచారం చేసి వెళితే కాంగ్రెస్ పార్టీకి బలం వస్తుందనే ధోరణి లో పార్టీ నేతలు ఉన్నారు. ఇక్కడ కూడా ఇద్దరి మధ్య టఫ్ పైట్ ఉంటోంది.
మక్తల్: ఈనియోజకవర్గంలో రోజురోజుకూ కాంగ్రెస్ బలం పెరుగుతోంది. బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి నారాయణ పేట డీసీసీ అధ్యక్షులు వాకిటి శ్రీహరి రంగంలో ఉన్నారు. శ్రీహరి బలహీనవర్గాలకు చెందిన అభ్యర్థి కావడం.. రెండు సార్లు రామ్మోహన్ రెడ్డిని గెలిపించమని, ఈసారి కాంగ్రెస్ కు అవకాశం ఇవ్వాలనే ధోరణిలో జనం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విజయ బావుటా ఎగురవేయడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. నారాయణ పేట: తన కోపమే తన శత్రువు… అన్నట్లు ఉంది ఇక్కడి బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి తీరు. ఆయన అహంకారమే ఆయనను ఓటమి దిశగా నడిపిస్తోందని పలు సర్వేలు చెపుతున్నాయి.
ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిట్టెం పర్ణిక రెడ్డి ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. పర్ణిక మేనమామ, కాంగ్రెస్ సీనియర్ నేత కుంభం శివకుమార్ రెడ్డి ఆమెకు అండగా నిలబడి కాంగ్రెస్ పార్టీని విజయతీరాలకు నడిపించే విధంగా ప్రచారం చేస్తున్నారు. భారీ విజయం దక్కించుకోవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు శ్రమిస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ గెలుపు సునాయాసంగా ఉంటుందనే అభిప్రాయం స్థానికంగా వ్యక్తమవుతోంది.
జడ్చర్ల: ఈనియోజకవర్గంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల మధ్య బిగ్ పైట్ నెలకొంది. తెలంగాణ ఉద్యమానికి ఊపునిచ్చే విధంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తొలి వ్యక్తి గా పేరుపొందిన చర్లకోల లక్ష్మా రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఇంతకాలం నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసి ప్రజల మధ్య ఉన్న అనిరుద్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఇద్దరు నేతల మధ్య పోరు రసవత్తరంగా నెలకొంది.
నాగర్ కర్నూల్: ఇక్కడి బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి కాంగ్రెస్ అభ్యర్థి కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి చమటలు పట్టిస్తున్నారు. ఈజీగా గెలుస్తాననే ధీమాలో ఉన్న మర్రికి.. రాజేష్ రెడ్డి కొరకరాని కొయ్యగా మారారు. దీంతో మర్రి తన ప్రచారం ముమ్మరం చేశారు. మర్రికి ధీటుగా రాజేష్ రెడ్డి ప్రచారం చేయడంతో కాంగ్రెస్ పార్టీకి గెలుపు ఖాయమనే పరిస్థితి కనిపిస్తున్నదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అచ్చంపేట: ఎవడు చేసిన ఖర్మ వాడు అనుభవించాలనే సామెత బీఆర్ఎస్ అభ్యర్థి గువ్వల బాలరాజుకు అచ్చుగుద్దినట్లు సరిపోతుంది. ఆయన అహంకారమే ఆయనను పాతాళం లోకి నెట్టివేస్తున్నదని స్థానికులు చెబుతున్నారు. నోటి దురుసు, ఎవ్వరినీ లెక్కచేయని పరిస్థితే నేడు ఆయన ఓటమికి దారులు వేసాయి. ఇదే అదనుగా భావించిన కాంగ్రెస్ అభ్యర్థి వంశీ కృష్ణ ప్రజలను తన వైపునకు తిప్పుకోవడంలో విజయం సాధించారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీపై చేయి సాధించేట్లు కనిపిస్తోంది.
వనపర్తి : ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి నిరంజన్ రెడ్డి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ముందుగా మాజీ మంత్రి చిన్నా రెడ్డికి టికెట్ ప్రకటించడంతో తన గెలుపు తథ్యమనే ధోరణి లో నిరంజన్ రెడ్డి ఉన్నారు. చిన్న రెడ్డిని మార్చి మేఘ రెడ్డిని కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించడంతో నిరంజన్ రెడ్డి ఈ ఎన్నికల్లో గెలుపొందాలంటే పోరాటం తప్పదనే ధోరణికి వచ్చినట్లు తెలుస్తోంది.
కొల్లాపూర్: ఈనియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మధ్య ఉత్కంట పోటీ నెలకొంది. రోజురోజుకు జూపల్లికి మద్దతు పెరుగుతుండడంతో బీఆర్ఎస్ వర్గంలో కలవరం మొదలైంది. ఇక్కడ బీ ఆర్ఎస్ గట్టెక్కే పరిస్థితి కనిపించడం లేదని సీనియర్ నేతలు అంటున్నారు.
గద్వాల: ఈనియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి సరిత మధ్య తీవ్ర పోటీ ఉంటుందనే భావన అందరిలో కలిగింది. సరిత చేస్తున్న ప్రచారంలో ఎక్కువగా బడుగు వర్గాల నుంచి వచ్చిన నాయకురాలిని అని సానుభూతి సంపాదించుకునే పనిలో పడ్డారు. సామాజిక వర్గం ఓట్ల కోసమే ఆమె ప్రచారం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ కూడా బీఆర్ఎస్ గెలవడం అంతా సులువు కాదనే విషయం తెలుస్తోంది.
అలంపూర్: ఇక్కడి ఎమ్మెల్యే అబ్రహంకు మొదటగా బీఆర్ఎస్ అభ్యర్థిగా అధిష్టానం ప్రకటించింది. బీ ఫారం ఇచ్చే సమయంలో మరో వ్యక్తికి ఇచ్చింది. అబ్రహంకు బీ ఫారం ఇవ్వకపోవడంలో మాజీ ఎమ్మెల్యే చల్లా వెంకట్రాంరెడ్డి చక్రం తిప్పారు. అబ్రహంకు ఇవ్వకుండా తన అనుచరుడు విజయ్ కు ఇప్పించారు. ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థిగా టీపీపీసీ కార్యదర్శి గా ఉన్న సంపత్ కుమార్ బరిలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ భారీగా పుంజుకుంది. గెలుపు ఎలాగూ వస్తుందని, మెజారిటీ కోసం ప్రయత్నం చేస్తున్నామనే ధోరణి లో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. ఇక్కడ బీఆర్ఎస్ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది.
కల్వకుర్తి: ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి జైపాల్ యాదవ్ మూడో స్థానంలో ఉంటారని ఇక్కడి ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ అభ్యర్థి కసిరెడ్డి నారాయణ రెడ్డి, బీజేపీ అభ్యర్థి ఆచారి మధ్య పోటీ ఉంటోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ గా ఉండి ఆపార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిన కసిరెడ్డికి రెండు పార్టీల మద్దతు ఉంటుందని, దీంతో గెలుపు అవకాశం తనకే ఉందని అంటున్నారు.
షాద్ నగర్: బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, కాంగ్రెస్ అభ్యర్థి వీరంపల్లి శంకర్ మధ్య పోటీ గట్టిగా ఉంటుంది. ఎమ్మెల్యే గా ఉన్న సమయంలో అంజయ్య అభివృద్ధి చేయలేదనే ఆరోపణలు ఉన్నాయి. నియోజకవర్గాన్ని పెద్దగా పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. ఇవే ఆయుధాలుగా మలుచుకుంటున్నారు కాంగ్రెస్ అభ్యర్థి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ భారీగా పుంజుకొంటున్నది. బీఆర్ఎస్ బ్యాక్ టు పెవిలియన్ అనేట్లు కనిపిస్తోంది.
ప్రజాదరణ లేని బీజేపీ
జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు ఉన్నా నామమాత్రంగానే ఉన్నారనే భావన అందరిలో ఉంది. పాలమూరు నియోజకవర్గంలో మిథున్ రెడ్డికి కొంత ప్రజాబలం ఉన్నా గెలిచేస్థాయిలో ఉంటుందో? లేదో? అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వెల్లడిస్తున్నారు. కల్వకుర్తి నియోజకవర్గంలో ఆచారికి ప్రజాబలం ఉంది. గతంలో కొద్ది తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి వంశీ చంద్ రెడ్డి చేతిలో ఓటమి చెందారు. మళ్ళీ ఇప్పుడు తన జాతకం ఎలా ఉంటుందో అని ఆచారి అంటున్నారు. పార్టీ మారని వ్యక్తిగా ఆచారి బీజేపీని నమ్ముకుని ఉన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు ఆచారిని గెలుపు బాటలో ఉంచుతారో లేదో చూడాలి. మిగతా నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు నామమాత్రoగానే పోటీలో ఉన్నారన్న చర్చ జరుగుతోంది.