Traffic Jam On NH44 : జాతీయ రహదారి 44పై 16 కి.మీ. నిలిచిపోయిన వాహనాలు
కామారెడ్డి NH44 పై భారీ వర్షాల కారణంగా 16 కిలోమీటర్ల ట్రాఫిక్ నిలిచింది, రోడ్డు పాక్షికంగా దెబ్బతిన్నది.

Traffic Jam On NH44 | కామారెడ్డి జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో 44 నెంబర్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. జిల్లాలోని అడ్లూర్, ఎల్లారెడ్డి, టేక్రియాల్ వద్ద జాతీయ రహదారి ఒకవైపు కోతకు గురైంది. దీంతో హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వైపు వెళ్లే వాహనాలు నెమ్మదిగా వెళ్తున్నాయి. సదాశివనగర్ నుంచి భిక్కనూర్ టోల్ గేట్ వరకు సుమారు 16 కిలోమీటర్ల వరకు వాహనాలు నిలిచిపోయాయి. భిక్కనూరు టోల్ గేట్ వద్ద ఎడ్లకట్టవాగు ప్రవాహంతో రోడ్డు పాక్షికంగా దెబ్బతింది. కామారెడ్డి మండలం క్యాసంపల్లి వద్ద నిజామాబాద్ వెళ్లే మార్గంలో జాతీయ రహదారి కుంగిపోయింది.
టేక్రియాల్ వద్ద పెద్దచెరువు ప్రవాహంతో జాతీయ రహదారి ఒకవైపు దెబ్బతిన్నది.
కామారెడ్డి జిల్లాలో పలు చోట్ల జాతీయ రహదారిపై గండ్లు పడడం, రోడ్డు కోతకు గురికావడంతో హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వైపు వెళ్లే వాహనాలను గురువారం నుంచి దారి మళ్లించారు. సరుకులు రవాణా చేసే వాహనాలను ఒకవైపు, లైట్ వెహికిల్స్ ను మరో వైపు నుంచి ఆదిలాబాద్ కు వెళ్లేలా పోలీసులు ట్రాఫిక్ డైవర్ట్ చేశారు. అయినా కూడా జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. జాతీయ రహదారిపై నిలిచిపోయిన ట్రాఫిక్ ను పోలీసులు క్లియర్ చేస్తున్నారు.
రెండు రోజులుగా కామారెడ్డి జిల్లాలో భారీ వర్షం కురిసింది. ఆరగొండ గ్రామంలో సుమారు 44 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. కామారెడ్డి పట్టణం చుట్టూ నీరు చేరింది.