KTR : అభినవ నీరో సీఎం రేవంత్ రెడ్డి

తుఫాన్, వర్షాల కష్టంలో ప్రజలు పడితే, రేవంత్ రెడ్డి ప్రాజెక్టుల సమీక్షలతో బిజీగా ఉన్నారని కేటీఆర్ విమర్శించారు.

KTR : అభినవ నీరో సీఎం రేవంత్ రెడ్డి

విధాత, హైదరాబాద్ : వరదలు, వర్షాలతో జనం ఇబ్బంది పడుతుంటే సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మాత్రం అభినవ నీరో మాదిరిగా రూ. 3,50,000 కోట్ల 2036 ఒలంపిక్స్ నిర్వహణ, రూ. 1,50,000 కోట్ల మూసీ సుందరీకరణ, రూ. 225 కోట్ల హైదరాబాద్ బీచ్ ప్రాజెక్టు సమీక్షలు చేస్తున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) విమర్శించారు. కనీవినీ ఎరుగని భారీ వర్షాల వల్ల తెలంగాణలో జన జీవనం స్తంభించిపోయిందని ఎక్స్ వేదికగా కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు.

భారీగా ప్రాణ, ఆస్తినష్టం జరిగిందని, ప్రజలు బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సహాయచర్యల కోసం ఎదురుచూస్తున్నారన్నారు. అభినవ నీరో రేవంత్, ఆయన బృందం మాత్రం ప్రజల గోడు గాలికి వదిలేసి కాసులు కురిపించే పనుల మీదనే దృష్టి అంతా పెట్టారని ఆరోపించారు. నవ్విపోదురు కాక నాకేంటి సిగ్గు అనేలా ఉంది కాంగ్రెస్ మార్క్ ప్రజాపాలన అని కేటీఆర్ విమర్శించారు.