తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె..డిపోలలోనే బస్సులు!
తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో మంగళవారం అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. కార్మికుల సమ్మెతో బస్సులు డిపోలలోనే నిలిచిపోయాయి.
విధాత, హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో మంగళవారం అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. కార్మికుల సమ్మెతో బస్సులు డిపోలలోనే నిలిచిపోయాయి. డిపోల నుంచి బస్సులు కదలకుండా కార్మికులు ఆందోళనకు దిగారు. పోలీసుల బందోబస్తు మధ్య అద్దె బస్సులు, ఎలక్ట్రికల్ బస్సులను నడిపించేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. సమ్మెతో రాష్ట్రవ్యాప్తంగా బస్సులు నడవకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
ప్రయాణికులు తప్పనిసరి పరిస్థితుల మధ్య ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. దీంతో ఇదే అదనుగా ప్రైవేట్ వాహనాదారులు, ఆటోల వారు అధిక చార్జీలు డిమాండ్ చేస్తుండటం ప్రయాణిలకు ఇబ్బందికరంగా మారింది. ఆర్టీసీ సమ్మెతో హైదరాబాద్ నగరంలో మెట్రో రైళ్లలో రద్ధీ విపరీతంగా పెరిగిపోయింది. ఓవైపు అమెరికా-ఇరాన్ నేపథ్యంలో నెలకొన్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరతతో ఆటోలు సైతం తక్కవ సంఖ్యలో నడుస్తుండటం ప్రయాణికులకు మరింత సమస్యాత్మకంగా మారింది.
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 10 వేల ఆర్టీసీ బస్సులు బంద్ కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో విద్యార్థులు, ఉద్యోగులు, సాధారణ ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. రోజూ బస్సుల్లోనే 25 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ఒక్కసారిగా బస్సులు నిలిచిపోవడంతో దాదాపు వారంతా మెట్రో రైళ్ల వైపు మళ్లారు. దీంతో మెట్రో రైళ్లకు ఫుల్ డిమాండ్ పెరిగింది.
కమిటీతో కాలయాపన : ఆర్టీసీ జేఏసీ
ప్రభుత్వంతో ఆర్టీసీ చర్చలు విఫలమవ్వడంతో సమ్మె కొనసాగిస్తున్నామని ఆర్టీసీ జేఏసీ నాయకులు తెలిపారు.
సమ్మె నోటీసులు ఇచ్చిన 41 రోజుల తర్వాత ప్రభుత్వం చర్చలకు పిలిచిందని, చర్చలు విఫలమయ్యాయని వెల్లడించింది. మా డిమాండ్లు అన్ని పాతవేనని, అయినా ప్రభుత్వం కమిటీ వేసి కాలయాపన చేస్తుందని ఆరోపించింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం, కార్మిక సంఘాల పునరుద్ధరణ సహా మెుత్తం 32 హామీలు నెరవేర్చాలని ఆర్టీసీ జేఏసీ సమ్మెకు కొనసాగిస్తుందని స్పష్టం చేసింది.
మరోవైపు కార్మికుల సమ్మెపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి తెలిపారు. సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కొన్ని సంఘాలు నిజాలను విస్మరించి కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నాయని పేర్కొన్నారు.
సమ్మె విరమించండి..డిమాండ్లు పరిష్కరిస్తాం : మంత్రి పొన్నం
ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని, సమ్మె విరమించాలని కోరుతున్నానని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై నాలుగు వారాల్లో కమిటీ నివేదిక ఇస్తుందని, 32 డిమాండ్లలో 29 డిమాండ్లకు ప్రభుత్వం అనుకూలంగా ఉందన్నారు. కార్మికుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని, ఆర్టీసీ ఉద్యోగులకు జీతాలు సమయానికి ఇస్తున్నాం అని గుర్తు చేశారు . పేదలను ఇబ్బంది పెట్టకుండా సమ్మె విరమించాలని కోరారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram