కిషన్ రెడ్డికి అసలు పరీక్ష

కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డికి పార్లమెంటు ఎన్నికలు అసలు పరీక్ష పెట్టనున్నది. రాష్ట్ర అధ్యక్షునిగా ప్రచార బాధ్యతలు భుజానికెత్తుకోవాల్సిన ఆయన కో ఆర్డినేటర్ గా వ్యవహరిస్తున్నారనే విమర్శలు

  • Publish Date - April 20, 2024 / 07:00 PM IST

బీజేపీ ప్రచార బాధ్యతలెవరివీ?
జాతీయ నేతలపైన్నే పూర్తి భారం
ప్రస్తుతం ద్విపాత్రాభినయం
అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే తీరు
సికింద్రాబాద్ నుంచి మళ్లీపోటీ
కోఆర్డినేటర్ గా మారిన కిషన్ రెడ్డి

విధాత ప్రత్యేక ప్రతినిధి: కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డికి పార్లమెంటు ఎన్నికలు అసలు పరీక్ష పెట్టనున్నది. రాష్ట్ర అధ్యక్షునిగా ప్రచార బాధ్యతలు భుజానికెత్తుకోవాల్సిన ఆయన కో ఆర్డినేటర్ గా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఆ పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఆయన ఎంపీ అభ్యర్ధిగా, రాష్ట్ర అధ్యక్షునిగా ద్విపాత్రాభినయాన్ని ఎలా? కొనసాగిస్తారనే చర్చ ఆ పార్టీ వర్గాల్లో సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికలను ఏదో రూపంలో గట్టెక్కినప్పటికీ, ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన పనితీరు ఎలా? ఉంటుందనే చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా మరోసారి సికింద్రాబాద్ నుంచి పోటీలో ఉంటూ రాష్ట్రవ్యాప్తంగా అధ్యక్షునిగా పార్లమెంట్ ఎన్నికల ప్రచారబాధ్యతలు చేపడుతారా? భారమంతా జాతీయ నాయకులపై వేసి తన సెగ్మెంట్ కే పరిమితమవుతారా? అనే చర్చ సాగుతోంది. ప్రస్తుతానికి మాత్రం మీడియా సమావేశాలతో కాంగ్రెస్, బీఆరెస్ పై రాజకీయ దాడిని కొనసాగిస్తున్నారు. రాష్ట్ర అధ్యక్షునిగాక్షేత్రస్థాయిలో ప్రచార కార్యక్రమాన్ని ఇప్పటి వరకు ప్రకటించలేదు.

బండిని తప్పించి కిషన్ రెడ్డికి బాధ్యతలు

2019 ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి ఎంపీగా గెలిచిన కిషన్ రెడ్డి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా కొద్దిరోజులు, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రిగా ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు చేపట్టారు. అప్పటి వరకు అధ్యక్షునిగా పనిచేస్తున్న కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ను అర్ధాంతరంగా తప్పించి కిషన్ రెడ్డికి ఆగమేఘాల మీద ప్రధాని మోదీ వరంగల్ పర్యటనకు ముందు రోజు అధ్యక్ష బాధ్యత అప్పగించిన విషయం ఇప్పటికే రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా ఉంది. దీనికి సరైన సమాధానం మాత్రం ఆ పార్టీ నాయకుల నుంచి రాలేదు.

అసెంబ్లీ ఎన్నికల్లో సభలకే పరిమితం

బీజేపీకి చెందిన సిట్టింగ్ ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, సోయంబాపురావు తదితరులు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా పోటీచేసి ఓటమిపాలయ్యారు. కిషన్ రెడ్డి మాత్రం ఎమ్మెల్యేగా పోటీచేయకుండా దూరంగా ఉన్నారు. ఆయన ఎమ్మెల్యేగా పోటీకి దూరంగా ఉన్నప్పటికీ రాష్ట్ర అధ్యక్షునిగా రాష్ట్రంలో తానుగా ప్రచార బాధ్యతలు తన భుజాలపై వేసుకుని కొనసాగించిందేమీలేదు. జాతీయ నేతలు హాజరయ్యే కార్యక్రమాల కో ఆర్డినేట్ చేస్తూ అధ్యక్షునిగా పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల మాదిరి జాతీయ నాయకుల పై ప్రచార భారాన్ని మోపి భారీ సభలకు అధ్యక్షతవహిస్తూ తన పార్లమెంట్ నియోజకవర్గం సికింద్రాబాద్ ప్రచారాని కే పరిమితమవుతారా? అని చర్చించుకుంటున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర అధ్యక్షునిగా అంతంత మాత్రంగానే ప్రచారానికి వెళ్ళారు. మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తాను ఎమ్మెల్యేగా పోటీలో ఉండికూడా పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించారు. అంతకంటే తక్కువ సెగ్మెంట్లలోనే కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ప్రధాని మోదీ, హాంశాఖ మంత్రి అమిత్ షా, నడ్డా తదితర బీజేపీ అగ్రనేతల సభలకు మాత్రం హాజరయ్యారు. ప్రస్తుతం ఎంపీగా పోటీచేస్తున్నందున భారీ సభలకు పరిమితమవుతారని భావిస్తున్నారు. ఎందుకంటే సికింద్రాబాద్ లో ఆయన స్వయంగా ప్రచారం చేపట్టకుంటే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర అధ్యక్షునిగా ఆయన ప్రచార షెడ్యూల్ కూడా ప్రకటించనందున ఈ అనుమానం తలెత్తుతోంది.

ప్రచార బాధ్యతల్లో కేసీఆర్, రేవంత్

రాష్ట్రంలో మూడు ప్రధాన పార్టీలు బీఆరెస్, కాంగ్రెస్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా కేసీఆర్, రేవంత్, కిషన్ రెడ్డి బాధ్యతలు కొనసాగిస్తున్నారు. కేసీఆర్ ప్రతిపక్షనేతగా, రేవంత్ రెడ్డి సిఎంగా, కిషన్ రెడ్డి కేంద్రమంత్రిగా అదనంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మూడు ప్రధాన పార్టీల అధ్యక్షులుగా రాష్ట్రంలో ఎన్నికల బాధ్యతలు భుజాలకెత్తుకోవడం పరిపాటి. కేసీఆర్ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అంతా తానై ప్రచారం నిర్వహించారు. స్వయంగా గజ్వేల్, కామారెడ్డి నుంచి ఆయన పోటీచేసినప్పటికీ ప్రచారం సాగించారు. కేసీఆర్ కు ఆ పార్టీ నేతలు కేటీఆర్, హరీష్ రావులు తోడుగా నిలిచారు. వీరిద్దరూ ఎమ్మెల్యేలుగా బరిలో నిలిచారు. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ప్రచార బాధ్యతలు తన భుజాలపై మోశారు. రాష్ట్రవ్యాప్తంగా పలు సభల్లో పాల్గొన్నారు. రేవంత్ సైతం కొడంగల్, కామారెడ్డిల నుంచి ఎమ్మెల్యేగా పోటీలో ఉన్నారు. రేవంత్ రెడ్డి తానుగా ప్రచారం కొనసాగిస్తూనే కాంగ్రెస్ ప్రధాన నేతలు సోనియ, ఖర్గే, రాహూల్, ప్రియాంక ల ప్రచార సభల్లో రాష్ట్ర అధ్యక్షునిగా భాగస్వామ్యమయ్యారు. ఉత్తమ్, పొంగులేటి, తుమ్మల, భట్టి తదితరులు తోడుగా నిలిచారు. కిషన్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నప్పటికీ రాష్ట్ర అధ్యక్షునిగా ఆయన ప్రచారం చేపట్టింది నామ మాత్రమే. బీజేపీ జాతీయ నేతల ప్రచారం పైన్నే ఆధారపడ్డారు. బండి సంజయ్ తదితరులు తోడుగా నిలిచారు.

కో ఆర్డినేషన్ కే కిషన్ రెడ్డి పరిమితం

ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి, కేసీఆర్ లు తమ పార్టీ ప్రచార బాధ్యతలు భుజానికెత్తుకున్నారు. ఇద్దరు నాయకులు ఇప్పటికే భారీ బహిరంగ సభలకు హాజరవుతున్నారు. రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారై ప్రచార పర్వంలో పాల్గొంటున్నారు . శుక్రవారం మహబూబ్ నగర్, మానుకోట సభల్లో శనివారం మెదక్ ప్రచారంలో పాల్గొన్నారు. కేసీఆర్ సభల్లో పాల్గొంటునే 22 నుంచి బస్సుయాత్రకు సిద్ధమవుతున్నారు. కిషన్ రెడ్డి మాత్రం బీజేపీ ఎంపీ అభ్యర్ధుల నామినేషన్ కార్యక్రమాల్లో భాగస్వామ్యమవుతున్నప్పటికీ ప్రధాన ప్రచార బాధ్యతలు జాతీయ నేతలే కొనసాగిస్తున్నారు. రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఇతర రాష్ట్రాల సీఎంలు పాల్గొంటున్నారు. రాష్ట్ర అధ్యక్షునిగా కిషన్ రెడ్డి ప్రత్యేక ప్రచార కార్యక్రమమేమి ఇప్పటి వరకు ప్రకటించలేదు. నిత్యం మీడియా సమావేశాల్లో పాల్గొనడం తప్ప తానుగా ప్రచార భారాన్ని మోసేందుకు సిద్ధంగా లేనట్లున్నారు. తాను పోటీ చేస్తున్న సికింద్రాబాద్ లలో ప్రచారం కొనసాగిస్తూ జాతీయ నాయకులు హాజరయ్యే సభల్లో పాల్గొంటారా? ఈ వారంలో తేలనున్నది. ఒక విధంగా మిగిలిన పార్టీల అధ్యక్షులతో పోల్చితే అధికారంలో ఉన్న పార్టీగా, జాతీయపార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కిషన్ రెడ్డి ప్రచార సమన్వయకర్తగా తప్పితే భారం మోసిన సందర్భాలు లేవని ఆ పార్టీ నాయకులే చెవులుకొరుక్కుంటున్నారు. బండి సంజయ్ అధ్యక్ష బాధ్యతలు నిర్వహించినపుడు రాష్ట్రవ్యాప్తంగా ప్రచార బాధ్యతలు తానే కొనసాగించారని గుర్తు చేస్తున్నారు. పార్టీ అభ్యర్ధుల గెలుపు బాధ్యతలు తీసుకోలేకపోవడం కిషన్ రెడ్డి నాయకత్వ సామర్ధ్యతకు ప్రశార్ధకంగా మారింది. ఈ కారణంగా పార్టీలో కొందరు ఆయన మాటవినడంలేదంటున్నారు. అధిష్టానానికి అనుంగు నేతగా గుర్తింపు లభిస్తుందేమోగానీ, నాయకుడంటే గెలుపోటములకు నాయకత్వం వహించినప్పుడే ఆ నమ్మకం కలుగుతోందంటున్నారు. తాను భారం మోయకుండ కాంగ్రెస్, బీఆరెస్ రాష్ట్ర నేతలైన కేసీఆర్ , రేవంత్ రెడ్డిలను విమర్శించడం వల్ల ఆయనకూ, ఆ పార్టీకి నైతిక బలం చేకూరదంటున్నారు. స్వంత పార్టీ కేడర్ లో ఆత్మవిశ్వాసం పెంపొందించదని ఆ పార్టీ వారే వ్యాఖ్యానిస్తున్నారు.

Latest News