విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: కోమటిరెడ్డి సోదరులపై నకిరేకల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చిరుమర్తి లింగయ్య అసత్య ఆరోపణలను సహించమని కాంగ్రెస్ అభ్యర్థి వేముల వీరేశం ఖండించారు. ఎన్నికల్లో పబ్బం కడుక్కునేందుకే చిరుమర్తి అవాకులు, చవాకులు పేలుతున్నారన్నారు. శనివారం నకిరేకల్లులో వీరేశం మీడియాతో మాట్లాడారు. 10 రోజులగా సందర్భంగా లేకున్నా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చిరుమర్తి… కోమటిరెడ్డి బ్రదర్స్ పైన, కాంగ్రెస్ లో చేరిన శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ పై ఆసత్య ఆరోపణలు చేయడం సరికాదన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మంత్రి పదవికి రాజీనామా చేసిన వెంకట్ రెడ్డి పై అసత్య ప్రచారం చేయటం తగదన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉండి తెలంగాణ రాష్ట్రం కోసం కోట్లాడిన నేత అని, ఫ్లోరోసిస్ పై 9 రోజుల నిరాహార దీక్ష చేసిన వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. 2009లో కోమటిరెడ్డి బ్రదర్స్ వల్లే చిరుమర్తికి కాంగ్రెస్ టికెట్ వచ్చిందని, ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. టికెట్ల కోసం కాంగ్రెస్ నేతల దగ్గర కోమటిరెడ్డి డబ్బులు వసూలు చేశారనేది అవాస్తవమని కొట్టిపారేశారు.
కాంగ్రెస్ ప్రభంజనం చూసి బీఆర్ఎస్ నేతలకు భయం జొరబడిందని చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేనని తెలుసుకొని రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లోకి వచ్చారని, రాజకీయ లబ్ధి కోసం కాదని చెప్పారు. నకిరేకల్ లో ఎన్ని ప్రయత్నాలు చేసినా కాంగ్రెస్ అభ్యర్థిగా తన విజయం తథ్యమన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలే పార్టీని అధికారంలోకి తెస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.