పేరుకే వరంగల్ జిల్లా..పాలనంతా హనుమకొండే!

ఏళ్ళు గడుస్తున్నా వరంగల్ కు దక్కని పాలన
వరంగల్ జిల్లాను ఎత్తేస్తారని నేటికీ ప్రచారం
కలెక్టరేట్ భవన నిర్మాణ పనులు పరిశీలించిన కలెక్టర్
విధాత ప్రత్యేక ప్రతినిధి : గత బీఆర్ఎస్ ప్రభుత్వహయంలో ఉమ్మడి వరంగల్ జిల్లాను ఏకంగా ఆరుజిల్లాలుగా మార్చివేసింది. ఈ క్రమంలో వరంగల్ రూరల్ జిల్లాగా మొగ్గతొడిగి కొద్ది కాలానికి పేరుతోపాటు పరిధిలో చేర్పులు చేసుకుని ఏర్పడిన వరంగల్ జిల్లాకు ఏళ్ళు గడుస్తున్నా..బాలారిష్టాలు వీడడంలేదు. తొలుత వరంగల్ రూరల్ జిల్లాకు జిల్లా కేంద్రం ఎక్కడ ఏర్పాటు చేయాలో తెలియని అయోమయానికి తెరదించుతూ మార్పులతో వరంగల్ జిల్లాగా మార్చారు. అయితే, నేటికీ పాలనంతా హనుమకొండలోని తాత్కాలిక జిల్లా కలెక్టరేట్ కేంద్రంగానే సాగుతోంది. వరంగల్ కేంద్రంగా ప్రభుత్వపాలన ఎప్పుడు ప్రారంభముతుందోనని ప్రజలు ఆశతో ఎదురుచూస్తున్నారు. గత బీఆర్ఎస్ హయంలోనూ, నేటి కాంగ్రెస్ పాలనలోనూ ఇంకా ఈ కల నెరవేరలేదని వరంగల్ వాసులు చెబుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో అట్టహాసంగా 2016 అక్టోబరు 11 న నూతనంగా వరంగల్ రూరల్ జిల్లాను ప్రకటించారు. వరంగల్ రూరల్ జిల్లాగా ప్రకటిచిన 2021 ఆగస్టు వరకూ ఈ జిల్లాకు రంగూ..రూపులేకుండా పోయింది. తాత్కాలికంగా హనుమకొండలో జిల్లా కలెక్టరేట్ ను ఏర్పాటు చేసి అక్కడి నుంచే పాలన కొనసాగిస్తున్నారు. తదుపరి నూతనంగా ఏర్పాటు చేసిన వరంగల్ రూరల్ జిల్లాకు జిల్లా కేంద్రం ఎక్కడ ఏర్పాటు చేయాలో తేల్చుకోలేకపోయారు. ఈ విషయంలో అప్పటి ఎమ్మెల్యేల మధ్య ఏకాభిప్రాయం రాకపోవడం, ప్రభుత్వ పెద్దలు పరిష్కరించలేక చివరికి చేతులెత్తేశారు. ఈ క్రమంలో రెండో సారి అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్ వరంగల్ రూరల్ జిల్లా సమస్య మరోసారి ఎజెండా పైకి వచ్చింది. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామంటూ ప్రకటించి వరంగల్ అర్బన్ జిల్లా పరిధిలో ఉన్న వరంగల్ తూర్పు నియోజకవర్గాన్ని వరంగల్ రూరల్ జిల్లా పరిధిలోకి చేర్చి జిల్లా పేరును వరంగల్‌గా మార్పు చేశారు. జిల్లా కేంద్రంగా వరంగల్‌ను ప్రకటించి జిల్లా రూపురేఖల్లో స్వల్పమార్పులు చేపట్టారు. కొద్ది రోజులకు పాత ఆజంజాహి మిల్లు స్థలంలో నూతన కలెక్టరేట్ భవన నిర్మాణానికి అట్టహాసంగా శంకుస్థాపన చేశారు. ప్రాథమిక స్థాయి పనులు ప్రారంభించిన కొద్ది రోజులకు ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో సైతం ఈ కలెక్టరేట్ పనులు నత్తనడకనసాగుతున్నాయి.
ప్రజలకు పాలన అందుబాటులో…
ప్రజలకు అందుబాటులో అధికారులుంటారని, పాలనా సౌలభ్యం కోసమంటూ రాష్ట్ర వ్యాప్తంగా పాత పది జిల్లాలను 33 జిల్లాలుగా విభజించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా విభజన సందర్భంగా జనగామ, ములుగు ప్రజల నుంచి వచ్చిన తీవ్ర ఆందోళన, డిమాండ్ మేరకు కొత్త జిల్లాలు తెరపైకి వచ్చాయి. దీంతో జిల్లాల సంఖ్య ఆరుకు పెరిగింది. తర్వాత కొద్ది కాలానికి చేర్పులు మార్పులు చేశారు. తొలుత ప్రకటించిన వరంగల్ అర్బన్ జిల్లాలోని వరంగల్ తూర్పు నియోజకవర్గాన్ని తొలగించి హనుమకొండ జిల్లాగా, వరంగల్ తూర్పును వరంగల్ రూరల్ జిల్లాలో కలుపుతూ వరంగల్ జిల్లాగా చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాను ఆరు జిల్లాలు వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, మహబూబాబాద్, జనగాం, ములుగు, భూపాలపల్లిగా విభజించారు. తర్వాత జరిగిన పరిణామాల్లో కొద్ది మార్పులు చేపట్టారు.
జిల్లాల విభజనపై భిన్నవాదనలు
కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి భిన్నవాదనలున్నాయి. జిల్లాల ఏర్పాటుకు ఒక ప్రాతిపదిక అంటూ లేకుండా చేశారనే విమర్శలున్నాయి. మరోవైపు స్థానికుల ఒత్తిడికి తలొగ్గి కొన్ని జిల్లాలు, తమ రాజకీయ ప్రాధాన్యతలో మరికొన్ని జిల్లాలు, నాయకులు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాలను బట్టి ఇంకొన్ని జిల్లాలు ఏర్పాటు చేశారనే అభిప్రాయం ఉంది. కేసీఆర్ లక్కీ నెంబర్ ఆధారంగా జిల్లాల విభజన సాగిందనే ఆరోపణలున్నాయి. పూర్వ జిల్లాకు ఉండే వైభవం, రాజకీయ ఐక్యత లేకుండా జిల్లాలను విభజించారనే విమర్శలున్నాయి. దీనికి భిన్నంగా మారుమూల ములుగు లాంటి ప్రాంతాలను జిల్లాలుగా ప్రకటించడంతో ప్రజలకు పాలన అందుబాటులోకి వచ్చిందనే అభిప్రాయం ఉంది. తమ ప్రాంతాల అభివృద్ధికి దోహదం చేసిందనే వాదన కూడా ఉంది. ఈ క్రమంలోనే అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ అశాస్త్రీయంగా, హేతుబద్ధతలేకుండా ఇష్టానుసారంగా ఏర్పాటు చేసిన జిల్లాల విభజనపై ఆరోపణలు చేసింది. తాము అధికారంలోకి వస్తే జిల్లాల ఏర్పాటును సమీక్షిస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. జిల్లాల విభజన పైన శాస్త్రీయ ప్రమాణికంతో సమీక్షిస్తామని ప్రకటించిన అప్పటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. దీంతో జిల్లాల విభజన పై తీవ్ర చర్చ సాగింది. ఈ క్రమంలోనే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆరుకు బదులు జిల్లాల సంఖ్య తగ్గుతుందనే చర్చ ప్రారంభమైంది. ఒకే పట్టణంగా ఉన్న వరంగల్ నగరాన్ని విభజించడం సరైందికాదనే అభిప్రాయం కొందరు వ్యక్తం చేశారు. మరి కొందరు మాత్రం హనుమకొండను కాదని చాలా కాలానికి వరంగల్ ప్రాంతానికి గుర్తింపు వచ్చిందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇలాగే రాష్ట్రంలో కొన్ని జిల్లాలను తిరిగి కలుపుతారనే చర్చ సాగింది. అయితే జిల్లాలు ఒకసారి ఏర్పాటైన తర్వాత దాన్ని రద్దు చేస్తే సెంటిమెంటు నెలకొనే అవకాశం ఉంది. ఈ తేనెతుట్టెను కదిలిస్తే ఇబ్బందులు ఏర్పడుతాయనే అభిప్రాయం ఉంది. మరోవైపు బీఆర్ఎస్ ఈ అంశం పై ప్రశ్నించేందుకు సిద్ధంగా ఉంది. ఈ కారణంగానే జిల్లా విభజన పై సమీక్ష తాత్కాలికంగా వాయిదా వేశారని భావిస్తున్నారు. అయినప్పటికీ వరంగల్, హనుమకొండ జిల్లాలను కలిపి ఒకే జిల్లాగా ఏర్పాటు చేస్తారనే ప్రచారం ఉంది. దీంతో ప్రస్తుత వరంగల్ జిల్లా ఉనికిలో ఉంటుందా? లేదా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. దీని వల్లే పాలన వరంగల్‌కు బదలాయించకుండా, ఇక్కడికి కార్యాలయాలు తరలించకుండా చేస్తున్నారనే విమర్శలున్నాయి. నిర్మాణం ప్రారంభించినా జిల్లా కలెక్టరేట్ పనులు కూడా నత్తనడకన సాగుతున్నాయనే అనుమానం ఉంది. ఇప్పటికైనా పనులు త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నారు.
కొత్త కలెక్టరేట్ ను పూర్తి చేయండి: కలెక్టర్ సత్య శారద
నూతన సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాల నిర్మాణా పనుల్లో వేగం పెంచి గడువులోగా పూర్తి చేయాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. వరంగల్ లోని పాత ఆజంజాహి మీల్స్ గ్రౌండ్‌లో నిర్మిస్తున్న నూతన కలెక్టరేట్ భవన సముదాయాలను సందర్శించి పనుల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా మూడు అంతస్తుల నిర్మాణాలను, కలెక్టర్ క్వార్టర్స్, అడిషనల్ కలెక్టర్ క్వార్టర్స్ మొదటి, రెండవ అంతస్తులలో డిజైన్ ప్రకారం పనులు జరుగుతున్నాయా లేదా అని పరిశీలించారు. స్ట్రక్చరల్ పనులు పూర్తయినందున ఫీనిషింగ్ పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.