వరంగల్ కేఏంసీలో ర్యాగింగ్ కలకలం.. చర్యలకు సిద్ధమవుతున్న అధికారులు

వరంగల్‌ కేఎంసీలో మరోసారి ర్యాగింగ్‌ సంఘటన కలకలం రేపింది. సీనియర్ల తీరుపై జూనియర్‌లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ర్యాగింగ్‌కు పాల్పడినవారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది.

  • By: TAAZ |    telangana |    Published on : Apr 09, 2026 10:06 PM IST
వరంగల్ కేఏంసీలో ర్యాగింగ్ కలకలం.. చర్యలకు సిద్ధమవుతున్న అధికారులు

విధాత, ప్రత్యేక ప్రతినిధి:

వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాలను ర్యాగింగ్ ప్రతీ ఏడాది వెంటాడుతోంది. ఈ ఏడాది కూడా ర్యాగింగ్ విషయంలో జూనియర్ విద్యార్థులను సీనియర్ విద్యార్థుల మధ్య ఘర్షణ తలెత్తి పోలీసులకు ఫిర్యాదు చేసుకునే వరకు చేరింది. ఈ సంఘటనపై కాలేజీ యాజమాన్యం విచారణ జరిపి సంబంధిత విద్యార్ధులను హాస్టల్ నుంచి బహిష్కరించి కాలేజీ నుంచి మూడు నెలల పాటు పంపించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. మూడవ సంవత్సరం చదువుతున్న సీనియర్ విద్యార్థులు రెండవ సంవత్సరం చదువుతున్న జూనియర్ విద్యార్థులను మోకాళ్ళపై కూర్చోబెట్టి ఇబ్బందులకు గురి చేశారని బాధిత విద్యార్థులు కళాశాల అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా గత ఏడాది కేఎంసీలో ప్రీతి అనే మెడికో మృతి సంఘటన తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు, కాలేజీ యంత్రాంగం అప్రమత్తమయ్యారు.

చర్యలకు సిద్ధమవుతున్న కాలేజీ యంత్రాంగం

సాధారణంగా ర్యాగింగ్ అనగానే కొత్తగా కళాశాలకు వచ్చిన విద్యార్థులను సీనియర్ల మధ్య ఉంటుందని అందరూ భావిస్తారు.. కేఎంసీలో మాత్రం ఎంబీబీఎస్ రెండు, మూడవ సంవత్సరాలు చదువుతున్న విద్యార్థుల మధ్య ర్యాగింగ్‌ జరిగింది. ఒక విధంగా ఇది ఆధిపత్యంగా భావిస్తున్నారు. రెండవ సంవత్సరం ఎంబీబీఎస్ చదువుతున్న విద్యార్థుల వాట్సప్ గ్రూప్‌లో మూడవ సంవత్సరం విద్యార్థుల గురించి తప్పుగా మాట్లాడుతున్నారన్నారని సమాచారం అందుకున్నారు. తమ గురించి జూనియర్స్ తప్పుగా మాట్లాడడం సరియైనది కాదు.. వారికి బుద్ధి చెప్పి తీరాల్సిందేనని సీనియర్స్ కలిసి నిర్ణయించుకున్నారని సమాచారం. అనుకున్నదే తడువుగా హాస్టల్ టెర్రస్ పైకి రెండవ సంవత్సరం చదువుతున్న 20 మంది జూనియర్ మెడికోస్‌ను పిలిచి, మోకాళ్లపై కూర్చోబెట్టి తప్పయిందని, మరోసారి ఇలా చేయమని సారీ చెప్పించుకున్నారు. అదే సమయంలో ఇబ్బంది పెట్టారని సమాచారం . ఇది నచ్చని కొంతమంది జూనియర్ విద్యార్థులు నేషనల్ మెడికల్ కౌన్సిల్ నుంచి మొదలు పెట్టి సంబంధిత శాఖాధికారులకు ఫిర్యాదు చేశారు. వరంగల్ పోలీస్ కమిషనర్ కు కూడా బాధిత విద్యార్థులు ఫిర్యాదు చేశారు.. దీంతో కళాశాల అధికారులు, పోలీసులు రంగంలోకి దిగారు. సంఘటనపై విచారణ జరిపి ర్యాగింగ్ కారకులైన విద్యార్ధులపై చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. కొందరు విద్యార్ధులను హాస్టల్, కాలేజీ నుంచి మూడు నెలలపాటు బహిష్కరించేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. కాలేజీలో విద్యార్ధుల కదలికలపై నిఘా తీవ్రం చేసినట్లు చెబుతున్నారు.