Brs Sarkar | ఎక్కడ వేసిన గొర్రెలు అక్కడే! బీఆరెస్‌ సర్కార్ మాయాజాలం

గొల్ల, కురుమలను కోటీశ్వరులను చేస్తానని ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కే చంద్రశేఖర్ రావు ప్రతి వేదిక మీద ప్రచారం చేసుకున్నారు. పెద్ద ఎత్తున గొర్రెల పెంపకాన్ని ప్రోత్సహించి ఎగుమతులు పెంచే స్థాయికి తెలంగాణ రాష్ట్రం ఎదుగుతుందని ధీమా వ్యక్తం చేశారు.

Brs Sarkar | ఎక్కడ వేసిన గొర్రెలు అక్కడే! బీఆరెస్‌ సర్కార్ మాయాజాలం

2012లో 1,28,35,761 జీవాలు
2017లో గొర్రెల పంపిణీ పథకం
2024 నాటికి 1,24,14,299 గొర్రెలే

విధాత, హైదరాబాద్: గొల్ల, కురుమలను కోటీశ్వరులను చేస్తానని ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కే చంద్రశేఖర్ రావు ప్రతి వేదిక మీద ప్రచారం చేసుకున్నారు. పెద్ద ఎత్తున గొర్రెల పెంపకాన్ని ప్రోత్సహించి ఎగుమతులు పెంచే స్థాయికి తెలంగాణ రాష్ట్రం ఎదుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఇందుకోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. లెక్కలు పరిశీలిస్తే మాత్రం తిరోగమనం దిశలో ఉన్నామే కానీ పురోగమించకపోవడం శోచనీయం. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా కేసీఆర్‌ ప్రారంభించిన గొర్రెల పథకం పరిస్థితి ‘ఎక్కడ వేసిన గొర్రెలు అక్కడే’ అన్నట్టు తయారైంది.
రాష్ట్రంలో గొర్రెల పంపిణీ పథకం 2017 లో అట్టహాసంగా ప్రారంభించింది బీఆరెస్‌ ప్రభుత్వం. పొరుగున ఉన్న మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున గొర్రెల మందను తీసుకువచ్చారు. గొల్ల కురుమతో గ్రూపులను ఏర్పాటు చేసి, కొనుగోలు చేసిన వాటిని పంపిణీ చేశారు. ఈ పథకం ద్వారా రెండు కులాలకు చెందిన వారు కోటీశ్వరులు అవుతారని, తద్వారా రాష్ట్రంలో మాంసం ఉత్పత్తి పెరుగుతుందని అప్పటి బీఆరెస్‌ ప్రభుత్వ పెద్దలు గంట కొట్టి మరీ చెప్పారు. పొట్టేలు మాంసం కోసం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని, స్వరాష్ట్రంలో స్వయం సమృద్ధి సాధించడంతో పాటు ఎగుమతులు చేసే స్థాయికి వెళ్తున్నామని చెప్పారు. ఇటీవల నిర్వహించిన పశుగణన లెక్కల ప్రకారం దశాబ్దకాలంలో మేకలు, గొర్రెల సంఖ్య పెరగక పోగా కొంత తగ్గడం గమనార్హం. 2012 సంవత్సరంలో గొర్రెలు, మేకల సంఖ్య 1,28,35,761 ఉండగా 2019లో 1,90,94,836గా నమోదు అయ్యింది. ఈ లెక్కలను పరిశీలిస్తే ఏడు సంవత్సరాలలో 48.76 శాతం పెరిగింది. గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని 2017 సంవత్సరంలో బీఆరెస్‌ ప్రభుత్వం ప్రారంభించింది. అప్పటి నుంచి ఈ ఏడాది వరకు (2024) లెక్కలను పరిశీలిస్తే సంఖ్య తగ్గింది. 2024 పశు గణన ప్రకారం 1,24,14,299 గొర్రెలు మాత్రమే ఉన్నాయి. అంటే.. 2012 సంవత్సరం లెక్కలకు సరిపోలడం లేదు.

రూ.5,500 కోట్లు ఏడవాయే?

బీఆరెస్‌ ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకం కింద రూ.5,500 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో లబ్ధిదారుల వాటా 25 శాతం ఉంది. లబ్ధిదారుల వాటా మినహాయించగా మిగిలిన డబ్బులు ఎవరి జేబులోకి వెళ్లాయో ఇట్టే తెలిసిపోతున్నది. గొర్రెలు, మేకల కుంభకోణంపై ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం విచారణకు ఆదేశించి. ఈ కుంభకోణంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ గుండమరాజు కళ్యాణ్ కుమార్, తెలంగాణ పశుగణాభివృద్ధి సంస్థ సీఈవో సబావట్ రాంచందర్ జైలు ఊచలు లెక్కపెడుతున్నారు. ఈ కేసులో వీరిద్దరినీ మే 31వ తేదీన ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. వీరు ప్రైవేటు వ్యక్తులు, బ్రోకర్లతో కుమ్మక్కయ్యి అక్రమాలకు పాల్పడ్డారని ఏసీబీ గుర్తించింది. బ్రోకర్లతో చేతులు కలిపి నకిలీ బ్యాంకు ఖాతాలను నిర్వహించడం, ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించే పనులు చేశారు. ఇప్పటి వరకు ఈ కేసులో ప్రమేయం ఉన్న పది మందిని అరెస్టు చేశారు. గొర్రెల పంపిణీలో గోల్ మాల్ జరిగిందని, తమకు డబ్బులు ఇవ్వడం లేదని కొందరు ఫిర్యాదు చేయడంతో డిసెంబర్, 2023లో కేసు నమోదు అయ్యింది. పథకం ప్రారంభ సంవత్సరం ఒక్కో కుటుంబానికి 75 శాతం సబ్సిడీపై రూ.1.25 లక్షల యూనిట్ ధరతో 20 గొర్రెలను పంపిణీ చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి దాదాపు 82.74 లక్షల గొర్రెలు, మేకలు కొనుగోలు చేసి 3.92 లక్షల మంది ప్రాథమిక గొర్రెల పెంపకందారుల సహకార సంఘాల సభ్యులకు అందచేశారు. 2021లో కంప్ర్టోలర్ అండ్ ఆడిటర్ (కాగ్) ఇచ్చిన నివేదికలో పథకం అమలులో భారీ అవకతవకలు చోటు చేసుకున్నాయని, వందల కోట్ల రూపాయలు చేతులు మారాయని పేర్కొంది. ఏడు జిల్లాల్లో పథకం అమలు, లబ్ధిదారుల వివరాలు గందరగోళంగా ఉన్నాయి. నకిలీ వాహన్ రిజిస్ట్రేషన్ నెంబర్లు, అనుమతి కన్నా ఎక్కువగా గొర్రెల యూనిట్లను రవాణా చేసినట్లు లెక్కలు రాసుకున్నారు. టూ వీలర్ పై 126 గొర్రెలను రవాణా చేసినట్లు రశీదులు సృష్టించారంటే అక్రమాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఊహించుకోవచ్చు. వీటిని ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు తరలించడానికి అంబులెన్సులు, కార్లు, బస్సులు, టూ వీలర్స్, వాటర్ ట్యాంకర్లు కూడా ఉపయోగించారు.