ఐదు కోట్ల రూపాయలు విలువ చేసే పుస్తకం.. ఇదిగో..

  • Publish Date - October 24, 2023 / 06:17 AM IST
  • ప్ర‌పంచ‌శాంతికి ఓ ర‌చయిత‌ అమూల్యమైన ప్రార్థ‌న‌
  • ఏన్ ఇన్‌వాల్యుబుల్ ఇన్వొకేష‌న్ పేరుతో పుస్త‌కం
  • వెల‌.. ఐదు కోట్ల రూపాయలు
  • వ‌చ్చిన సొమ్ము 100 శాతం విరాళాల‌కే


అంద‌రూ ప్ర‌పంచ శాంతి కావాల‌ని కోరుకునేవారే. కానీ కొద్ది మాత్ర‌మే ఆ ఆశ‌యం కోసం ప‌నిచేస్తారు. అలాంటి కొద్దిమందిలో ఒక‌రు డాక్ట‌ర్ వంగీపురం శ్రీ‌నాథాచారి. జ‌నాల‌ను క‌దిలించే శ‌క్తి అక్ష‌రానికి ఉంద‌ని భావించి, త‌న ఆలోచ‌న‌లు, ఆశ‌యాల‌ను ప్ర‌స్తావిస్తూ ఏన్ ఇన్ వాల్యుబుల్ ఇన్వొకేష‌న్ (ఓ అమూల్య‌మైన ప్రార్థ‌న) పేరుతో సుదీర్ఘ భావ‌గీతాన్ని ర‌చించారు. ఐక్య‌రాజ్య స‌మితి దినోత్స‌వం అయిన అక్టోబ‌ర్ 24 (మంగ‌ళ‌వారం) నాడు హైద‌రాబాద్‌లో ఈ పుస్త‌కాన్ని ఆవిష్కరించారు.


ఏన్ ఇన్ వాల్యుబుల్ ఇన్వొకేష‌న్ పూర్తిగా ఆంగ్ల‌భాష‌లోనే ఉంటుంది. అంతే కాకుండా ఇది ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన పుస్త‌కంగానూ రికార్డుల‌కెక్క‌నుంది. ఈ పుస్త‌కం అమ్మ‌కాల‌తో డ‌బ్బు గ‌డించడం ల‌క్ష్యం కాద‌ని.. విక్ర‌యాల‌తో వ‌చ్చిన సొమ్మంతా స‌మాజ శ్రేయ‌స్సుకే ఉప‌యోగిస్తామ‌ని పుస్త‌క ర‌చ‌యిత శ్రీ‌నాథాచారి వెల్ల‌డించారు. వ‌చ్చిన సొమ్ములో 50 శాతం యునైటైడ్ నేష‌న్స్‌కు, 25 శాతం భార‌త్‌కు, మ‌రో 25 శాతం తెలంగాణ రాష్ట్ర పురోభివృద్ధికి ఉప‌యోగించ‌నున్నారు. ఈ విష‌యాన్ని పుస్త‌కం క‌వ‌ర్‌పేజీ మీదే ముద్రించ‌డం విశేషం.  


పుస్త‌కంలో ఏమేముంటాయి?


ఏన్ ఇన్‌వాల్యుబుల్ ఇన్వొకేష‌న్ అనేది ఓ సుదీర్ఘ కావ్యం. ముందుగానే చెప్పిన‌ట్లు ఈ కావ్యం మొత్తం ఇంగ్లిషులోనే ఉంటుంది. ప్ర‌పంచ‌చ‌రిత్ర‌లో వివిధ ప్ర‌దేశాల్లో, వివిధ స‌మ‌యాల్లో విల‌సిల్లిన శాంతిని ఈ కావ్యంలో గుర్తుచేస్తారు. మాన‌వాళినే దైవ‌స్వ‌రూపంగా భావించి ప్ర‌స్తుతం ఉన్న అశాంతిని పార‌ద్రోలాల‌ని ప్రార్థిస్తున్న‌ట్లుగా ఈ కావ్యం సాగుతుంది. పాఠ‌కుడి సౌల‌భ్యం, ప్ర‌స్తావించే అంశాన్ని బ‌ట్టి కావ్యాన్ని 10 ఆశ్వాసాలుగా విభ‌జించారు.


అవి ప్రిల్యూడ్ టు పీస్ (శాంతి ప్ర‌స్తావ‌న‌), ఇన్వొకేష‌న్ (ప్రార్థ‌న‌), హ్యుమానిటీ అండ్ యూనిటీ (ప్ర‌పంచ శాంతి, ఐక్య‌త‌), యునైటెడ్ నేష‌న్స్‌, యునైటెడ్ ఎఫ‌ర్ట్స్ (ఐక్య రాజ్యాలు, ఐక్య కార్యాచ‌ర‌ణ‌), ప్రొటెక్టింగ్ అవ‌ర్ ప్లానెట్ (భూమాత ప‌రిర‌క్ష‌ణ‌), రియ‌లైజేష‌న్ అండ్ ప‌వ‌ర్ (మాన‌వ శ‌క్తి సామ‌ర్థ్యాల గుర్తింపు), ద ఫైన‌ల్ వ‌ర్స్ – ఏ స‌మేష‌న్ ఆఫ్ అవ‌ర్ జ‌ర్నీ (అంతిమ ప‌ద్య‌కృతి – ప్ర‌పంచ శాంతి ప్ర‌యాణ సారాంశం), అక్‌నాలెడ్జ్‌మెంట్స్ (కృత‌జ్ఞ‌తాంజ‌లి).. ఇలా 10 భాగాల‌లో ర‌చ‌యిత త‌న అభిప్రాయాల‌ను వినిపించారు. వీటిల్లోనే సంద‌ర్భానుసారంగా ప్ర‌పంచ స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావిస్తూ, ప్ర‌పంచ‌శాంతిని సాధించ‌డానికి అవలంబించాల్సిన మార్గాల‌నూ సూచించారు.  ఇంతకీ  ఈ పుస్తకం ధరెంతో తెలుసా? అక్షరాలా ఐదు కోట్ల రూపాయలు.


ఎవ‌రీ ర‌చ‌యిత‌?


డాక్ట‌ర్ వంగీపురం శ్రీ‌నాథాచారి ఇంగ్లిష్‌లో పీహెచ్‌డీ, సైకాల‌జీ, బిజినెస్ మేనేజ్‌మెంట్‌ల‌లో పీజీలు పూర్తి చేశారు. పాల‌మూరు విశ్వ‌విద్యాల‌యంలో అద‌న‌పు ప‌రీక్షల నియంత్ర‌ణాధికారిగా, క్యాంప‌స్ క‌ళాశాల ప్రిన్సిప‌ల్‌గా, ఆంగ్ల విభాగాధిప‌తిగా .. ఇలా వివిధ ఉన్న‌త ప‌ద‌వుల్లో సేవ‌లందించారు. వ్య‌క్తిత్వ వికాస నిపుణులుగానూ అనేక మందికి దారి చూపించే ప్ర‌య‌త్నం చేశారు.


అంతే కాకుండా వివిధ విభాగాల్లో ఆయ‌న చేసిన విభిన్న‌మైన కృషికి శ్రీ‌నాథాచారి పేరు మీద కొన్ని గిన్నిస్ వ‌రల్డ్ రికార్డులూ ఉన్నాయి. అందులో ఒక‌టి హ్యాండీ క్రిస్ట‌ల్స్ అనే ఒక పుస్త‌కం. సుదీర్ఘ పుస్త‌క శీర్షికల విభాగంలో దీనికి 2010లో గిన్నిస్ రికార్డు ల‌భించింది. ఫ‌ర్‌సేక్ మి నాట్ అనే శీర్షిక‌తో వీరు రాసిన ఆంగ్ల క‌వితా సంపుటి అమెజాన్‌లో ఈ బుక్‌గా విశేష ప్ర‌జాద‌ర‌ణ పొందింది. శ్రీనాథాచారి ప్ర‌స్తుతం వ్య‌క్తిత్వ వికాస నిపుణుడిగా ఫ్రీలాన్సింగ్ చేస్తూ.. శిక్ష‌ణా త‌ర‌గ‌తుల‌ను కూడా నిర్వ‌హిస్తున్నారు.