విధాత, ఇల్లందు: ఇల్లందు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ రోజురోజుకూ పట్టు పెంచుకుంటోంది. అధికార బీఆరెస్ కు షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నారు. పలు మండలాల్లో ప్రచారాలకు వెళ్తున్న గులాబీ నేతలకు ఓవైపు నిరసన సెగలు అంటుకుంటున్నాయి. మరోవైపు ఆపార్టీ నాయకుల రాజీనామాలపర్వం కంటిమీద కునుకులేకుండా చేస్తోంది.
నియోజకవర్గ పరిధిలోని బీఆరెస్ కీలక స్థానిక ప్రజాప్రతినిధులు, పట్టున్న నాయకులు వరుసగా ఆపార్టీని వీడుతున్నారు. ఇటీవల చోటుచేసుకుంటున్న వరుస పరిణామాలతో ఇల్లందులో కారు బేజారవుతోంది. రోజురోజుకూ ఆ పార్టీ నేతలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇదే అదునుగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వేళ మరింత పుంజుకుంటోంది.
దూసుకుపోతున్న కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీ ఇల్లందు నియోజకవర్గంలో రోజురోజుకు దూసుకుపోతోంది. బీఆర్ఎస్ నుండి భారీగా వలసలు కాంగ్రెస్ లో జోష్ పెంచుతున్నాయి. పెద్దఎత్తున బీఆరెస్ ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేసి కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు. గార్ల మండలంలో జడ్పీటీసీ, సొసైటీ చైర్మన్, ఆరుగురు సర్పంచులు, నలుగురు సొసైటీ డైరెక్టర్లు, ఇద్దరు ఎంపీటీసీలు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు.
మాజీ ఎంపీ శ్రీనివాస్ రెడ్డి, కోరం కనకయ్య సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. బయ్యారం మండలంలోనూ అదే పరిస్థితి. కామేపల్లి మండలం జోక్ గూడెంకు చెందిన 100 కుటుంబాలు బుధవారం జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య క్యాంప్ ఆఫీస్ లో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
రేపో మాపో మున్సిపల్ చైర్మన్?
ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు రేపో మాపో అధికార బీఆరెస్ కు గుడ్ బై చెప్పనున్నారు. ఆయనతోపాటు పలువురు కౌన్సిలర్లు, ఇల్లందు మండల స్థానిక ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు ఆపార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. మున్ముందు బీఆరెస్ లో మరిన్ని రాజీనామాలు కొనసాగుతాయని స్థానిక రాజకీయ పరిస్థితులను అంచనా వేస్తున్న విశ్లేషకులు అంటున్నారు.
కోరం కనకయ్యకు పెరుగుతున్న ఆదరణ
కాంగ్రెస్ పార్టీ ఇల్లందు నియోజకవర్గ అభ్యర్థిగా కోరం కనకయ్యకు టికెట్ ఖరారు కావడంతో ఆపార్టీలో మరింత ఉత్సాహం నెలకుంది. కాంగ్రెస్ కు వివిధ పార్టీల నుండి భారీగా వలసలు ప్రారంభమయ్యాయి. సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ, బీఆర్ఎస్ తదితర పార్టీల నుండి పెద్దఎత్తున చేరికలు, గంపగుత్తగా వలసలు కాంగ్రెస్ లోకి వస్తున్నాయి. మరో వారం రోజుల్లో ఇల్లందు నియోజకవర్గ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయే అవకాశం ఉందని స్థానికంగా చర్చ జరుగుతోంది.
కాంగ్రెస్ విజయం ఏకపక్షమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సుమారు 20 నుంచి 25 వేల మెజార్టీ వస్తుందని అంచనా వేస్తున్నారు. రానున్న రెండు, మూడు రోజుల్లో కామేపల్లి, టేకులపల్లి, గార్ల , బయ్యారం, ఇల్లందు, మండల, పట్టణాల నుంచి పెద్దఎత్తున కాంగ్రెస్ పార్టీలోకి చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఎన్నికల ప్రచారానికి 20 రోజులే సమయం ఉండడంతో బీఆర్ఎస్ నుండి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ వైపు అడుగులేస్తున్నారు.