Switzerland | భారతీయ పర్యాటకురాలికి స్విట్జర్లాండ్ పోలీసులు ఊహించని షాకిచ్చారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించారని రూ.1.5లక్షల చలానా విధించారు. ఆమె టూర్‌కు వెళ్లొచ్చిన ఏడాది తర్వాత ట్రాఫిక్ ఫైన్ గురించి స్విట్జర్లాండ్ పోలీసులు ఈ మెయిల్ పంపించడంతో ఆమె ఒక్కసారిగా షాకయ్యారు. దీంతో ట్విట్టర్ (ఎక్స్) వేదికగా తన గోడు వెల్లబోసుకుంది. ఆ పోస్టు కాస్త ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
పోన్ సప్దీ అనే ట్విట్టర్(ఎక్స్) ఖాతాలో తాజాగా దీనికి సంబంధించిన పోస్టు పెట్టారు. దానిప్రకారం.. గత ఏడాది ఆమె స్విట్జర్లాండ్ పర్యటనకు వెళ్లారు. అయితే విహారయాత్ర ముగిసిన ఏడాది తర్వాత ఆమెకు ఒక మెయిల్ వచ్చింది. టూర్ సమయంలో ఆమె ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడంతో లక్షన్నర జరిమానా విధించినట్లుగా మెయిల్‌లో ఉంది. అది చూసి ఆమె ఒక్కసారిగా షాక్‌కు గురైంది. దీంతో ఆ విషయాన్ని సోషల్‌మీడియాలో పంచుకుంది.
‘ స్విట్జర్లాండ్ టూర్ ముగిసిన చాలా నెలల తర్వాత ఎవరైనా ట్రాఫిక్ ఫైన్ అందుకున్నారా? మాకు దాదాపు లక్షన్నర రూపాయల జరిమానా నోటీసు వచ్చింది. దీన్ని అప్పీల్ చేయవచ్చా? తగ్గించుకోవచ్చా? లేదా మాఫీ అయ్యే అవకాశం ఉందా?‘ అని సోషల్‌మీడియాలో ప్రశ్నించింది. ఇలాంటి అనుభవం ఎదుర్కొన్న వారు తమ సూచనలు ఇవ్వాలని మరో పోస్టులో కోరింది..
ఈ పోస్టు వైరల్‌గా మారి 13 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. దీనిపై స్పందించిన నెటిజన్లు.. స్విట్జర్లాండ్‌లో ట్రాఫిక్ నిబంధనలు చాలా కఠినంగా అమలవుతాయని.. చిన్న పొరపాట్లకే భారీగా ఫైన్లు విధిస్తారని తెలిపారు. ఇలాంటి ఫైన్లను పట్టించుకోకుండా వదిలేస్తే వడ్డీ, అదనపు చార్జీలు పెరిగే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. విదేశాల నుంచి మినహాయింపు అభ్యర్థిస్తే జరిమానా మరింత పెరిగే అవకాశం ఉంటుందని తెలిపారు. షెంజెన్ వీసా బ్లాక్‌లిస్ట్‌లో పడకుండా ఉండాలంటే వీలైనంత త్వరగా జరిమానా చెల్లించాలని సూచిస్తున్నారు. లేదంటే భవిష్యత్తులో మళ్లీ యూరప్ పర్యటనల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని చెప్పారు. అయితే జరిమానా చెల్లించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని.. కానీ ఏడాది ఆలస్యంగా నోటీసులు అందిన కారణంగా లీట్ ఫీపై అభ్యంతరం చెప్పాలని తాము భావిస్తున్నట్లు సదరు మహిళ వెల్లడించింది.
