విధాత: యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి వ్యక్తిగత గార్డెన్ అభివృద్ధి విభాగంలో ప్రథమ బహుమతి ట్రోఫీ దక్కింది. రాష్ట్ర వ్యవసాయ, ఉద్యానవన శాఖల మంత్రి నిరంజన్ రెడ్డి చేతుల మీదుగా ఆదివారం జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మొదటి బహుమతిగా ట్రోఫీ అందుకున్నారు.
శనివారం రాత్రి హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్ లో రాష్ట్ర ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో జరిగిన గార్డెన్ ఫెస్టివల్- 2023 కార్యక్రమంలో ఆమె ఈ ట్రోఫీ అందుకున్నారు.
జిల్లా కలెక్టర్ నివాసంలో పర్యావరణహితంగా, సేంద్రీయ పద్ధతిలో సుందరీకరణతో గార్డెనింగ్, టెర్రస్ గార్డెనింగ్, కిచెన్ గార్డెనింగ్, వివిధ రకాల పూల మొక్కల పెంపకం నిర్వహించడం పట్ల ఆమె ఈ పురస్కారం అందుకున్నారు.
కార్యక్రమంలో రైతుబంధు సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖల కమిషనర్, ఉద్యానవన శాఖ డైరెక్టర్ హనుమంతరావు, జిల్లా ఉద్యానవన అధికారి అన్నపూర్ణ, అధికారులు పాల్గొన్నారు.