Family Planning | ప్లీజ్‌.. ప్లీజ్‌.. పిల్ల‌ల‌ను క‌నండ‌య్యా.. మొత్తుకుంటున్న ప్ర‌పంచ దేశాలు!

పెరిగిపోతున్న పట్టణీకరణ.. ఉమ్మడి కుటుంబాల సంస్కృతి తగ్గిపోవడం.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య అసమానతలు.. కుటుంబ బాధ్యతలు మోసే మహిళలు ఉద్యోగాల్లోకి రావడం వంటి అంశాలు సంతానోత్పత్తి రేటును తగ్గిస్తున్నాయి. టెక్ ఉద్యోగులు, విద్యావంతులైన వారు కెరీర్ పేరుతో పిల్లల్ని కనడంపై ఆసక్తి చూపడం లేదు.

Family Planning | ప్లీజ్‌.. ప్లీజ్‌.. పిల్ల‌ల‌ను క‌నండ‌య్యా.. మొత్తుకుంటున్న ప్ర‌పంచ దేశాలు!

(విధాత ప్ర‌త్యేకం)
ఒకరు ముద్దు.. ఇద్ద‌రు హ‌ద్దు.. అటుపై వ‌ద్దు.. చిన్న కుటుంబం..చింతల్లేని కుటుంబం వంటి నినాదాలు.. కుటుంబ నియంత్రణ పాటిస్తే నగదు ప్రోత్సాహకాలు.. సంక్షేమ పథకాలలో ఎంపిక వంటి బంపర్ ఆఫర్లు తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు నిత్యం వినిపించేవి. ఇప్పుడు సీన్ రివ‌ర్స్ అయింది. అధిక జనాభా దేశ ప్రగతికి గుది బండగా మారుతుంద‌ని, పేదరికం, మౌలిక వసతుల లేమికి అదే కార‌ణ‌మ‌నే భావనలు ఉన్నాయి. ఇప్పుడు దాని స్థానంలో జ‌నాభా ఒక మార్కెట్ స‌రుకుగా మారుతున్న‌ది. ఎంత జ‌నాభా ఉంటే.. అంత మార్కెట్‌. అమ్ముకొనేవాడికి అమ్ముకున్నంత. అందుకే జనాభా పెరుగుదల సమస్యలకు కారణం కాదు.. పైగా ఆర్థిక ప్రగతికి సోపానమన్న వాదన వచ్చి చేరింది. ఒకటి మాత్రం వాస్తవం. ప్రపంచంలో వర్ధమాన దేశాలు వయో వృద్ధుల జనాభా సమస్యతో సతమవుతున్నాయి. ప్రపంచంలో మానవ వనరుల హబ్‌గా ఆర్థికంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో వయో వృద్ధుల జనాభా పెరిగిపోతున్నది. ఈ క్రమంలో ఉత్పాదక సామర్థ్యం క్షీణించి దేశ ప్రగతి కుంటుపడే ప్రమాదం ఉందన్న వాదనలు ఉన్నాయి. సామాజిక, ఆర్థిక కోణంలో యువ జనాభా దేశానికి కీలకం. కానీ ప్రస్తుతం భారత్‌లో 10శాతం ఉన్న వయో వృద్ధుల జనాభా 2050 నాటికి 20శాతానికి చేరుతుందని అంచనా. భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ధ ధనిక దేశంగా మారక ముందే వృద్ధుల సంఖ్య పెరిగిపోతుందన్న ఆందోళన వ్య‌క్త‌మ‌వుతున్న‌ది.

తరిగిపోతున్న జనాభా సమతుల్యత
దేశంలో తరాల మధ్య సమతుల్యతకు సంతానోత్పత్తి రేటు 2.1గా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. 1970 వరకూ భారత్‌లో ఒక్కో మహిళ తన‌ జీవితకాలంలో కనీస ఆరుగురు పిల్లలకు జన్మనిచ్చినట్టు లెక్కలు చెబుతున్నాయి. 2022 నాటికి ఈ బర్త్ రేట్ 2.0కి పడిపోయింది. అంటే.. మహిళలు ఇద్దరు పిల్లలు పుట్టడంతోనే కుటుంబ నియంత్రణ ఆప‌రేష‌న్లు చేయించుకుంటున్నారు. ఐరోపా దేశాల్లో బర్త్‌ రేట్ తగ్గడానికి సుమారు 200 ఏళ్లు పట్టింది. ఇండియాలో 45 సంవత్సరాల్లోనే జరిగిపోయింది. 17 రాష్ట్రాలలో ఈ సగటు జనాభా స్థిరీకరణ స్థాయి కంటే తక్కువగా ఉంది. స్థిరీకరణ స్థాయి అంటే జనాభా సంఖ్యలో భారీ పతనం లేకుండా ఉండేందుకు అవసరమైన జననాల రేటు.

తగ్గిన సంతానోత్పత్తి రేటు
ప్రస్తుతం దక్షిణాదిలోని 5 రాష్ట్రాల సగటు సంతానోత్పత్తి రేటు 1.6 కన్నా తక్కువగా ఉంది. కర్ణాటకలో సంతానోత్పత్తి రేటు 1.6, తమిళనాడులో 1.4గా ఉంది. ఐదో జాతీయ కుటుంబ సర్వేలో బీహార్ 3.0, మేఘాలయ 2.9, యూపీ 2.4, జర్ఖండ్ 2.3, మణిపూర్ 2.2గా ఉంది. మిగతా రాష్ట్రాలన్నింటిలో సంతానోత్పత్తి రేటు తక్కువగా ఉన్నది. దేశంలో 31 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో జనాభా వృద్ధి రేటు పడిపోయింది. వృద్ధుల జనాభా పెరిగిపోతున్న‌ది. ప్రస్తుతం దక్షిణాదితో పోల్చితే ఉత్తరాది రాష్ట్రాల్లో సంతానోత్పత్తి రేటు ఎక్కువ‌గా ఉండ‌టం గమనార్హం. భారత్‌లో కేరళ, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో సంతానోత్పత్తి రేటు సగటు1.8 కాగా ఏపీలో 1.5గా ఉంది. ఇది రాజ‌కీయంగా స‌మ‌స్య‌గా మారుతున్న నేప‌థ్యంలో అధిక సంతానాన్ని క‌నాల‌న్న పిలుపులు ఊపందుకుంటున్నాయి. అక్ష‌రాస్య‌త అధికంగా ఉన్న రాష్ట్రాల్లో సంతానోత్ప‌త్తి త‌క్కువ‌గా ఉంటున్న‌ది. నిర‌క్ష‌రాస్యులు, పేద‌రికం అధికంగా ఉన్న ప్రాంతాల్లో సంతానోత్ప‌త్తి ఎక్కువ‌గా ఉంటున్న‌ది. ఇప్పుడు జ‌నాభా ఆధారంగా లోక్‌స‌భ‌ నియోజ‌క‌వ‌ర్గాల‌ను పున‌ర్విభ‌జించ‌నున్న నేప‌థ్యంలో ఒక‌ప్పుడు కుటుంబ నియంత్ర‌ణ విధానాల‌ను విజ‌య‌వంతంగా అమ‌లు చేసిన రాష్ట్రాలు ఇప్పుడు త‌మ న్యాయ‌మైన వాటాను కోల్పోనున్నాయి. కుటుంబ నియ‌త్ర‌ణ ప‌ట్టించుకోని రాష్ట్రాల్లో ఎక్కువ సీట్లు పెరిగే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఇది రాజ‌కీయ వాటాగా కంటే.. ఆర్థిక వ‌న‌రుల్లో వాటా స‌మ‌స్య‌గా కూడా చూడాల్సి ఉన్న‌ది. ఎందుకంటే నియోజ‌క‌వ‌ర్గాల వారీగా కేటాయింపు జ‌రిపే స‌మ‌యంలో ప్ర‌గ‌తి శీల రాష్ట్రాలు ఆ మేర‌కు వాటాను కోల్పోతున్నాయి. ఈ క్ర‌మంలోనే ఎక్కువ మంది పిల్ల‌ల‌ను క‌నాలంటూ పలు రాష్ట్రాల సీఎంల నుంచి బీజేపీ మాతృసంస్థగా భావించే ఆర్ఎస్ఎస్ వరకు పిలుపునిస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు వంటి వారు ఎక్కువ మంది పిల్లలను కనేందుకు ప్రోత్సాహకంగా ఎంతమంది పిల్లలను కన్నా..వారికి ఒక్కోక్కరికి రూ.15వేల చొప్పున తల్లికి వందనం పథకం ఆర్థిక సహాయం అందిస్తానన్నారు. స్థానిక సంస్థల్లో ఇద్దరు పిల్లల నిబంధన సైతం ఎత్తివేస్తూ చట్ట సవరణ చేశారు. తమిళనాడు సీఎం స్టాలిన్ సైతం పెళ్లిళ్లు చేసుకునే జంటలు తక్షణమే పిల్లలను కనాలని.. 16మందినైనా పోషించే స్థాయికి కుటుంబాలు ఉండాలని పిలుపునిచ్చారు.

దక్షిణాది జనాభాకు కుటుంబ నియంత్రణ దెబ్బ
దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ పక్కగా అమలు చేశాయి. దీంతో జనాభా సమతుల్యత వేగంగా తగ్గింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అర్హతగా ఇద్దరు పిల్లల నిబంధన కూడా అమలు చేశాయి. రాజస్థాన్ , హర్యానా, ఒరిస్సా , మహారాష్ట్ర, గుజరాత్, బీహార్, అస్సాం, ఉత్తరఖండ్ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు దాద్రానగర్ హవేలి, డామన్ డయ్యు , ఉమ్మడి ఏపీలు ఇదే నిబంధనను అమలు చేసి జనాభా నియంత్రణ అమలు చేశాయి. 2003 -05 మధ్య జనన, లింగ నిష్పత్తి 88.100నమోదుకావడంతో ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, హర్యానా, తాజాగా ఏపీ కూడా ఈ చట్టాన్ని ఉపసంహరించుకున్నాయి.

సంతానోత్పత్తి రేటుకు ఉపాధి సమస్య గండి
పెరిగిపోతున్న పట్టణీకరణ.. ఉమ్మడి కుటుంబాల సంస్కృతి తగ్గిపోవడం.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య అసమానతలు.. కుటుంబ బాధ్యతలు మోసే మహిళలు ఉద్యోగాల్లోకి రావడం వంటి అంశాలు సంతానోత్పత్తి రేటును తగ్గిస్తున్నాయి. టెక్ ఉద్యోగులు, విద్యావంతులైన వారు కెరీర్ పేరుతో పిల్లల్ని కనడంపై ఆసక్తి చూపడం లేదు. గతంలో ఉమ్మడి కుటుంబాలుంటే వారిలో ఎవరో ఒకరు పిల్లల పోషణ చూసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి కొరవడటంతో చాలా మంది ఒకరిద్ధరితోనే సరిపెట్టుకుంటున్నారు. దీంతో దేశంలో సంతానోత్పత్తి రేటు తగ్గిపోయి యువ జనాభా క్రమంగా పడిపోతుంది. మరోవైపు పేదరికం కారణంగా ఎక్కువ మంది పిల్లలు ఉంటే వారు సైతం సంపాదిస్తారన్న భావన, కుటుంబ నియంత్రణ పద్ధతులపై అవగాహన కొరవడటం కారణంగా ఉత్తరప్రదేశ్‌, బీహార్‌వంటి రాష్ట్రాల్లో జనాభా పెరుగుతున్నది. ఇదెలా ఉన్నా.. ఒక్కరు లేదా ఇద్దరితో సరిపెడుతున్నవారు ఆపైన కనాలంటే సదరు కుటుంబాల ఆదాయాలు పెరిగేలా సరికొత్త విధానాలు అమలు చేయాల్సిన పరిస్థితి అనివార్యమవుతోంది. ఎక్కువ మంది పిల్ల‌ల‌ను క‌నాల‌ని పిలుపునిస్తున్న పాల‌కులు.. ముందుగా స‌ద‌రు పిల్ల‌ల‌ను క‌నే త‌ల్లిదండ్రుల‌కు ఆర్థిక‌ప‌ర‌మైన‌, ఉపాధి అవ‌కాశాల‌ను మెరుగుప‌ర్చాల్సి ఉన్న‌ది. దేశంలో తీవ్రంగా ఉన్న నిరుద్యోగ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం చూపాల్సి ఉంది. తాయిలాలు ఇచ్చి దులుపుకోవ‌డం కాకుండా.. అభివృద్ధి ఫ‌లాలు సామాన్య ప్ర‌జ‌ల‌కు విధాన‌ప‌ర‌మైన మార్పుల‌కు శ్రీ‌కారం చుట్టాలి. అప్పుడు పిల్లలను కనడం చాలా మందికి భారంగా పరిణమించదు. అవ‌న్నీ చేయ‌కుండా గంపెడు సంతానాన్ని క‌నండి అంటూ ఇచ్చే పిలుపులు.. అంతిమంగా ఆ కుటుంబానికే భారంగా ప‌రిణ‌మిస్తాయి. వీట‌న్నింటినీ దృష్టిలో ఉంచుకుని పాలకులు మేల్కొంటేనే దేశానికి ప్రయోజనకరం.

జనాభా పెంపుకు ప్రపంచ దేశాల పరుగులు
ప్రపంచ దేశాలలో అనేకం ఇప్పుడు జనాభా పెంచుకునే పనిలో పడ్డాయి. ఒక్కర్నే కనండి.. జనాభా తగ్గించండి.. ఒకప్పటి స్లోగన్..! పిల్లల్ని కనండి.. జనాభా పెంచండి.. లేటెస్ట్ స్లోగన్ . చైనా జనసంఖ్య వరుసగా మూడో ఏడాది క్షిణించింది. చైనా నేషనల్ స్టాటిస్టిక్స్ బ్యూరో 2025 నివేదిక ప్రకారం.. 2024లో చైనా జనాభా 1.39 మిలియన్లు తగ్గి దేశ జనాభా మొత్తం 1.408 బిలియన్లకు చేరుకున్నట్లు వెల్లడించింది. దేశంలో యువత తగ్గిపోయి వృద్ధులు ఎక్కువ అయ్యారు. యువత తగ్గిపోతున్న కారణంగా చైనా జీడీపీ కూడా తగ్గుతోంది. ఈ ప్రభావం చైనా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. దేశంలో యువత తగ్గిపోవడంతో శ్రామిక రంగం గణనీయమైన ఒత్తిడికి గురైంది. కుటుంబ నియంత్రణను కఠినంగా అమలు చేసిన చైనా ఇప్పుడు ప్లీజ్.. పెళ్లి చేసుకోండి, పిల్లల్ని కనండని ప్రజలను ప్రోత్సహిస్తున్నది. అయితే.. ఇప్పటి వరకూ ఆ దేశం అనుసరించిన జనాభా విధానం చైనా ఆర్థిక ప్రగతికి దోహదం చేసింది. అదే సమయంలో వృద్ధుల సంఖ్య పెరుగుతన్న నేపథ్యంలో చైనా వంటి దేశాలు అధిక జనాభాను తట్టుకునే స్థితిలో ఉన్నాయి. ఇటలీ, జపాన్ లు కూడా జనాభా క్షిణతను ఎదుర్కోంటున్నాయి. జపాన్ లో 15ఏళ్లుగా జనాభా పడిపోతుంది. ఐరోపా దేశాల్లో జనాభా క్షిణత సమస్య ఎక్కుగా ఉంది. దక్షిణ కొరియా, సింగపూర్, చైనా, జపాన్ వంటి దేశాలు సంతానోత్పత్తి పెంచేందుకు ప్రొత్సాహకాలు, మహిళలకు మాతృత్వ సెలవులు అందిస్తున్నాయి.

జ‌పాన్ సైతం అదే రాగం
ఎకానమీలో అమెరికా తరువాత ఉన్న జపాన్ జనాభా తగ్గి వృద్ధుల సంఖ్య పెరిగి తన స్థానాన్ని 2010 తరువాత చైనాకు వదిలేసుకుంది. ఇక ఇండియా కూడా జనాభా స్థిరీకరణ పాటించకపోతే త్వరలోనే జర్మనీని క్రాస్‌ చేసి జపాన్‌ ప్లేస్‌లోకి వెళ్లబోతోంది. మూడునాలుగేళ్లలో టాప్-3 ఎకానమీగా ఇండియా నిలబడినా…జనాభా సమతుల్యత లేకపోతే తన స్థానాన్ని కోల్పోకతప్పదంటున్నారు నిపుణులు. జననాల రేటు దేశంలో గణనీయంగా పడిపోతున్న నేపథ్యంలో రష్యా నగదు ప్రోత్సాహకాలు ప్రకటించింది. జపాన్ జనాభాలో 2060 కల్లా ప్రతి10 మందిలో లో నలుగురు 65 ఏళ్లవారే ఉంటారనేది ఓ అంచనా. జనాభా తగ్గడం అంటే వర్క్ ఫోర్స్ తగ్గిపోవడం, జీడీపీ పడిపోవడం, ఆర్థికంగా వెనకబడిపోవడమని.. అందుకే పిల్లల్ని కనడాన్ని ప్రోత్సహిస్తోంది టోక్యో నాయకత్వం. పిల్లల్ని కనండి.. డబ్బులిస్తాం అంటోంది జపాన్ ప్రభుత్వం. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా తాజాగా దేశ జనాభా స్థిరీకరణకు పరిమిత సంతానం నినాదానికి దూరంగా ఉండాలన్నారు. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కూడా పాపులేషన్ కంట్రోల్ పై ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లల పెంపకంతో అయ్యే ఖర్చుల గురించి జనాలు ఎక్కువగా ఆందోళన చెందుతున్నారని, అలాంటి ఆలోచనలు మానేసి పిల్లలను కనడంపై దృష్టి పెట్టాలని సూచించారు.

అర‌వై ఏళ్ల‌లో 1030 కోట్ల‌కు జ‌నాభా?
ఐక్యరాజ్యసమితి అధ్యయనాల్లో ప్రపంచ జనాభా 820కోట్ల నుంచి 60 ఏళ్లలో 1030 కోట్లకు చేరి.. ఆ తర్వాత గణనీయంగా తగ్గుతందని అంచనా. చైనా, భారత్ కూడా దీనికి మినహాయింపు కాదు. ఒక మహిళ సంతాన సాఫల్య రేటు (టీఎఫ్ఆర్.. ఎంతమందికి జన్మినివ్వగలదు) చూస్తే ప్రపంచ సగటు 1963లో 5.3గా ఉండగా.. ప్రస్తుతం 2.5గా ఉంది. జనాభా స్థిరంగా కొనసాగాలంటే కనిష్ఠంగా 2.1గా ఉండాలంటున్నారు. అనేక దేశాల్లో సంతాన సాఫల్య రేటు తగ్గిపోవడం ఆందోళనకరం. భారత్ లో సగటు 2.1గా ఉంది. ఇది ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా ఉండటం గమనార్హం. దక్షిణాది రాష్ట్రాల్లో కుటుంబ నియంత్రణ, అక్షరాస్యత, మహిళా చైతన్యం నేపథ్యంలో సంతానోత్పత్తి రేటు తక్కువగా ఉంది. వెనుకబడిన రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంది. దేశంలో ఇప్పటికి ఏటా 1.20కోట్ల జనాభా పెరుగుతుంది. జననాల రేటు 1.8గా ఉంటే జనాభా తగ్గుదల మెల్లగా జరుగుతుంది. దానిని నియంత్రించే అవకాశం ఉంటుంది. అదే ఆ రేటు 1.6 కన్నా తగ్గితే జనాభా వేగంగా పడిపోతుంది. ఆ పరిస్థితిని నియంత్రించడం కష్టమవుతుంది. అందుకే జనాభా పెంపు ప్రణాళికలపై ఫోకస్ పెట్టాలంటున్నారు నిపుణులు. జనాభా స్థిరీకరణకు పదేళ్లకు సంబంంచి ప్రతి దేశం ఓక జనాభా ప్రణాళిక అమలు చేయాలంటున్నారు. సమతుల్య జనాభా విధానం రూపొందించాలని సూచిస్తున్నారు.