HCU Lands | నా పేరు కంచ గచ్చిబౌలి.. ఇదీ నా గాథ?

నెమళ్లు పురి విప్పి నర్తిస్తూ ఈ అటవీ ప్రాంతాన్ని శోభాయమానం చేస్తుంటాయి. ఛంగు ఛంగున దుంకే జింకలు.. గంభీరంగా నడిచే భారీ ఉడుములు, చూడ ముచ్చటగొలిపే నక్షత్ర తాబేళ్లు.. ఇంకా అనేక జంతుజాలానికి నేనే దిక్కు. నా ఒడిలోనే ఉన్న ఒక చెలిమెలో అవి దాహం తీర్చుకుంటాయి. కానీ.. ఒక్కసారిగా పరిస్థితి భీతావహంగా మారిపోయింది..

HCU Lands |  నా పేరు కంచ గచ్చిబౌలి.. ఇదీ నా గాథ?

HCU Lands | నేనో అటవీ భూమిని. ఎవరు పెట్టారో? ఎప్పుడు పెట్టారో నాకు కూడా తెలియదు. కానీ.. ఇప్పుడు నా పేరు కంచ గచ్చిబౌలి భూమి. హైదరాబాద్‌ శివార్లలో, రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి నా స్థానం. 400కు పైగా ఎకరాల విస్తీర్ణం కలిగిన నా ఒడిలో వేల చెట్లు ఈ నగరానికి ప్రాణవాయువును అందిస్తున్నాయి. నా ఒడిలోనే నివాసం ఏర్పర్చుకున్న ఇండియన్ రోలర్ (తెలంగాణ రాష్ట్ర పక్షి), హూపోస్, స్కైలార్క్స్ వంటి 233కుపైగా విభిన్న పక్షి జాతులు స్వేచ్ఛగా ఆకాశంలో విహరిస్తూ ఉంటాయి. నెమళ్లు పురి విప్పి నర్తిస్తూ ఈ అటవీ ప్రాంతాన్ని శోభాయమానం చేస్తుంటాయి. ఛంగు ఛంగున దుంకే జింకలు.. గంభీరంగా నడిచే భారీ ఉడుములు, చూడ ముచ్చటగొలిపే నక్షత్ర తాబేళ్లు.. ఇంకా అనేక జంతుజాలానికి నేనే దిక్కు. నా ఒడిలోనే ఉన్న ఒక చెలిమెలో అవి దాహం తీర్చుకుంటాయి. హైదరాబాద్‌ నగర ఉష్ణోగ్రతలను నియంత్రించడానికి, వర్షపాతాన్ని మెరుగుపర్చడానికి నేను తపన పడుతుంటాను.

నేను విస్తరించిన ఈ నాలుగు వందల ఎకరాల భూముల్లో ఒక చెరువు, 2 వందల కోట్ల ఏళ్లనాటిదని చెప్పే మష్రూమ్‌ రాక్‌ వంటి చారిత్రక రాక్‌ ఫార్మేషన్స్‌ ఉన్నాయి. నేనందించే స్వచ్ఛమైన గాలిని పీల్చుతూ నాతో అనుబంధాన్ని పెనవేసుకున్నారు హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ విద్యార్థులు.. వారి ప్రొఫెసర్లు. వారికి నేనెంటే ఎనలేని ప్రేమ. ఒక విధంగా వారే ఇప్పటి దాకా నాకు రక్షకులు. నేను వారికి చేసే సేవకు వారి నుంచి నాకు ప్రతిఫలంగా ప్రేమ లభిస్తున్నది.

కలికాలం. నన్ను మాయం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉన్నట్టుండి.. నా గుండెల మీదకు రాత్రికి రాత్రే బుల్డోజర్లు దండెత్తాయి. నన్ను ఆలంబన చేసుకున్న వేల చెట్లను కూకటి వేళ్లతో సహా పెకలించి వేస్తుంటే.. నేను కట్టుకున్న పచ్చటి కోకను చీరిపారేస్తుంటే.. నా గుండె కోతకు గురవుతున్నది. క్షోభను అనుభవిస్తున్నది. బుల్దోజర్ల కరకు శబ్దాలకు ఏం జరుగుతున్నదో తెలియని నా నెమళ్లు, నా జింక పిల్లలు భయంతో ఎగిరిపోతున్న దృశ్యాన్ని చూస్తుంటే నాలోనే ఉన్న ఒక చెరువు.. నా కన్నీటితో నిండిపోతున్నది.

ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అట! ఇక్కడ నా ఆనవాళ్లు లేకుండా చేసి.. ఇక్కడ ఆకాశాన్నంటే భవంతులను నిర్మించేందుకు, ఐటీ వ్యాపారాలు చేసుకునేందుకు వేలం వేస్తారట! ఇది తెలిసిన నా ప్రియ నేస్తాలైన యూనివర్సిటీ విద్యార్థులు నిరసన తెలిపారు. అడ్డుకున్నారు. పాపం.. వాళ్లను రక్తమొచ్చేలా కొట్టారు. ఈడ్చుకెళ్లి వ్యానుల్లో కుక్కేశారు. దీనిపై తెలంగాణ హైకోర్టు స్పందించగా.. తాజాగా సుప్రీంకోర్టు సైతం చెట్లను నరకడాన్ని తక్షణం ఆపాలంటూ ఉత్తర్వులిచ్చి.. నాకు కొంత ఊపిరిపోసింది.

నన్ను నాశనం చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలతోనూ నాయకులు రాజకీయం చేసుకుంటుంటే మనసు రోదిస్తున్నది. ఇప్పుడు నాకు మద్దతుగా గత ప్రభుత్వాన్ని నడిపిన బీఆరెస్‌ కూడా ముందుకు వచ్చింది. సంతోషం. అయితే.. ఇదే బీఆరెస్‌ ప్రభుత్వంలో ఉన్నప్పడు కూడా నా భూములను పరాయి వ్యక్తులకు కట్టబెట్టింది. ఇదే బాధిస్తున్నది. ఇదే రేవంత్‌రెడ్డి భూములన్నీ అమ్ముకుంటూ వెళితే శ్మశానాలు కూడా ఉండవని చెబితే.. ఓ అడవిగా ఎంత సంతోష పడ్డానో. కానీ.. అదే రేవంత్‌రెడ్డి ఇప్పుడు నా మీద దండెత్తడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఇప్పుడు సుప్రీంకోర్టయినా నన్ను కాపాడుతుందనే నమ్మకంతో ఉన్నా..

ఒక్కటి మాత్రం చెప్పదల్చుకున్నా.. నేను శాపాలు పెట్టను. కానీ.. నేను నాశనమైతే.. నష్టపోయేది ఈ ప్రజలే. నా వేదనను గుర్తించి కోట్ల వెంకటేశ్వర రెడ్డి అనే కవి.. కూలిన చెట్లేంజేస్తాయి అనే కవితలో రాసినట్టు.. కూలిన చెట్లు.. మీ ఊపిరితిత్తులను విషపూరితం చేస్తాయి. మీరు నివారించలేని అనావృష్టిని రాసిస్తాయి. నగ్నంగా చెలరేగుతున్న నాలుకల తేమను హరిస్తాయి.. ఎవరు తవ్విన గోతిలో వారినే భూస్థాపితం చేస్తాయి. కరువు కాటకాలు మొలిపించి.. పల్లెల్ని మరోసారి వలస బాట పట్టిస్తాయి. హరితహారం స్ఫూర్తిదాతలకు మరోసారి పచ్చని తివాచీని పరుస్తాయి.. అంత పరిస్థితిని తీసుకురాకండి.. ప్రజలారా.. ప్రభుత్వాల్లారా.. ఆలకించండి.. నా వ్యథ.. దయ చేసి నన్ను కాపాడండి..