Fight with Brothers | కల్వకుంట్ల కవిత.. మరో వైఎస్ షర్మిల అవుతారా?
కుటుంబ పార్టీల్లో ఆప్యాయంగా పలకరించుకున్న అప్తులే శత్రులవుతారు! వారి మధ్య ఆమడదూరం పెరుగుతుంది! కుటుంబ పార్టీపై పెత్తనంలో భాగస్వామ్యం కోరుకోవడంతో మొదలయ్యే ఈ ఆధిపత్యపోరు.. ఆఖరుకు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకునే స్థితికి చేరుకుంటుందనేందుకు దేశంలోని అనేక ప్రాంతీయ పార్టీల్లో ఉదాహరణలు ఉన్నాయి. పొరుగున తోటి తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో ఇది చూసిందే! ఇప్పుడు తెలంగాణ వంతు వస్తుందా? కల్వకుంట్ల కుటుంబ సభ్యురాలిగా.. బీఆరెస్ ముగ్గురు ముఖ్యనేతల్లో ఒకరిగా ఉన్న కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత షర్మిల అడుగుజాడల్లో నడుస్తారా? ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇదొక ఆసక్తికర అంశంగా రాజకీయ చర్చల్లో చోటుచేసుకుంటున్నది.

- ఇక్కడా, అక్కడా అన్నలతోనే పోరు
- అక్కడ అధికారం, ఆస్తి తగాదాలు
- ఇక్కడ అధికారం, అస్తిత్వ పోరాటం
- జాగృతిని జాగృతం చేస్తున్న కవిత
- ఎన్నడూ లేని అనుబంధ సంఘాలు
- కొత్తగా నియమించిన కేసీఆర్ తనయ
- అన్న కేటీఆర్‌కు సవాలు విసిరారా?
- తండ్రి కేసీఆర్‌ను సైతం కాదన్నారా?
- కొత్త రాజకీయ పార్టీకి సిద్ధమైన కవిత!
- వద్దని వారించిన ఆమె సన్నిహితులు
- దాంతో బలగాన్ని సమీకరిస్తున్న నేత
- ఆ క్రమంలోనే కమిటీలు, కన్వీనర్లు
- అచ్చం రాజకీయ పార్టీ తరహాలోనే!
- రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలు
హైదరాబాద్, మే 18 (విధాత) :
Fight with Brothers | ఆంధ్రప్రదేశ్‌లో తన సోదరుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో ఆయన అధికారంలోనే ఉన్న సమయంలో విభేదించిన షర్మిల.. సొంత పార్టీ పెట్టుకున్నారు. ఆస్తి తగాదాలతోపాటు.. అధికారంలో భాగస్వామ్యం కోసం చేసిన ప్రయత్నాలు విఫలమవడంతో అన్నతో వేరుపడ్డారు. తర్వాతి కాలంలో తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనంచేసి.. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బిడ్డగా ఆ పార్టీకి రాష్ట్ర చీఫ్‌గా ఎదిగారు. గత ఎన్నికల్లో అటు తన అన్నకు చెందిన వైసీపీతోపాటు.. నాటి ప్రతిపక్షం టీడీపీపై పోరాటం చేశారు. ఇప్పటికి ఇంత జరుగకున్నా.. తెలంగాణలో కేసీఆర్ కుమార్తె అడుగులు.. ఆమె షర్మిల బాటలోనే పయనిస్తారా? అనే సందేహాలకు తావిస్తున్నాయి. ఇక్కడా అధికారంలో భాగస్వామ్యం ఒక ఎత్తయితే.. అస్తిత్వం అనేది మరో అంశంగా ఉన్నది. బీఆరెస్ పార్టీకి తెలంగాణ జాగృతి కూడా ఒక అనుబంధ సంస్థ. కానీ.. ఒక పార్టీకి ఉండేలా తెలంగాణ జాగృతికి కూడా కమిటీలను, కన్వీనర్లను ప్రకటించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపింది. పార్టీలో తనను దూరం పెడుతున్నారన్న వార్తల నేపథ్యంలో అధికారం, అస్తిత్వం కోసం కవిత తన సోదరుడు కేటీఆర్‌తో విభేదించారా? తండ్రి కేసీఆర్‌ను కాదని సమరానికి సై? అన్నారా? అనే చర్చలు సాగుతున్నాయి. ఒక సంస్థగా జాగృతిని బలోపేతం చేయడం వేరు.. దానికి కొన్ని శాఖలను పెట్టుకుని విస్తరించే ప్రయత్నం చేయడం వేరని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
తీహార్ జైలు నుంచి వచ్చాక కొంత మౌనం!
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో రిమాండ్ ఖైదీగా తీహార్ జైలులో ఐదు నెలల పాటు కవిత ఉన్నారు. గతేడాది ఆగస్టులో సుప్రీంకోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేయడంతో హైదరాబాద్ చేరుకున్న ఆమె.. కొద్ది నెలలు మౌనం దాల్చారు. బంజారాహిల్స్‌లోని తన ఇంటితో పాటు ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌లో విశ్రాంతి తీసుకున్నారు. ఐదు నెలలపాటు జైల్లో ఉన్నందుకేమో.. ఆరోగ్యం దెబ్బతినడంతో మరింత ఆందోళనకు గురయ్యారని, రాజకీయంగా తన పరిస్థితిపై ఆలోచనలు చేస్తూ తీవ్ర మథనానికి గురయ్యారని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. తనకు సన్నిహితంగా ఉన్న కొందరితో చర్చలు కూడా జరిపిన తరువాత ప్రజాక్షేత్రంలోనే ఉండాలని నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. గతేడాది డిసెంబర్ నెలలో నిజామాబాద్ జిల్లాలో పర్యటనలతో కవిత యాక్టివేట్ అయ్యారు. రాజకీయ యాత్రకు శ్రీకారం చుట్టారు. దారి పొడవునా తెలంగాణ తల్లి విగ్రహాల వద్ద నివాళులర్పిస్తూ.. కార్యకర్తలతో మాట్లాడుతూ మళ్లీ లైమ్‌లైట్‌లోకి వచ్చారు. పనిలోపనిగా డిసెంబర్ 4వ తేదీ నుంచి జిల్లాలవారీగా జాగృతి సమీక్షా సమావేశాలను నిర్వహిస్తున్నారు. రాజకీయ కార్యక్రమాలతో పాటు ఆత్మీయ సమ్మేళనాలు, ముఖ్య కార్యకర్తల కుటుంబాలకు పరామర్శలు చేస్తున్నారు. ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి స్థాయిలో ఎక్కడా తగ్గకుండా మీడియా సమావేశాలు నిర్వహించి, రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై విమర్శలు గుప్పించారు. కేసీఆర్ పాలన ఎలా ఉండేదని ప్రజలను అడిగి తెలుసుకునేవారు. అయితే ఈమె చేస్తున్న పర్యటనలు పార్టీకి మేలు చేస్తున్నాయో కీడు చేస్తున్నాయో అర్థం కాక సీనియర్లు తలలు పట్టుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఒక వాదంతో రేవంత్ రెడ్డి సర్కారును ఇరుకున పెడుతుంటే కవిత మరో వాదనతో మీడియా ముందుకు వస్తుండటం మంచిది కాదనే వాదన రాజకీయవర్గాల్లో మొదలైంది. పార్టీ ప్రయోజనం కోసమే సగానికి పైగా అసెంబ్లీ నియోజకవర్గాలలో పర్యటించానని, మరో ఉద్దేశం లేదని ఆమె చెప్పుకుంటున్నా వేరే కారణాలే ఉన్నాయనే అభిప్రాయాలే వ్యక్తమయ్యాయి. తనపై అసత్య, కల్పిత ప్రచారాలు జరుగుతున్నా పార్టీ నుంచి సరైన స్పందన లేదని ఆమె తన సన్నిహితుల వద్ద వాపోయినట్టు సమాచారం.
దూకుడుతో దూరం పెట్టిన నాయకత్వం
ఇదిలా ఉండగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కుమార్ చేతిలో 2019లో ఓటమి పాలైన తర్వాత కవిత రెండేళ్లపాటు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఈ పరిణామంతో తండ్రి కేసీఆర్, అన్న కేటీఆర్ ఆమెను పార్టీ కార్యక్రమాలకు దూరం పెట్టారు. నిజామాబాద్ జిల్లాలో క్వీన్ అనే స్థాయిలో తన అధికార దర్పాన్ని ప్రదర్శించిన విషయం తెలిసిందే. చాలా సందర్భాల్లో జిల్లా అధికారులు అప్పటి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆర్ అండ్ బీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని కాదని ప్రొటోకాల్ ఇచ్చి రాచమర్యాదలు కల్పించేవారన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఈమె దూకుడుతనంతో ఇద్దరూ నొచ్చుకుని, పార్టీ అధినేతకు మొరపెట్టుకున్నారని సమాచారం. జిల్లాలోని ముఖ్య నాయకుల ఫీడ్ బ్యాక్ ఆధారంగా కవితను బీఆరెస్ కార్యక్రమాలకు దూరం పెట్టారన్న చర్చ జరిగింది. ఏమైందో ఏమో కానీ ఆమెను పెద్దల సభకు పంపించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఎంపీగా ఓటమి పాలైన రెండేళ్ల తరువాత ఎమ్మెల్సీగా కవిత మళ్లీ క్రియాశీలకంగా మారారు. ఇక అప్పటి నుంచి గతేడాది ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో తీహార్ జైలుకు వెళ్లే వరకు అదే దూకుడుతో పనిచేశారు. జైలు నుంచి వచ్చిన తరువాత తండ్రి కేసీఆర్ ఆమెను సముదాయించి, ఓదార్చినప్పటికీ రాజకీయంగా అంతగా ప్రాధాన్యం, ప్రాముఖ్యం ఇవ్వడం లేదన్న వాదనలు ఉన్నాయి. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కుమారుడు కేటీఆర్, ఇతర ముఖ్య నాయకులతో చర్చిస్తున్నారని అప్పట్లోనే వార్తలు వచ్చాయి. తండ్రితో పాటు అన్న కూడా తన పట్ల వివక్ష చూపుతున్నట్టు గ్రహించిన ఆమె సొంత అజెండాతో ప్రజల్లోకి వెళ్లాలనే నిర్ణయం తీసుకున్నట్లు ఆమె సన్నిహితులు చెబుతున్నారు. అయితే ఇటీవల వరంగల్ జిల్లాలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కవిత ఫోటోలు కన్పించకుండా చేశారనే విమర్శలు ఉన్నాయి. సభా వేదిక ఖరారులో తన ప్రమేయం లేకపోవడం వంటి ఘటనలతో ఆమె మరింతగా ఆవేదన చెందారని తెలుస్తున్నది. ఇవి చదువుతుంటే.. సహజంగానే ఏపీలో షర్మిల, జగన్మోహన్రెడ్డి మధ్య పంతాలు పట్టింపులు, ఆస్తి, అధికార తగాదాలు గుర్తురాకమానవు. సోదరుడు జగన్‌తో విభేదించిన షర్మిల.. ‘కొత్త రాజకీయ జీవితం’ కోసం తెలంగాణ వచ్చారు. అధికారం, ఆస్తి కోసం సోదరుడితో అంతర్గతంగా పలుసార్లు పంచాయతీ పెట్టినా.. ఆయన ఖాతరు చేయకపోవడంతో తన తండ్రి పేరిట తెలంగాణలో పార్టీ పెట్టారు. కొద్ది నెలల పాటు తెలంగాణలో కాలికి బలపం కట్టుకుని తిరిగినా ఆశించిన స్థాయిలో స్పందన లేకపోవడం, పరాయి రాష్ట్రం నాయకురాలిగా గుర్తింపు పొందడం, ముఖ్య నాయకులు నమ్మకపోవడంతో ఆమె తిరిగి ఏపీకి వెళ్లక తప్పలేదు. తెలంగాణలో రేవంత్ రెడ్డి బలం పుంజుకోవడంతో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకుని, ఏపీకి పీసీసీ అధ్యక్షురాలు అయ్యారు. కాగా కల్వకుంట్ల కవిత పరిస్థితి ఒకే విధంగా ఉన్నప్పటికీ లక్ష్యాలు వేర్వేరు కావడం గమనించాల్సిన అంశం. తెలంగాణ ఉద్యమం నుంచి పోరాడుతున్న తనకు రాను రాను ప్రాధాన్యం, ప్రాముఖ్యం తగ్గిస్తున్నారనేది ఆమె వాదనగా చెబుతున్నారు. ఇన్నేళ్లు పోరాడిన తనకు అస్తిత్వంతో పాటు అధికారమే ముఖ్యమని ఆమె కొన్ని నెలలుగా చేస్తున్న పర్యటనలు చెప్పకనే చెబుతున్నాయి. అమెరికాలో కుమారుడి డిగ్రీ పట్టా కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లే ముందు తెలంగాణ జాగృతి అనుబంధ సంఘాలకు కన్వీనర్లను నియమించారు. సాధారణంగా రాజకీయ పార్టీల్లో అనుబంధ సంఘాలు, కార్యవర్గం ఉంటుంది. జాగృతి అనేది రాజకీయ పార్టీ కాదు కదా ఒక సాంస్కృతిక సంస్థ మాత్రమే. అలాంటి సాంస్కృతిక సంస్థలకు సైతం విభాగాల వారీగా కన్వీనర్లను నియమించడం ఆసక్తి రేపింది. తండ్రి, సోదరుడితో తాడోపేడో తేల్చుకునేందుకే సిద్ధమయ్యి వ్యూహాత్మకంగానే ఆమె అడుగులు వేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
వాట్ నెక్స్ట్?
అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన తరువాత కవిత జాగృతిని రాజకీయ పార్టీగా మారుస్తారా? లేక ఆ సంస్థను గ్రామ స్థాయినుంచి మరింత బలోపేతం చేస్తారా? అనేది పలువురు ఎదురు చూస్తున్నారు. నిజానికి తనను పార్టీలో దూరం పెడుతున్న విషయాన్ని గమనించిన కవిత.. సొంతగానే పార్టీ పెట్టేందుకు సిద్ధమయ్యారనే ప్రచారం ఉంది. ఈ క్రమంలోనే తన విషయంలో జరుగుతున్న అన్యాయం, నిర్లక్ష్యంపై తన తండ్రి కేసీఆర్ కు లేఖ రాశారని అంటున్నారు. ఆ లేఖలో తన సోదరుడి వ్యవహారంపై పలు ప్రశ్నలు సంధించారంటున్నారు. పార్టీ స్థాపన నుంచి ఈ రోజు వరకు తాను చేసిన కృషి, కేటాయించిన సమయం, విస్తరణలో తన పాత్ర, 2014 తో పాటు 2018 ఎన్నికల్లో అభ్యర్థుల విజయం కోసం శక్తియుక్తుల ధారపోత వంటి అంశాలను ప్రస్తావించి, ఈ మధ్య తనను దూరం పెట్టడానికి గల కారణాలు ఏంటని ఆ లేఖలో లేవనెత్తారని తెలిసింది. మహిళలను పార్టీవైపు తిప్పుకోవడంలో పనిచేసినా తగిన గుర్తింపునివ్వడం లేదనే ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని ఆమె ప్రజా క్షేత్రంలోనే తన భవిత, బతుకు తేల్చుకోవాలనే ధృడ సంకల్పంతో ఉన్నట్లు చర్యలను బట్టి అవగతమవుతోంది. అయితే.. ఆమె క్షేమాన్ని ఆశించే కొందరు సన్నిహితులు మళ్లీ బీఆరెస్ అధికారంలోకి వచ్చేందుకు అవకాశాలు ఇప్పుడిప్పుడే మెరుగుపడుతున్న సమయంలో తొందరపాటు చర్యలు వద్దని వారించారని అత్యంత విశ్వసనీయవర్గాలు తెలిపాయి. వారి అభిప్రాయాలను అంగీకరించారని సమాచారం. అందుకే పార్టీ కాకుండా.. పార్టీ తరహాలో తన యంత్రాంగాన్ని, అనుచర గణాన్ని ఒక చోటుకు చేర్చుకునే పనిలో ఉన్నారని, కమిటీలు, కన్వీనర్ల ప్రకటన అందులో భాగమేనని చెబుతున్నారు. ఏది ఏమైనా.. తన చర్యల ద్వారా కవిత కూడా షర్మిలలా మారుతారా? భవిష్యత్తులోనైనా పార్టీ పెడతారా? దానిని తానే నిర్వహిస్తారా? లేక వేరే ఏదైనా పార్టీలో విలీనం చేస్తారా? అనేవి ఇప్పుడప్పుడే తేలే అంశాలు మాత్రం కాదని రాజకీయ వర్గాలు ముక్తాయింపునిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి..
కేసీఆర్ అంతఃపురంలో అలజడి!.. హరీశ్‌రావు, కవితలకు సీఎం రేవంత్ రెడ్డి ఎర!
కవిత దూకుడు! జాగృతి విభాగాలకు కన్వీనర్లు
అదృశ్య శక్తుల బిగి కౌగిలిలో సీఎం రేవంత్ రెడ్డి?