Mehdipatnam–Vikarabad Route traffic | సీఎం, స్పీకర్ రోడ్డుకే దిక్కులేదు! రంగారెడ్డి జిల్లా లీడర్లకు సోయి ఇంకెప్పుడు వస్తుంది?
నేటి సీఎం ఒకప్పుడు తిరిగిన మార్గం అది.. నేటి అసెంబ్లీ స్పీకర్ నిత్యం తన నియోజకవర్గానికి వెళ్లేది ఇదే దారిలో! అదే నానల్ నగర్ నుంచి వికారబాద్ మార్గం. ఇక్కడ ట్రాఫిక్ నిత్య నరకం. కానీ.. ఈ రోడ్డు అభివృద్ధికి రంగారెడ్డి జిల్లా ప్రజా ప్రతినిధులు చేసిందేమీ లేదని రంగారెడ్డి జిల్లావాసులు మండిపడుతున్నారు.
- జిల్లాలో భూముల విక్రయంతో వేల కోట్లు
- అభివృద్ధిలో మాత్రం అంతులేని వివక్ష
- వికారాబాద్ రోడ్డు పరిస్థితి కడు దయనీయం
- నానల్ నగర్ దగ్గర నిత్యం నరకం
హైదరాబాద్, విధాత ప్రతినిధి:
Mehdipatnam–Vikarabad Route traffic | మెహిదీపట్నం నుంచి.. నానల్ నగర్ మీదుగా.. వికారాబాద్ వైపు వెళ్లేవారికి ఆ మార్గంలో నిత్యం కనిపించే రద్దీ మామూలే! ట్రాఫిక్‌ను తిట్టుకుంటూ సందు దొరికితే కారునో, బస్సునో, ఆటోనో ‘నడిపించుకుంటూ’ సాగే ప్రయాణం నరకమే. ఈ మార్గం మామూలు వ్యక్తులది కూడా కాదు! ఏకంగా నేటి ముఖ్యమంత్రి ఒకప్పుడు తిరిగినది. అసెంబ్లీ స్పీకర్ తన నియోజకవర్గానికి వెళ్లేందుకు వినియోగిస్తున్నది. కానీ.. ఈ రోడ్డు ఎంత దారుణంగా తయారైందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. నిజానికి రంగారెడ్డి జిల్లాలో వందలాది ఎకరాలను విక్రయించి వేలాది కోట్లు రాష్ట్ర ప్రభుత్వం పోగేసుకుంటున్నది. కోకాపేట ప్రాంతంలో ఎకరా భూమిని రూ.100 కోట్లకు విక్రయించిన దాఖలాలు చూశాం. ఇలా సమకూరిన డబ్బుల్లో ఐదు శాతం నిధులు రంగారెడ్డి జిల్లాలో ఖర్చు చేసినా ఎంతో అభివృద్ధి సాధించేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కానీ ఆ దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రిపై ఒత్తిడి చేయించి పనులు చేయించుకోవడంలో రంగారెడ్డి జిల్లా ప్రజా ప్రతినిధులు పూర్తిగా విఫలమయ్యారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. జిల్లా ప్రజా ప్రతినిధులకు ‘ఇది మా ప్రాంతం, పుట్టి పెరిగిన జిల్లా’ అనే సోయి లేకుండా పోయిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత రెండు దశాబ్దాలుగా ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రతినిధులు తమ స్వంత ఆస్తులు పెంచుకుంటూ పై పైకి ఎదుగుతున్నారే తప్ప ప్రజలకు వీసమెత్తు కూడా పని చేయడం లేదని స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. రంగారెడ్డి బస్సులు నగరంలోని మెహిదీపట్నం నుంచి టీజీ పోలీసు అకాడమీ చేరుకునే వరకు విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది. నగరంలో ప్రవేశించడానికి కూడా వాహనదారులు నరకయాతన అనుభవిస్తున్నారు.
ఎప్పుడో తాతల కాలం నాటి రోడ్డు..
హైదరాబాద్ నుంచి వికారాబాద్ చేరుకోవాలన్నా, వికారాబాద్ నుంచి హైదరాబాద్ రావాలన్నా ఈ బీజాపూర్ జాతీయ రహదారి తప్ప మరో మార్గం లేదు. హైదరాబాద్ నగరం నుంచి వికారాబాద్ వరకు పొడవు సుమారు 79 కిలోమీటర్లు. ఎప్పుడో తాతల కాలం నాడు వేసిన సింగిల్ రోడ్డునే డబుల్ రోడ్డుగా విస్తరించారు. ఈ మార్గంలో అనేక మూల మలుపులు, మధ్య మధ్యలో గ్రామాలు ఉన్నాయి. ఈ రోడ్డు పై వాహనం నడపాలన్నా, ప్రయాణం చేయాలన్నా పలువురు జంకుతారు. ప్రతినిత్యం వాహనం నడిపే వ్యక్తులు రాకపోకలు గమనిస్తూ ఉండాలి. అందుకే ఈ రోడ్డుపై వెళ్లేందుకు పెద్దగా ఆసక్తి చూపించరు. 2017 సంవత్సరంలో అప్పటి బీఆర్ఎస్ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి టీజీ పోలీసు అకాడమీ నుంచి బీజాపూర్ వరకు నాలుగు వరుసల జాతీయ రహదారిని మంజూరు చేయించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే ఎనిమిది సంవత్సరాలు అయినా పని మొదలు కాలేదు. భూ సేకరణలో బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించిందనే విమర్శలు ఉన్నాయి. ప్రజా ప్రతినిధులు కొందరు తమ భూములను కాపాడుకునేందుకు రోడ్డు అలైన్‌మెంట్‌ను వంకరటింకరగా మార్చారని ప్రస్తుత ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి విమర్శిస్తున్నారు. చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో వేసిన కేసులో మూడు రోజుల క్రితం పరిష్కారం లభించడంతో రోడ్డు విస్తరణకు అడ్డంకులు తొలగిపోయాయి. రెండు రోజుల క్రితమే విస్తరణ పనులు కూడా ప్రారంభమయ్యాయి.
రోడ్డు విస్తరణలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాలే
టీజీ పోలీసు అకాడమీ నుంచి బీజాపూర్ వరకు విస్తరించే రోడ్డులో చేవెళ్ల, పరిగి, తాండూరు, వికారాబాద్, కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ నాలుగు నియోజకవర్గాలలో కాంగ్రెస్ నాయకులే ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వికారాబాద్ నుంచి ఎన్నికైన గడ్డం ప్రసాద్ కుమార్ ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో అత్యున్నతమైన పదవిని నిర్వహిస్తున్నా.. జిల్లా అభివృద్ధి విషయంలో ఏమాత్రం చొరవ చూపించడం లేదనే విమర్శలు ఉన్నాయి. తనకున్న అధికారాలతో సంబంధిత శాఖల మంత్రులు, ముఖ్య కార్యదర్శులను పిలిపించి సమావేశాలు నిర్వహించే అధికారాలు ఉన్నాయి. అయినా ఏనాడూ ఆయన రోడ్ల అభివృద్ధి, విస్తరణపై సమీక్షించిన దాఖలాలు లేవంటున్నారు. ప్రస్తుతం గడ్డం ప్రసాద్ కుమార్ బంజారాహిల్స్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో ఉంటున్నారు. తన నియోజకవర్గం వెళ్లడానికి, తిరిగి హైదరాబాద్ రావడానికి ఇదే రోడ్డును ఉపయోగిస్తుంటారు. ఇంత దయనీంగా, గుంతలు పడిన రోడ్డులో ఎలా ప్రయాణిస్తున్నారనే దిశగా ఎప్పుడైనా స్పీకర్ ఆలోచించారా? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. రెండేళ్ల పదవీకాలంలో రోడ్డు విస్తరణకు అడ్డంకిగా ఉన్న సమస్యలు పట్టించుకోలేదని జిల్లావాసులు ఆరోపిస్తున్నారు. జిల్లాలోని విలువైన భూములను విక్రయిస్తున్నారు, ఆ సొమ్ములో తమ ప్రాంత అభివృద్ధికి కొంత కేటాయించాలని ఆదేశించే అధికారం ఉన్నప్పటికీ, ఆ పలుకుబడిని కూడా వినియోగించుకోవడం లేదని ప్రజల్లో చర్చ జరుగుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నియోజకవర్గం కొడంగల్ వెళ్ళేందుకు ఇదే రోడ్డు తప్ప ప్రత్యామ్నాయం లేదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాక ముందు ఈ రోడ్డు పై ప్రయాణం చేసేవారని కాంగ్రెస్ కార్యకర్తలు చెబుతున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తరువాత హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్న విషయం తెలిసిందే. ఆయన సోదరులు మాత్రం ఇదే మార్గంలో రాకపోకలు సాగిస్తున్నారని అంటున్నారు. వాళ్లు కూడా విస్తరణ పనుల విషయంలో రెండేళ్ల పాటు నిర్లక్ష్యం వహించారని జిల్లా వాసులు బహిరంగంగా ఆక్షేపిస్తున్నారు. ముఖ్యమంత్రి ఏమాత్రం శ్రద్ధ తీసుకున్నా ఇప్పటి వరకు రోడ్డు విస్తరణ పనులు పూర్తయ్యేవని, బస్సు దుర్ఘటన జరిగి ఉండేది కాదని అంటున్నారు.
నాడు సబిత, మహేందర్‌రెడ్డీ పట్టించుకోలేదు
గతంలో ఈ జిల్లా నుంచి మంత్రులుగా ప్రాతినిధ్యం వహించిన పీ సబితా రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి కూడా టీజీ పోలీసు అకాడమీ నుంచి వికారాబాద్ వరకు ఉన్న రోడ్డు విస్తరణను పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. తమ అస్తులు కూడబెట్టుకోవడం, రాజకీయంగా ఎదగడం తప్ప అభివృద్ధి పనులు చేపట్టలేదని జిల్లా వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం జరిగిన బస్సు దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులు కూడా రంగారెడ్డి జిల్లా ప్రజా ప్రతినిధుల స్వార్థ వైఖరిపై దుమ్మెత్తి పోశారు. జిల్లా ప్రజల ఓట్లతో గెలుపొందడం, పదవులు అలంకరించడం, ఆధిపత్యం చెలాయించడం తప్పితే రోడ్లు, విద్యుత్, నీటి పారుదల సౌకర్యాల కల్పన విషయం ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడుతున్నారు. మొయినాబాద్, శంకరపల్లి ప్రాంతాలను దాటిన తరువాత వెనకబాటుతనం కొట్టొచ్చినట్లుగా కన్పిస్తుంది. వికారాబాద్, తాండూరు ప్రాంతాలకు వెళ్తే, ఇంత వెనకబాటుతనం ఉందా? అనే సందేహాలు వస్తాయి. ఇక నగరంలో మెహిదీపట్నం వద్ద ట్రాఫిక్ జామ్ మొదలైతే ఆ సమస్య లంగర్ హౌస్ దాటే వరకు ఉంటుంది. వికారాబాద్ నుంచి వచ్చే వాహనదారులు, బస్సులు లంగర్ హౌస్ నుంచి ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకుంటారు. ప్రత్యామ్నాయ మార్గం లేకపోవడం కూడా శాపంగా పరిణమించింది. నానల్ నగర్ నుంచి లంగర్ హౌస్ వరకు విస్తరించే అవకాశం ఉన్నా రంగారెడ్డి జిల్లా ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి.
ఇవి కూడా చదవండి..
గాలికి వదిలేసిన కెపాసిటీ రూల్.. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల భద్రత ప్రశ్నార్థకం!
BUS ACCIDENT: ప్రమాద ఘటన పై తిరగబడ్డ జనం
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram