బాల్క సుమన్‌ ‘విధ్వంస’ వ్యాఖ్యలు యాదృచ్ఛికమా.. వ్యూహాత్మకమా?

నోరు జారారా? లేక పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే పెద్ద నాయకుడై పోతానని అనుకున్నారా? క్యాడర్‌లో జోప్‌ నింపబోయారా? ఏదైతేనేం.. బీఆరెస్‌ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ చేసిన విధ్వంసకర వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. సింగరేణి ఆఫీసు కాలబెట్టాలని, రైల్వే లైన్లు కోసేయాలని పిలుపునివ్వడం బీఆరెస్‌ అధినాయకత్వాన్ని డిఫెన్స్‌లో పడేసింది.

విధాత, ప్రత్యేక ప్రతినిధి:

బీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సింగరేణి కార్మికుల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారి రాజకీయ రచ్చను సృష్టిస్తున్నాయి. బాల్క సుమన్ తీరుపై కాంగ్రెస్ నేతలు భగ్గుమంటున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు యాదృచ్ఛికమా? వ్యూహాత్మకమా? లేక ఫ్రస్టేషన్‌కు గురై మాట్లాడారా? అనే చర్చసాగుతోంది. సుమన్ మాటలు అనేక ప్రశ్నలు లేవనెత్తగా, తాను మాట్లాడిన మాటలను ఫ్యాబ్రికేట్ చేశారంటూ బాల్క కొత్త పల్లవి అందుకున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ పైన ఎదురుదాడి చేయడం విమర్శలకు తావిచ్చింది. ఇప్పటికే ఈ అంశంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్‌, అద్దంకి దయాకర్‌.. డీజీపీకి ఫిర్యాదు చేయగా, బాల్క సుమన్‌పై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా మండిపడ్డారు. ఈ సందర్భాన్ని కాంగ్రెస్ సీరియస్‌గా పరిగణిస్తూ.. బీఆర్ఎస్‌ను ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తున్నది.

మౌనం దాల్చిన కేటీఆర్‌, హరీశ్‌

రాష్ట్రంలో జరిగే విషయాలపైన మీడియా సమక్షంలోనో, ఎక్స్ ఖాతాలోనో క్షణాల్లో స్పందించే బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్‌.. బాల్క వ్యాఖ్యలపై మౌనం పాటించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ పై విమర్శలు చేసినపుడు, తీవ్ర ఆరోపణలు వ్యక్తమైనప్పుడు ఆ పార్టీ నేతలు వ్యూహాత్మకంగా మౌనం పాటించడం రివాజుగా మారిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గతంలో కవిత లిక్కర్ కేసుపైన, తాజాగా ఆమె చేసిన ఆరోపణల పైనా ఇతర సందర్భాల్లో ‘మౌనాన్ని’ ఆశ్రయించడం వారికి పరిపాటిగా మారిందంటున్నారు. తాజాగా బాల్క సుమన్ మాటల పైన ఈ నాయకులు ఖండించడమో.. సమర్ధించడమో చేయకుండా మౌనం పాటిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

వివాదాస్పదమైన సుమన్ వ్యాఖ్యలు

సింగరేణి కార్మికుల సమావేశంలో మాట్లాడిన సుమన్ మిలిటెంట్ పోరాటాలు చేయాలని పార్టీ నాయకులకు పిలుపునిస్తూ.. సింగరేణి జీఎం ఆఫీస్‌ను కాలబెట్టాలని.. రైల్వే లైను కోసేయాలని చెప్పడమే కాకుండా.. ఆఫీస్ కాలబెడితే ఆటోమెటిక్‌గా పైసలు అవే వస్తాయంటూ వ్యాఖ్యానించడం రాజకీయంగా వివాదాస్పదమైంది. అంతేకాకుండా.. బీఆరెస్‌ ఆందోళనల్లో డొల్ల తనాన్ని సైతం సుమన్‌ స్వయంగా బయటపెట్టడం విశేషం. ధాన్యం కొనుగోళ్లపై చేస్తున్న ఆందోళనల్లో నలుగురైదుగురు మాత్రమే రైతులు ఉంటున్నారని, మిగిలినవారంతా పార్టీ క్యాడర్‌ మాత్రమేనని చెప్పడం ద్వారా రైతు ఆందోళనలకు రైతులు కలిసి రావడం లేదని ఒప్పుకొన్నట్టయింది. ఈ వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీని డిఫెన్సులో పడేశాయి. మిలిటెంట్‌ పోరాటాలంటూ ఆఫీసులను కాలబెట్టాలని పిలుపునివ్వడం కేడర్‌లో ఉత్సాహాన్ని నింపేందుకా? లేక ఫ్ట్రస్ట్రేషన్‌ నుంచి వచ్చాయా? అనేది చర్చనీయాంశంగా మారింది. ఏమైనా ఆఫీసులను కాలబెట్టాలంటూ చెప్పడం నాయకులను తీవ్రం ఇబ్బందికి గురి చేస్తున్నది.

అబ్బే.. అలా అనలేదు..

తాను మాట్లాడిన మాటలు బూమరాంగ్‌ అవ్వడంతో వెంటనే దిద్దుబాటు చర్యలకు దిగిన సుమన్‌.. తన మాటలను ‘ఫ్యాబ్రికేట్’ చేశారంటూ తప్పించుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో కూడా తన మాటలను సమర్ధించుకునే ప్రయత్నం తప్ప కనీస పశ్చాతాపం లేదని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీపై, సీఎం రేవంత్‌పై బీఆర్ఎస్ చేస్తున్న తీవ్ర విమర్శల ప్రభావంతో మరో అడుగుముందుకేసి సుమన్ఈ వ్యాఖ్యలు చేశారని భావిస్తున్నారు.

ఇప్పటికే రాష్ట్రంలో అగ్రశ్రేణి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నాయకులు తమ స్థాయిలు మరిచిపోయి విమర్శలు చేసుకుంటున్నారు. దాని ఫలితమే సుమన్ వ్యాఖ్యలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రానున్న రోజుల్లో ఈ వాతావరణం మరింత జుగుప్సాకరంగా మారినా ఆశ్చర్యం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కాకుంటే సుమన్ వ్యాఖ్యలతో బీఆర్ఎస్ కొంత డిఫెన్సులో పడిందని కొందరు వ్యాఖ్యానిస్తుండగా, కాంగ్రెస్ పై ఆ స్థాయిలో విరుచుకపడకపోతే తిరిగి బీఆర్ఎస్ అధికారంలోకి రావడం కష్టమంటూ సమర్ధించుకునేవారున్నారు. అందుకే పార్టీ ముఖ్యనేతలు కూడా ఖండించకుండా మౌనం పాటిస్తున్నారని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇదే అదునుగా కాంగ్రెస్ నేతలు కూడా బీఆర్ఎస్ పైన తమ దాడిని తీవ్రం చేశారంటున్నారు.

Read Also |

పట్టపగలే చిమ్మ చీకటి.. ఆగస్ట్‌ 2న ఈ శతాబ్దంలోనే సుదీర్ఘ సూర్య గ్రహణం.. భారత్‌లో?
తెలంగాణ గొంతులపై ఆంధ్రా ఇనుప బూట్లా?.. భగ్గుమన్న తెలంగాణ వాదులు!

Latest News