ఐఏఎస్‌ల బదిలీల వెనుక… సచివాలయ ఉన్నతాధికారుల్లో ఆసక్తికర చర్చలు..

తెలంగాణ ఐఏఎస్‌ అధికారుల బదిలీల వెనుక ఆసక్తికర కథనాలు సెక్రటేరియట్‌ సీనియర్‌ అధికారుల్లో వినిపిస్తున్నాయి.

విధాత, హైదరాబాద్:

తెలంగాణ ప్రభుత్వంలో శుక్రవారం పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలతో పాటు నూతన ప్రధాన కార్యదర్శి నియామకం జరిగింది. సంజయ్ పదవీ బాధ్యతల స్వీకరణకు ముందే బదిలీలు జరగడం సచివాలయ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావును సలహాదారుతో పాటు ఎక్స్ అఫీషియో స్పెషల్ చీఫ్ సెక్రెటరీగా నియమించారు. సీఎంవో ముఖ్య కార్యదర్శిగా ఎన్ శ్రీధర్ (1992 బ్యాచ్)ను నియమించారు. ప్రత్యేక కార్యదర్శిగా పనిచేస్తున్న బీ అజిత్ రెడ్డిని బయటకు పంపించడం చర్చనీయాంశంగా మారింది. ఐటీ శాఖ మంత్రి డీ శ్రీధర్ బాబు భార్య శైలజా రామయ్యర్ (1997 బ్యాచ్) నుంచి దేవాదాయ శాఖను తప్పించి, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించారు. మరొకరిని నియమించే వరకు ఆమెకు దేవాదాయ శాఖ అదనపు బాధ్యతలు అప్పగించారు.

ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు ఈ నెలాఖరున పదవీ విరమణ చేస్తుండటంతో ఆయనను ప్రభుత్వ సలహాదారుతో పాటు ఎక్స్ అఫీషియో స్పెషల్ చీఫ్ సెక్రెటరీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీలో కూడా చంద్రబాబు నాయుడు సీఎస్‌గా పదవీ విరమణ చేసిన కే విజయానంద్‌కు ఎక్స్ అఫిషియో చీఫ్ సెక్రెటరీ పదవి కట్టబెట్టారు. అదే తరహాలో తెలంగాణలో కే రామకృష్ణారావుకు కూడా పదవి అప్పగించడం విశేషం. ఆ వెంటనే నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాజు (1992 బ్యాచ్)ను నియమించారు. సచివాలయంలో పనిచేస్తున్న సీనియర్ అధికారులను బదిలీ చేస్తూ మరో ఉత్తర్వు జారీ చేయడం సచివాలయంలో చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సింగరేణి కాలరీస్ కంపెనీ సీఎండీగా సుదీర్ఘకాలంపాటు శ్రీధర్ పని చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి ఆయనను అక్కడి నుంచి తప్పించి ఎస్సీ శాఖకు బదిలీ చేశారు. ఆ తరువాత పంచాయతీ రాజ్‌కు బదిలీ చేశారు. ఆయన ప్రస్తుతం పరిశ్రమలు, వాణిజ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు. తాజా బదిలీల్లో ఆయన సీఎం పేషీలో ముఖ్య కార్యదర్శిగా నియమితులయ్యారు. గతంలో ఆయన అనంతపూర్, కృష్ణా, వరంగల్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సీఎంవోలో కార్యదర్శిగా పనిచేసిన అనుభవం ఉంది. గత అనుభవాన్ని పరిగణనలోకి తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కార్యాలయంలోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు సీనియర్‌ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం సీఎంవోలో ముఖ్య కార్యదర్శులుగా రిటైర్డ్‌ ఐఏఎస్ కే శ్రీనివాస రాజు, వీ శేషాద్రి ఉన్నారు. అదనంగా అదే హోదాలో శ్రీధర్‌ను తీసుకోవడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. ఇదే సమయంలో ప్రత్యేక కార్యదర్శి బీ అజిత్ రెడ్డి (ఐడీఈఎస్ బ్యాచ్ 2012)ని అక్కడి నుంచి తప్పించారు. ఆయన ప్రస్తుతం విద్య, ఉన్నత విద్య, పరిశ్రమలు, పెట్టుబడులు, టీ, ఇంధనం, ఉపాధి శాఖలతో పాటు సీఎం అప్పాయింట్ మెంట్లు, సీఎంఓ పరిపాలనా విధులను పర్యవేక్షిస్తున్నారు. ఇంతటి కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయను తెలంగాణ ఇన్వెస్ట్ సీఈవోగా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. రాష్ట్ర పరిపాలనా వ్యవహారాల్లో అనుభవలేమి, ఢిఫెన్స్ సర్వీసు కు చెందిన అధికారి కావడంతో సీఎంవో నుంచి తప్పించి ఉంటారని ఒక ఉన్నతాధికారి పేర్కొన్నారు.

శైలజా రామయ్యర్‌ను అడవులు, పర్యావరణ శాఖలో నియమించారు. పూర్తి అదనపు బాధ్యతలతో దేవాదాయ శాఖను కొనసాగించారు. అహ్మద్ నదీమ్ (1997 బ్యాచ్) ను సాధారణ పరిపాలనా విభాగం (జీఏడీ) ముఖ్య కార్యదర్శిగా నియమిస్తూ, మైనారిటీ సంక్షేమ శాఖ పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. మూడు నెలలుగా సెలవులో ఉన్న రాహుల్ బొజ్జా (2000 బ్యాచ్) ను విపత్తుల నిర్వహణ ముఖ్య కార్యదర్శిగా నియమించారు. బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. పన్నులు, ఎక్సైజ్ శాఖ కార్యదర్శిగా ఉన్న ఎం రఘునందన్ రావు (2002) కు గనులు, పరిశ్రమల శాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. తెలంగాణ సచివాలయ ఉద్యోగుల సంఘం రఘునందన్ రావు పై ఎన్ని ఫిర్యాదులు చేసినా, ఆయనకు పెద్దపీట వేయడం పలు అనుమానాలకు తావిస్తున్నదని సచివాలయ ఉద్యోగులు అంటున్నారు.

తెలంగాణ సాంప్రదాయేతర ఇంధన వనరుల సంస్థ (టీజీ రెడ్కో) వీసీ అండ్ ఎండీ గా వావిళ్ల అనీలను బదిలీ చేశారు. టీజీ ఎస్పీడీసీఎల్ లో సాధారణ డీఈ గా పనిచేస్తున్న ఆమెను డిప్యుటేషన్ పై టీజీ రెడ్కో వీసీ అండ్ ఎండీ గా 2024 ఆగస్టులో నియమించారు. ఈమె నియామకాన్ని పలువురు తెలంగాణ వాదులు వ్యతిరేకించారు. రాయలసీమ ప్రాంతానికి చెందిన ఆమెను ఇంత కీలకమైన పదవిలో ఎలా నియమిస్తారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కు ఫిర్యాదు చేశారు. అయినా ఆమెను బదిలీ చేయకుండా ఇప్పటి వరకు కొనసాగించారు. ఈమె నియామకం వెనకాల మల్లు భట్టి హస్తం ఉందని విద్యుత్ ఉద్యోగులు అప్పట్లో చర్చించుకున్నారు. తాజా బదిలీల్లో ఎండీ ముషర్రాఫ్ అలీ ఫారూఖీ (2014 బ్యాచ్) ని వీసీ అండ్ ఎండీ గా నియమించారు. గత కొన్నేళ్లుగా ప్రధాన కార్యదర్శి పేషీ లో పాతుకు పోయిన ఓఎస్డీ కే విద్యాసాగర్‌ను అక్కడి నుంచి ఎట్టకేలకు తప్పించారు. శాంతి కుమారి బదిలీ తరువాత అక్కడి నుంచి బదిలీ చేయాల్సి ఉండగా ఆగిపోయింది. తాజా బదిలీల్లో విద్యాసాగర్‌ను ప్రజా వాణి స్టేట్ నోడల్ ఆఫీసర్‌గా నియమించడం గమనార్హం. అయితే జీహెచ్ఎంసీలో అడిషనల్ కమిషనర్ (ఎన్నికలు) గా పనిచేస్తున్న కే చంద్రకళ‌కు హెచ్ఎండీఏలో జాయింట్ మెట్రో పాలిటన్ కమిషనర్ గా అదనపు బాధ్యతలు అప్పగించారు.

Latest News