Rahul Gandhi | కాంగ్రెస్ సభకు రాహుల్ డుమ్మా! కీలక కార్యక్రమంపైనా చిన్నచూపు!

Rahul Gandhi | కాంగ్రెస్ సభకు రాహుల్ డుమ్మా! కీలక కార్యక్రమంపైనా చిన్నచూపు!

Rahul Gandhi | హైదరాబాద్, జూలై 5 (విధాత): స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ శుక్రవారం ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన సామాజిక న్యాయ సమరభేరి సభ విజయవంతం అయ్యింది. ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ఈ సభకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, దిశా నిర్ధేశకుడు రాహుల్ గాంధీ రాకపోవడం పెద్ద మైనస్‌గా కనిపిస్తున్నది. అత్యంత ముఖ్యమైన సభకు రాహుల్ రాకపోవడం పట్ల కాంగ్రెస్ శ్రేణులు సైతం నిరాశకు గురయ్యాయి. రాష్ట్రంలో బీసీ కులాల గణన నిర్వహించడంతో పాటు ఎస్సీ వర్గీకరణ విజయవంతంగా అమలవుతున్న తరుణంలో రాహుల్ వచ్చి సందేశం ఇస్తే వాడవాడకూ వెళ్ళేదని సభకు హాజరైన కార్యకర్తలు చర్చించుకోవడం కన్పించింది.

ఈ ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. మీడియాతో చిట్‌చాట్‌ సందర్భంగా పలు విషయాలు ప్రస్తావించారు. తెలంగాణలో శాస్త్రీయంగా బీసీ కుల గణన, స్థానిక సంస్థలు, విద్య, ఉపాధి రంగాలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసిన విషయాలను ప్రస్తావించారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఎస్సీ వర్గీకరణ కూడా అమలు చేస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో నిర్వహించే కృత‌జ్ఞ‌తా స‌భ‌ల‌కు రావాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోకసభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని ఆహ్వానించానని రేవంత్‌రెడ్డి ఆనాడు తెలిపారు. ఆ తరువాత జూన్ నెలలో మళ్లీ రాహుల్ గాంధీని కలిశారు. ఈ సమావేశంలో నూతనంగా మంత్రివర్గంలో చేర్చుకున్న ముగ్గురికి శాఖల కేటాయింపుపై రేవంత్ రెడ్డి చర్చించారు. బీసీ కుల గణన సర్వే విజయవంతంగా పూర్తి చేశామని, ఇదే తరహాలో కేంద్రం కూడా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామని ఆయనకు వివరించారు. రాష్ట్రంలో ఎస్సీలలో కులాలను మూడు వర్గాలుగా విభజించి రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ రెండు అంశాలపై నిర్వహించే బహిరంగ సభలకు హాజరై సందేశం ఇవ్వాల్సిందిగా రేవంత్ రెడ్డి మళ్లీ రాహుల్ గాంధీని ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను కూడా కలిసి.. వారిని సైతం ఈ సభకు ఆహ్వానించారు. కానీ.. ఏం జరిగిందో ఏమో కానీ.. రాహుల్‌ మాత్రం హాజరుకాలేదు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్టీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గేను పంపారు.

ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన సామాజిక న్యాయ సమరభేరి సభకు గ్రామ స్థాయి కార్యకర్తలు మొదలు ముఖ్యమంత్రి వరకు భారీ ఎత్తున హాజరయ్యారు. ప్రతి నియోజకవర్గం నుంచి కనీసం ఐదు వందల మంది చొప్పున హాజరు కావాలని పీసీసీ నాయకత్వం ఆదేశించింది. ఈ సభకు నలభై వేల మందికి తగ్గకుండా హాజరవుతారని అంచనా వేసి వర్షం కురిసినా ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినతి మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్ గురువారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. అయితే బిజీ షెడ్యుల్ కారణమో మరేమైనా ప్రత్యేక కారణమో తెలియదు కానీ.. రాహుల్ గాంధీ డుమ్మా కొట్టారు. రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున హాజరైన కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకుల సమావేశానికి రాహుల్‌ రాకపోవడం పలువురు కార్యకర్తలు, నాయకులను నిరుత్సాహపరిచింది. రాహుల్ గాంధీ ఆదేశం మేరకు రేవంత్ రెడ్డి సర్కార్ రాష్ట్రంలో శాస్త్రీయంగా బీసీ కుల గణన నిర్వహించి దేశానికి దిక్సూచిగా నిలిచిందని, సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఎస్సీ కులాలను మూడు వర్గాలుగా విభజించి రిజర్వేషన్లను అమలుపరుస్తున్నారని పలువురు కార్యకర్తలు గుర్తు చేశారు.

తెలంగాణ సమాజంలో బీసీలతో ఎస్సీల జనాభా 70 శాతానికి పైగా ఉంది. ఈ రెండు వర్గాలకు చేసిన మేలును సభా ముఖంగా రాహుల్ చెబితే కాంగ్రెస్ కార్యకర్తల్లో మరింత ఉత్తేజం నింపినట్టు అయ్యేదని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. తమది చేతల ప్రభుత్వమని చెప్పుకునే అవకాశం ఆయనకు ఉండేదని అంటున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం లక్ష్యం, ఆకాంక్ష ఇదేనని రాహుల్ సమర్థించుకోవడానికి ఎల్బీ స్టేడియం వేదిక అయ్యేదని పేర్కొంటున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలను తూర్పారబట్టడానికి సముచితమైన వేదికను రాహుల్ గాంధీ మిస్ అయ్యారనే అభిప్రాయాలు విశ్లేషకుల్లో వ్యక్తమవగా.. ఒక రకంగా రేవంత్ రెడ్డిని చిన్న చూపు చూసినట్లేనని కాంగ్రెస్ కార్యకర్తలు వాపోయారు. గతేడాది నవంబర్ నెలలో రైతుల రుణ మాఫీ, కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలన ప్రజా విజయోత్సవ సభను వరంగల్ లో నిర్వహించారు. ఈ సభకు కూడా రాహుల్ గాంధీని ఆహ్వానించగా ఆయన రాలేదు. మరుసటి నెలలో బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు అగ్ర నాయకురాలు సోనియా గాంధీతో పాటు రాహుల్ ను కూడా ఆహ్వానించారు. అనారోగ్య కారణాలతో సోనియా రాలేకపోవడంతో రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.