Dharani Land Scam | ధరణిపై ఫోరెన్సిక్ ఆడిట్! తండ్రీకొడుకులు, అల్లుడిపై పొంగులేటి గురి?

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తోపాటు ఆయ‌న త‌న‌యుడు కేటీఆర్, మేన‌ల్లుడు హరీశ్ రావు సొంత జిల్లాల్లోనే మొదట ధరణి అక్రమాలపై ఫోరెన్సిక్‌ ఆడిట్ నిర్వహిస్తుండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. ఫోరెన్సిక్ ఆడిట్ కింద మొదట రేవంత్ సర్కార్ ఈ రెండు జిల్లాలనే ఎంపిక చేయడమంటే బీఆర్ఎస్ పార్టీని ఇరకాటంలో పెట్టేందుకేనన్న చర్చలు రాజకీయ వర్గాల్లో పెద్దఎత్తున వినిపిస్తున్నాయి.

Dharani Land Scam | ధరణిపై ఫోరెన్సిక్ ఆడిట్! తండ్రీకొడుకులు, అల్లుడిపై పొంగులేటి గురి?

Dharani Land Scam | హైద‌రాబాద్‌, ఆగ‌స్టు 15 (విధాత‌): ధ‌ర‌ణి పోర్ట‌ల్‌ మాటున భారీ భూదందాలు జరిగాయని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆరోపించిన కాంగ్రెస్‌.. ఇప్పుడు తన ప్రభుత్వం కొలువుదీరడంతో ఆ అక్రమాలను బయటపెట్టే పనిలో ఉన్నది. ధ‌ర‌ణిలో అక్ర‌మాల‌పై ఫోరెన్సిక్ ఆడిట్ చేస్తామ‌ని చెప్పిన విధంగానే ఆడిట్ నిర్వ‌హించ‌డానికి సిద్ధమైంది. పైల‌ట్ ప్రాజెక్ట్ కింద రెండు జిల్లాల్లో ఫోరెన్సిక్ ఆడిట్ చేప‌ట్టింది. అయితే.. ప్రభుత్వం ఎంచుకున్న జిల్లాలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతున్నాయి. ప్రభుత్వం పైలట్‌ ప్రాజెక్ట్‌ను సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో చేపట్టింది. సిద్దిపేట జిల్లాలోనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్‌ నియోజకవర్గం ఉన్నది. బీఆరెస్‌ సర్కార్‌లో మంత్రిగా వ్యవహరించిన ఆయన అల్లుడు హరీశ్‌రావు ప్రాతినిధ్యం వహించిన సిద్దిపేట.. జిల్లా కేంద్రంగా ఉన్నది. ఇక పార్టీలో నంబర్‌ టూగా చెలామణీ అవుతున్న బీఆరెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేసీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల.. జిల్లా కేంద్రంగా ఉన్నది. ముగ్గురు కీలక నేతలు తమ సామ్రాజ్యాలుగా వ్యవహరించుకునే జిల్లాలను ఎంపిక చేయడం ప్రభుత్వ వ్యూహాత్మక ఎత్తుగడగా సచివాలయ వర్గాలు చెబుతున్నాయి. ఈ రెండు జిల్లాల్లో జ‌రిగే ఆడిట్‌లో అక్ర‌మాలు వెలుగులోకి వ‌స్తే.. తదుపరి రంగారెడ్డితో పాటు గ్రేట‌ర్ హైద‌రాబాద్ శివారు జిల్లాలైన సంగారెడ్డి, మేడ్చ‌ల్‌-మ‌ల్కాజిగిరి, యాదాద్రి భువ‌న‌గిరి, న‌ల్ల‌గొండ‌, మెద‌క్ జిల్లాల్లో రెండ‌వ ద‌శ‌లో ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వ‌హించాల‌న్న‌నిర్ణ‌యంతో ప్ర‌భుత్వ పెద్ద‌లు ఉన్న‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. ఆ త‌రువాత రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఆడిట్ నిర్వ‌హించి, ధ‌ర‌ణి అక్ర‌మాల‌ను వెలుగులోకి తేవాల‌ని కాంగ్రెస్ స‌ర్కారు నిర్ణ‌యించిన‌ట్లు తెలుస్తోంది.

గ‌త బీఆరెస్ స‌ర్కారులో రెవెన్యూ శాఖ పూర్తిగా అవినీతి మ‌యం అయింద‌ని, రైతుల‌ను, భూయ‌జ‌మానులను దోచుకుంటున్నదని పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే. రెవెన్యూ వ్యవస్థ మొత్తాన్నీ అక్రమ అధికారుల కూపంగా అభివర్ణించింది. ఆ మేరకు బీఆరెస్‌ అధికార పత్రికగా చెలామణీ అయ్యే నమస్తే తెలంగాణలో సుమారు ఏడాదిపాటు ‘ధర్మ గంట’ శీర్షికన రెవెన్యూ అధికారుల అక్రమాలపై పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. వాటి ఆధారంగా భూ అక్రమాలకు వీఆర్వోలను బాధ్యులను చేస్తూ నాటి ప్రభుత్వం ఏకంగా వీఆర్వో వ్యవస్థనే రద్దు చేసింది.

అప్ప‌టి వ‌ర‌కు ఉన్న రెవెన్యూ చ‌ట్టానికి సవరణలు చేస్తూ ధ‌ర‌ణి పోర్ట‌ల్‌ తీసుకు వ‌చ్చారు. ఈ చ‌ట్టం ద్వారా తాసిల్దార్లు, ఆర్డీవోలు, ఆఖ‌రుకు జిల్లా క‌లెక్ట‌ర్ల‌కు కూడా ఎలాంటి అధికారాలు లేకుండా కత్తెర వేశారు. ఆ త‌రువాత వ‌ర్కింగ్ ఆర్డ‌ర్స్‌లో క‌లెక్ట‌ర్ల‌కు మాత్ర‌మే ప‌రిమిత అధికారులు ఇచ్చిన అప్ప‌టి సీఎం కేసీఆర్.. మొత్తం ధ‌ర‌ణి వ్య‌వ‌స్థ‌ను త‌న గుప్పిట్లోకి పెట్టుకున్నార‌న్నవిమ‌ర్శ‌లు తీవ్రంగా ఎదుర్కొన్నారు. రైతుల స‌మ‌స్య‌లు పరిష్కారం కాలేదు. ల‌క్ష‌ల ఎక‌రాల భూములు పార్ట్ ‘బీ’లో పెట్టారు. రైతులు త‌మ స‌మ‌స్య ప‌రిష్కారం కాక‌పోవ‌డంతో కోర్టుకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్ప‌డింది. ఇదే స‌మ‌యంలో ధ‌ర‌ణి పోర్ట‌ల్‌ను అడ్డం పెట్టుకొని ప్రభుత్వ పెద్ద‌ల అండదండ‌ల‌తో బ‌డాబాబులు భారీ ఎత్తున భూ ఆక్ర‌మ‌ణ‌ల‌కు పాల్ప‌డ్డార‌న్న ఆరోప‌ణ‌లు బ‌లంగా వెలువ‌డ్డాయి. ధరణి పోర్టల్ సర్వర్‌కు సంబంధించిన లాగిన్స్‌తో కింద స్థాయి అధికారులకు ఎలాంటి సంబంధం లేకుండా అంతా ఉన్నతస్థాయి అధికారులతోనే మ్యుటేషన్లు, లావాదేవీలు, యాజమాన్య హక్కుల మార్పులను సెలవులు, కార్యాలయ వేళలతో నిమిత్తం లేకుండా చేపట్టి.. భూములను కొట్టేశారన్న ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున వచ్చాయి.

ధ‌ర‌ణిలో భారీ ఎత్తున భూ కుంభకోణం జ‌రిగింద‌ని ఆరోపించిన కాంగ్రెస్ పార్టీ, అప్ప‌టి పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి.. తాము అధికారంలోకి రాగానే ధ‌ర‌ణిని బంగాళాఖాతంలో వేస్తామ‌ని, దానిస్థానంలో పార‌ద‌ర్శ‌క‌మైన భూ ప‌రిపాల‌నా వ్య‌వ‌స్థ తీసుకువ‌స్తామ‌ని ప్ర‌క‌టించారు. ధ‌ర‌ణిలో అక్ర‌మాల‌కు పాల్ప‌డిన వారు ఎంత‌టి వారైనా వ‌ద‌లి పెట్ట‌బోమ‌ని, క‌ఠినంగా శిక్షిస్తామ‌ని వెల్ల‌డించారు. కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాన్ని న‌మ్మిన రైతులు అధికారం క‌ట్ట‌బెట్టారు. అధికారంలోకి వ‌చ్చిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి.. చెప్పిన విధంగానే ఫోరెన్సిక్ ఆడిట్ జరిపేందుకు చర్యలు చేపట్టారు.

ప్ర‌భుత్వం కేరళకు చెందిన కేరళ సెక్యూరిటీ ఆడిట్ అండ్ అష్యూరెన్స్ సెంటర్‌ను ఈ బాధ్యతల్లో నియమించింది. నెల రోజులుగా కొనసాగుతున్న ఈ ఫోరెన్సిక్ ఆడిట్ త్వరలోనే పూర్తి కానున్నట్లు స‌మాచారం. ధరణి పోర్టల్‌లో జరిగిన అనుమానాస్పద లావాదేవీల డిజిటల్ ఫుట్ ప్రింట్స్‌ను పరిగణలోకి తీసుకుని, భూ రికార్డుల మార్పిడి, మ్యుటేషన్లు, యాజమాన్య హక్కుల బదిలీ, అసైన్డ్, ప్రభుత్వ భూముల విషయంలో జరిగిన అనుమానాస్పద లావాదేవీలను గుర్తించ‌నున్న‌ది. ఈ లావాదేవీలు ఏ సమయంలో? ఎక్కడి నుంచి జరిగాయి? ఏ అధికారి ద్వారా జరిగాయి? అనే వివరాలను కూడా గుర్తిస్తున్న‌ట్లు తెలిసింది.

ఇవి కూడా చదవండి..

Vote Chori; IFTU Prasad Opinion | ఓటు చోరీ వ్యతిరేక ఉద్యమాన్ని ముందుకు తీసుకెళదాం
India warn Pakistan | దుస్సాహసానికి తెగిస్తే బాధాకర పర్యవసానాలే! : పాకిస్తాన్‌కు భారత్‌ సీరియస్‌ వార్నింగ్‌
Gattu Lift Irragation Project | ‘గట్టు’ ఎత్తిపోతల గట్టెక్కేనా! ఏడేళ్లుగా శంకుస్థాపనకే పరిమితం.. ‘గట్టు’పై దృష్టి పెట్టని సీఎం రేవంత్
Assigned Land Rights Telangana| అసైనీలకు ‘హక్కులు ఇంకెప్పుడు? యాజమాన్య హక్కుల కోసం ఎదురుచూపు