Telangana Employees | ఆంధ్రాలోని తెలంగాణ ఉద్యోగులపై దయ లేదా! వెనక్కు తేవడానికి ఇంకెన్నేళ్లు?

ఈ పదకొండున్నర సంవత్సరాల కాలంలో సుమారు పదిహేను వందల మంది వరకు పదవీ విరమణ చేశారని సమాచారం. కొందరు ఉద్యోగులు స్వరాష్ట్రంలో రిటైర్మెంట్ అయ్యేందుకు సర్వశక్తులు ఒడ్డారు. కనీసం రిటైర్మెంట్‌కు రెండు రోజుల ముందు తెలంగాణ ప్రభుత్వంలో చేరి, ఆ తరువాత ఇంటికి వెళ్దామని అనుకున్నారు కాని వారి తలరాత అనుకూలించలేదని ఒక సచివాలయ ఉద్యోగి తెలిపారు.

Telangana Employees | ఆంధ్రాలోని తెలంగాణ ఉద్యోగులపై దయ లేదా! వెనక్కు తేవడానికి ఇంకెన్నేళ్లు?

Telangana Employees | హైదరాబాద్, జూలై 2 (విధాత) ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణ విడిపోయి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు అయ్యింది. ఫలాలు అందరూ అనుభవిస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రంలో కొందరు నాయకులు వందల కోట్లు కూడబెట్టుకున్నారు. మరికొందరు పదవులూ అనుభవిస్తున్నారు. కానీ ప్రత్యేక రాష్ట్రం కొందరిపాలిట శాపంగా మారింది. వారే ఆంధ్రాలో మగ్గుతున్న అసలు సిసలు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు. ఇంకా మూడు వందల యాభైకి పైగా ఉద్యోగ కుటుంబాలు మనో వేదనకు గురవుతున్నాయి. రాష్ట్రం వచ్చిందన్న సంతోషం తెలంగాణ స్థానికత కలిగిన ఉద్యోగ కుటుంబాల్లో లేదు. ఆంధ్రా నుంచి తెలంగాణలోకి రావడానికి గత పదకొండు సంవత్సరాలుగా వారు ఎక్కని కొండ లేదు దిగని మెట్టు లేదనే విధంగా ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా వారి న్యాయమైన డిమండ్‌ను పరిష్కరించేందుకు చొరవ తీసుకోకపోవడం లేదని ఆంధ్రలోని తెలంగాణ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆ మాట విన్నందుకు..

పార్లమెంటులో ప్రత్యేక రాష్ట్రం బిల్లు పెట్టే సందర్భంలో ఉద్యోగుల కేటాయింపుల విషయంలో ఉద్యోగ సంఘాల నాయకుల మధ్య గొడవలు జరిగాయి. ఆంధ్రా మూలాలు ఉన్న ఉద్యోగులందరూ ఏపీకి వెళ్లాల్సిందేనంటూ తెలంగాణ ఉద్యమ నాయకులు, ఉద్యోగ సంఘాల నాయకులు గట్టిగా పట్టుబట్టారు. ఇలా మీరు పట్టుబడితే కష్టమని, వచ్చే తెలంగాణను అడ్డుకున్నవారు అవుతారంటూ ఒకప్పటి ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు పరుచూరి అశోక్ బాబు కుండ బద్దలు కొట్టి చెప్పారు. విభజన తరువాత ఏమైనా ఉంటే అప్పుడు చూసుకుందామని సముదాయించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ఆరు నెలల ముందు జరిగిన ఎన్నికల్లో అశోక్ బాబు ఏపీ ఎన్జీవోస్‌ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆ తరువాత ఆయన తన ఉద్యోగానికి వీఆర్ఎస్ తీసుకుని టీడీపీలో చేరి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు కూడా. అశోక్ బాబు సూచన కాదనలేక తెలంగాణ ఉద్యోగ సంఘాల నాయకులు సరేనన్నారు. ఆ తరువాత జనాభా నిష్పత్తి ప్రకారం ఉద్యోగులు, ఆస్తుల విభజన పూర్తయింది. కానీ ఇంకా కొందరి ఉద్యోగుల బాధలు, ఆస్తుల విభజన సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి.

విభజన సమయంలో ఏపీకి ఆరువేల మంది

విభజన సమయంలో సుమారు ఆరు వేల మంది వరకు తెలంగాణకు చెందిన ఉద్యోగులను ఆంధ్రకు కేటాయించారు. వారిలో జోనల్, మల్టీ జోనల్ ఉద్యోగులు, రాష్ట్ర స్థాయి అధికారులు కూడా ఉన్నారు. అయితే రాష్ట్ర స్థాయి అధికారులకు పనిచేసే రాష్ట్రం ఎంచుకునే ఆప్షన్‌ ఇచ్చి, జోనల్, మల్టీ జోనల్ ఉద్యోగులకు ఇవ్వకపోవడం తమ పాలిట పెద్ద శాపమనే ఆవేదనలు వినిపిస్తున్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన కొత్తలో ఏపీకి కేటాయించిన కొందరు.. ఉద్యోగ సంఘాల నాయకులతో కలిసి నాటి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావును కలిశారు. మీరందరూ వెళ్లి విధుల్లో చేరండి, వెంటనే వెనక్కి తీసుకువస్తానంటూ నమ్మే విధంగా భరోసా ఇచ్చారు. కేసీఆర్ భరోసా ఇచ్చారనే గుడ్డి నమ్మకంతో సుమారు ఆరు వేల మంది జోనల్, మల్టీ జోనల్ ఉద్యోగులు ఏపీ రాష్ట్రంలో చేరారు. ఉద్యోగుల సమస్యలు పరష్కరించేందుకు ఏర్పాటు అయిన కమల్ నాథన్ కమిటీ ఇరు రాష్ట్రాల ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపింది. ఉభయ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, వారి కింది అధికారులు కూర్చుని పరస్పరం ఉద్యోగులను శాశ్వత బదిలీ చేసుకుంటే తనకేమీ అభ్యంతరం లేదని చెప్పారు. ఈ విషయంలో కేసీఆర్ ఏమాత్రం చొరవ తీసుకోకపోగా, ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు ఇవ్వకపోవడంతో నాలుగో తరగతి ఉద్యోగులు ఆగ్రహానికి లోనయ్యారు. సచివాలయం ముందు సదరు ఉద్యోగులు దుస్తులు విప్పి ఆందోళనకు దిగడమే కాకుండా తిట్టిపోశారు. దీన్ని మనసులో పెట్టుకున్ని కేసీఆర్ వారి విషయంలో పూర్తి నిర్లక్ష్యం ప్రదర్శించారనే ఆరోపణలు ఉన్నాయి. ఎవరైనా నాలుగో తరగతి ఉద్యోగి ఏపీ నుంచి తెలంగాణకు వస్తే సచివాలయంలో జాయినింగ్, పోస్టింగ్ ఆర్డర్ ఇవ్వవద్దని, సచివాలయం బయటే పోస్టింగ్ ఇవ్వాలని కేసీఆర్ అధికారులకు స్పష్టం చేశారని అప్పట్లోనే వార్తలు వచ్చాయి. కేసీఆర్ ఆదేశాల కారణంగా ఒకప్పుడు ఉమ్మడి సచివాలయంలో చేసి, ఏపీకి వెళ్లి, తిరిగి తెలంగాణకు వచ్చిన నాలుగో తరగతి ఉద్యోగులు బయటి కార్యాలయాల్లో పని చేస్తున్నారు.

రిటైర్మెంట్‌ అయినా తెలంగాణలో ఇప్పించండి..

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి మొదలైన తెలంగాణ స్థానికత ఉద్యోగుల కష్టాలు ఇప్పటి వరకు తీరడం లేదు. తమ గోడు చెబుతామంటే వినేవాడు ఎవరూ లేరని వారు వాపోతున్నారు. గత ప్రభుత్వంలో తిరగని మంత్రి కార్యాలయం లేదు, అడగని ఎమ్మెల్యేలు లేరు. ఎక్కే మెట్టు దిగే మెట్టు ఏడుకొండల వాడా అన్న తీరుగా పదేళ్లు చెప్పులు అరిగేలా ప్రదక్షిణలు చేసినా ప్రయోజనం దక్కలేదని చెబుతున్నారు. ఈ పదకొండున్నర సంవత్సరాల కాలంలో సుమారు పదిహేను వందల మంది వరకు పదవీ విరమణ చేశారని సమాచారం. కొందరు ఉద్యోగులు స్వరాష్ట్రంలో రిటైర్మెంట్ అయ్యేందుకు సర్వశక్తులు ఒడ్డారు. కనీసం రిటైర్మెంట్‌కు రెండు రోజుల ముందు తెలంగాణ ప్రభుత్వంలో చేరి, ఆ తరువాత ఇంటికి వెళ్దామని అనుకున్నారు కాని వారి తలరాత అనుకూలించలేదని ఒక సచివాలయ ఉద్యోగి తెలిపారు. ఇప్పటికీ ఇంకా మూడు వందల యాభై మంది వరకు తెలంగాణ కు రావాల్సి ఉందని అంటున్నారు. వీరిని తెలంగాణ తీసుకువచ్చేందుకు రెండు నెలల క్రితం జరిగిన క్యాబినెట్ సమావేశంలో చర్చించారు. ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ వారిని తిరిగి వెనక్కి రప్పించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎం కోదండరామ్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జీ చిన్నారెడ్డి, ఐఏఎస్ అధికారి దివ్య దేవరాజన్‌తో కమిటీ వేశారు. వారి సిఫారసు మేరకు గతేడాది 148 మంది ఉద్యోగులు ఏపీ నుంచి తెలంగాణకు వచ్చారు. తాజాగా మంగళవారం ఆరుగురు నాలుగో తరగతి ఉద్యోగులు తెలంగాణ ప్రభుత్వంలో జాయిన్ అయ్యారు. 350 మంది ఉద్యోగులను వెనక్కి రప్పించే ఫైలు ప్రభుత్వం వద్ద ఉందని తెలుస్తున్నది. ముఖ్యమంత్రి కూడా వీరి విషయంలో సానుకూలంగానే ఉన్నారని తెలిసింది. అయితే ఏపీ నుంచి పైరవీలు చేసుకుని సింగిల్ గా వచ్చేవారి విషయంలో ఒక న్యాయం, కొంత మంది కలిసి వస్తే మాత్రం మరో న్యాయం పాటించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏపీలో ఏ క్యాడర్ ఉంటే అదే క్యాడర్ ఇక్కడ కొనసాగించాలని ఏపీ నుంచి వచ్చే తెలంగాణ స్థానికత ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.