- కేసీఆర్ కుటుంబం నుంచి మరో పార్టీ
- టార్గెట్ కేసీఆర్ కావడం గమనార్హం
- నూతన పార్టీకి పురుడుబోసిన కవిత
- తండ్రి చెప్పుల్లో కాళ్ళు పెడతారా?
- స్వతంత్ర బాటలో పయనిస్తారా?
- కాంగ్రెస్, బీజేపీపై విమర్శల పర్వం
- రాజకీయ పయనంపై ఆసక్తికర చర్చ
- కవిత తనను ఆవిష్కరించుకునే యత్నం
- అనుకూల, ప్రతికూలతపై విశ్లేషణలు
విధాత, ప్రత్యేక ప్రతినిధి:
తెలంగాణ రాజకీయ చిత్రపటంపై మరోసారి టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సేన) పేరుతో కొత్త పార్టీ ఆవిర్భవించింది. పుట్టిన మొదటి రోజే ఈ పార్టీ ప్రయోగం ఫలిస్తుందా? ప్రతికూలిస్తుందా? అనే ఆసక్తికరమైన చర్చ మొదలైంది. తెలంగాణ పేరుతో అనేక పార్టీలు ఆవిర్భవించి, తర్వాత కొద్ది రోజులకే కనుమరుగైన అనుభవాలు ఉన్నాయి. ఇందులో ఎక్కువ పార్టీలు తెలంగాణ ఉద్యమ కాలంలోనూ, తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా ఏర్పడితే… కవిత ఆధ్వర్యంలో మాత్రం కేసీఆర్ భాషలోనే ‘ఫక్తు’ రాజకీయ పార్టీగా ఏర్పాటయ్యింది. రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా ఈ పార్టీ పుట్టిందని చెప్పవచ్చు.
తొలి టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సమితి) కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేతృత్వంలో ఆవిర్భవిస్తే మలి టీఆర్ఎస్ ఆయన కుమార్తె దేవనపల్లి కవిత ఆధ్వర్యంలో ఇరవై ఆరేళ్ల తర్వాత పురుడుబోసుకున్నది. కేసీఆర్ నేతృత్వంలో ఏర్పాటైన టీఆర్ఎస్.. భారత రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందడంతో తెలంగాణ ఆత్మను కోల్పోయిందనే విమర్శలున్నాయి. ఇప్పుడు తెలంగాణ ఆత్మ ఉన్న పార్టీయే లేకుండా పోయిందనే అభిప్రాయం జనాల్లో గట్టిగానే ఉన్నది.
తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. తమ పార్టీ పేరును తిరిగి టీఆర్‌ఎస్‌గా మార్చాలనే అభిప్రాయం, చర్చ పార్టీలో ఉన్నట్లు చెప్పడం తెలిసిందే. పార్టీ పేరు మార్పు తర్వాత తెలంగాణ ప్రజలకు దూరమయ్యామనే భావనను కూడా ఆ సమయంలో ఆయన వ్యక్తం చేశారు. కవిత.. ఈ ప్రయత్నాలకు అడ్డుపుల్ల వేశారా? అన్న చర్చ కూడా సాగుతున్నది.
కేసీఆర్ కుటుంబ పార్టీగానే చూస్తారా?
కవిత నేతృత్వంలో కేసీఆర్ కుటుంబం నుంచి వస్తున్న పార్టీగా అనుకూలమెంత? ప్రతికూలమెంత? అనే చర్చకూడా సాగుతోంది. కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం ఏర్పడే వరకు సాగిన ఉద్యమంలో ఎన్ని పొరపాట్లు, తప్పులు జరిగినప్పటికీ వాటిని ఎవ్వరూ పట్టించుకోలేదు. రాష్ట్ర సాధన ఉద్యమంలో కేసీఆర్ కీలక పాత్ర నేపథ్యంలో ఆయనకే రెండు పర్యాయాలు అధికారం కట్టబెట్టారు. ఈ పదేళ్ళ పాలనపై ఆ పార్టీ శ్రేణులు ఎంత గొప్పగా చెప్పుకొంటున్నప్పటికీ ప్రజల్లో పెరిగిన వ్యతిరేకత ఫలితమే అధికారాన్ని కోల్పోయారనేది వాస్తవం. ఇదిలా ఉండగా ఏడాది క్రితం వరకు అదే పార్టీలో ప్రధాన నాయకురాలిగా, కేసీఆర్ కుటుంబ సభ్యురాలిగా అన్ని రకాల రాజకీయ అవకాశాలను కవిత కూడా అనుభవించారు. కనుక పదేళ్ళ అధికార ‘పాపం’లో కవితకు వాటా ఉందనే అభిప్రాయం ప్రస్తుతం కూడా వ్యక్తమవుతోంది. కవిత కూడా జరిగిన పొరపాట్లు, తప్పులకు క్షమాపణ చెబుతున్నట్లు ప్రకటించడాన్ని తెలంగాణ ప్రజలు ఏ విధంగా స్వీకరిస్తారనేది ప్రధాన అంశం. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో తాను పాల్గొన్నట్టు, తెలంగాణ సంస్కృతి అభివృద్ధిలో కీలక పాత్రపోషించినట్టు.. జాగృతి నేతృత్వంలో కష్టపడ్డట్టు.. కవిత చెబుతున్నప్పటికీ ఆ కుటుంబ సభ్యురాలిగా ప్రజలు ఏ విధంగా ఆహ్వానిస్తారనే చర్చ సాగుతోంది.
కవిత తొలి టార్గెట్ తండ్రి కేసీఆర్
తన రాజకీయ ఉనికి కోసం కవిత తన తండ్రి కేసీఆర్‌ను తొలి టార్గెట్ చేశారు. సారు మారిపోయారని, మమకారం కోల్పోయి, మరమనిషిగా మారారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ ఆత్మను చంపేసి బీఆర్ఎస్ ఏర్పాటు చేసి… పంజాబ్, ఢిల్లీ అంటూ తిరిగి ఏం పీకారంటూ ఘాటుగానే విరుచుకపడ్డారు. సారు ఫాం హౌజ్ దాటరంటూనే … చిన్నసారును సీఎం చేయడమే లక్ష్యమని సూటిగా ఆ పార్టీ లక్ష్యం తేల్చేశారు. దీంతో పాటు కాళేశ్వరంలో అవినీతిని ప్రస్తావిస్తూ.. కేసీఆర్ చుట్టూ గుంటనక్కలు, తోడేళ్ళు చేరాయని మరోసారి విమర్శల దండకం ఎత్తుకున్నారు. తాజా పరిస్థితుల్లో తను ఏర్పాటు చేసే తెలంగాణ రాష్ట్ర సేన బతికిబట్టకట్టాలంటే కేసీఆర్‌ను, ఆ పార్టీలోని నేతలను ఆమె టార్గెట్ చేయడం కీలక అంశంగా ఆమె భావిస్తున్నట్టు కనిపిస్తోంది. తెలంగాణ వాదానికి తానే చాంపియన్ కావాలనే ఆకాంక్షను కూడా కవిత బహిర్గతం చేశారు. అయితే కేసీఆర్ చెప్పుల్లో కాళ్ళు పెడుతారా? స్వతంత్ర రాజకీయ నేతగా ఎదుగుతారా? ఆమెను తెలంగాణ ప్రజలు ఏ మేరకు నమ్ముతారు. ఆమె పై గురి కుదురుతుందా? అనేది కీలకం.
బీజేపీ, కాంగ్రెస్‌పై విమర్శల దాడి
కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావించే సమయంలో అప్పటికే ఉన్న రాజకీయ పార్టీలను ఎవరూ మెచ్చుకునే అవకాశం లేదు. కనుక బీఆర్ఎస్‌తోపాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీపై కవిత విమర్శలు చేయడం సహజంగా భావిస్తున్నారు. అది కూడా.. ముఖ్యమంత్రిని ఒక కర్కోటకుడంటూ కవిత సంబోధించడం గమనార్హం. రాష్ట్రంలో హిట్లర్ గా వ్యవహరిస్తున్నారంటూ రేవంత్ పై విరుచుకపడ్డారు. బీజేపీ సామాజిక న్యాయానికి వ్యతిరేకమని, ఆ పార్టీ ఎంపీలు కేంద్రానికి కట్టుబానిసలంటూ మండిపడ్డారు.
కవిత మాటల్లో ‘నేను’ తప్ప ‘మేము’ లేదు
ఒక రాజకీయ పార్టీ అంటేనే సమిష్టి నిర్ణయాలకు ప్రతీకగా భావిస్తారు. కానీ, ఇటీవల ప్రాంతీయ పార్టీలు, వ్యక్తుల ప్రాధాన్యం పెరుగడంతో సమిష్టి నిర్ణయం స్థానంలో వ్యక్తుల నిర్ణయాలు పార్టీని ప్రభావం చేస్తోంది. ప్రాంతీయ పార్టీల్లో వ్యక్తుల ఆధిపత్యం పెరిగిపోయింది. అంతా తమ ఇష్టమనే అభిప్రాయం ఇప్పటికీ సాగుతోంది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోని బీఆర్ఎస్, టీడీపీ, జనసేన, వైఎస్సార్సీపీ పార్టీల్లో ఆ పార్టీ నేతలు కేసీఆర్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, జగన్ మాటే గీటు రాయిగా మారింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో శనివారం పుట్టిన కొత్త పార్టీ అయినప్పటికీ తొలి అంకంలోనే మేము కంటే నేనే అనే మాటకే కవిత ప్రాధాన్యం ఇవ్వడం ఆత్మవిశ్వాసం అనాలో, ప్రాంతీయ పార్టీల స్వభావానికి నిదర్శమని చెప్పాలో అంటూ కొందరు విమర్శించడం గమనార్హం. కవిత పార్టీ హామీల ప్రకటన, పార్టీ ప్రకటన, రాజకీయ విమర్శలన్నింటా ‘నేను’ మాటిస్తానున్నానంటూ తనను తాను ఆవిష్కరించుకునేందుకు కవిత తీవ్రంగా ప్రయత్నించడం విశేషం.
ఇక కవితక్క కాదు… ఇక కవితమ్మ
సాధారణంగా రాజకీయ పార్టీల నేతలను వారి వెంట ఉండే భజనపరులు, అనుచరులు ఆహా… ఓహో అంటూ పొగుడుతుంటారు. కానీ, ఇక్కడ కవిత మాత్రం తన రాజకీయ అనుభవంతోపాటు, కేసీఆర్ కుటుంబ సభ్యురాలిగా ఏ మాత్రం మోహమాటం లేకుండా తనను తాను ఆకాశానికెత్తుకునే యత్నం చేశారనే అభిప్రాయం వ్యక్తమైంది. తెలంగాణకు ‘అమ్మ’గా ఆవిష్కరించుకునే ప్రయత్నం చేశారు. పార్టీ ప్రకటనకు సిద్ధమైనప్పటి నుంచి ఆమె కట్టుబొట్టు కూడా మార్చింది. ఒక విధంగా తమిళనాడులో జయలలితను అనుకరించే ప్రయత్నం చేస్తున్నట్లు.. పురచ్చి తలైవీగా ఇక్కడ తనకు పేరున్నట్టు తనను తాను ప్రకటించుకున్నట్లు కవిత తీరు ఉందనే చర్చ సాగుతోంది. ప్రస్తుతం ఆమెను కవితక్కగా పిలిచేవారు కూడా ఇక నుంచి కవితమ్మగా పిలువాలని చెప్పకనే చెప్పారంటున్నారు. ఉద్యమంలో, టీఆర్ఎస్, బీఆర్ఎస్ లో తన పాత్రను గొప్పగా పేర్కొంటూనే తప్పులకు కేసీఆర్‌ను, ఆయన వెంట ఉన్నవారిని బాధ్యులుగా చేసిన కవిత.. వంద తప్పులకు తన ఒక్క ‘క్షమాపణ’ ప్రకటించారు. దీన్ని ఏ విధంగా తెలంగాణ ప్రజలకు స్వీకరిస్తారో భవిష్యత్తులోనే తేలనున్నది.
Read Also |
కవిత కొత్త పార్టీ టీఆర్ఎస్
కవిత పాంచజన్యం.. ఐదు హామీలు ఇవే!
గుడ్డు కాదు.. గాడిద గుడ్డూ కాదు.. ‘బంగారు గుడ్డు’ రహస్యాన్ని ఛేదించిన శాస్త్రవేత్తలు..
