Warangal Hanamkonda Merge | ఏది శాస్త్రీయం.. ఏది అశాస్త్రీయం! వరంగల్, హ‌నుమ‌కొండ జిల్లాల విలీన రాజకీయం!

తెలంగాణ (telangana )లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చర్చ జరిగిన జిల్లాల విభజన అంశం మళ్ళీ తెరపైకి వస్తోంది. దీనికి వరంగల్ జిల్లా కేంద్ర బిందువుగా మారింది. వరంగల్ జిల్లా ఏర్పాటు పట్ల వంద ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన జిల్లాల విభజన ప్రక్రియపై గతం నుంచి ఉన్న భిన్నవాదనల చర్చ తిరిగి ప్రారంభమైంది.

Warangal Hanamkonda Merge | ఏది శాస్త్రీయం.. ఏది అశాస్త్రీయం! వరంగల్, హ‌నుమ‌కొండ జిల్లాల విలీన రాజకీయం!

Warangal Hanamkonda Merge | విధాత ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణ (telangana )లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చర్చ జరిగిన జిల్లాల విభజన అంశం మళ్ళీ తెరపైకి వస్తోంది. దీనికి వరంగల్ జిల్లా కేంద్ర బిందువుగా మారింది. వరంగల్ జిల్లా ఏర్పాటు పట్ల వంద ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన జిల్లాల విభజన ప్రక్రియపై గతం నుంచి ఉన్న భిన్నవాదనల చర్చ తిరిగి ప్రారంభమైంది. తెలంగాణ ఏర్పాటు సమయంలో ఉన్న 10 జిల్లాలను 33 జిల్లాలుగా గత ప్రభుత్వం విభజించింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాను అత్యంత ‘దారుణం’గా ఆరు జిల్లాలుగా చీల్చివేసి పాత జిల్లాకు ఉన్న ఉనికిని, ప్రతిష్ఠను, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రశ్నార్థకం చేశారని పలువురు వాదిస్తున్నారు. ‘చారిత్రక’ వరంగల్ నగరాన్ని రెండుగా చీల్చారని సెంటిమెంట్‌తో కూడిన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలను అన్యాయంగా ఆరుగా విభజించారనే వాదనలో తప్పొప్పులను పక్కన పెడితే ప్రస్తుతం ఉనికిలో ఉన్న వరంగల్, హనుమకొండ జిల్లాలను (Warangal, Hanamkonda ) విలీనం చేయడమే పరిష్కారమంటూ కొందరు ముక్తాయింపు ఇస్తున్నారు. దీనివల్ల వరంగల్ నగరమంతా ఒకే జిల్లాలో భాగం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

తెరపైకి రెండు జిల్లాల విలీనం పరిష్కారమా?

తెలంగాణలో జిల్లాలను అశాస్త్రీయంగా, హేతుబద్ధత లేకుండా, ఇష్టానుసారం ఏర్పాటు చేశారని గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్‌ రెడ్డి విమర్శలు చేశారు. తాము అధికారంలోకి వ‌స్తే జిల్లాల విభ‌జ‌న‌పై స‌మీక్షిస్తామ‌ని ప్రకటించారు. ఈ క్రమంలోనే ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లాలో ఆరుకు బ‌దులు జిల్లాల సంఖ్య త‌గ్గుతుంద‌నే ఆశ కొందరిలో ప్రారంభ‌మైంది. ప్రధానంగా వరంగల్, హనుమకొండ జిల్లాలను విలీనం చేస్తారనే ప్రచారం కొనసాగిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హ‌యాంలో 2016 అక్టోబర్‌ 11న గతంలో ఉన్న 10 జిల్లాలో వరంగల్ జిల్లాను మాత్రమే ఆరు జిల్లాలుగా.. వ‌రంగ‌ల్ అర్బన్‌, వ‌రంగ‌ల్ రూర‌ల్‌, మహబూబాబాద్, జనగామ, ములుగు, భూపాలపల్లిగా విభ‌జించారు. వ‌రంగ‌ల్ రూర‌ల్ జిల్లాను ప్రక‌టించిన ఐదు సంవత్సరాల వరకు అంటే 2021 ఆగ‌స్టు వ‌ర‌కు జిల్లా కేంద్రంలేక రంగూ.. రూపులేకుండా పోయింది. తర్వాత కొద్ది మార్పులు చేర్పులు చేపట్టి వరంగల్ రూరల్ జిల్లాను వరంగల్ జిల్లాగా మార్పుచేసి, వరంగల్ తూర్పును జిల్లా కేంద్రంగా ప్రకటించారు. ఈ జిల్లాకు సంబంధించి అప్పుడూ, ఇప్పుడూ హ‌నుమ‌కొండ‌లోనే జిల్లా క‌లెక్టరేట్ ఏర్పాటు చేసి అక్కడి నుంచే పాల‌న కొనసాగిస్తున్నారు. పాత ఆజంజాహి మిల్లు స్థలంలో వరంగల్ జిల్లా కలెక్టరేట్ నిర్మాణ పనులు మాత్రం కొనసాగుతున్నాయి.

జిల్లాల విభజన శాస్త్రీయమేనా!?

నూతన జిల్లాల విభజన శాస్త్రీయంగా జరిగిందా? అనే ప్రశ్నతో పాటు ఏర్పాటుకు సంబంధించి భిన్నవాద‌న‌లున్నాయి. ఒక ప్రాతిప‌దిక అంటూ లేకుండా చేశార‌నే విమ‌ర్శలున్నాయి. స్థానికుల ఒత్తిడికి త‌లొగ్గి కొన్ని, త‌మ రాజ‌కీయ ప్రాధాన్యాల్లో మ‌రికొన్ని, నాయ‌కులు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ప్రాంతాల‌ను బ‌ట్టి ఇంకొన్ని జిల్లాలు ఏర్పాటు చేశారనే విమర్శలున్నాయి. ఇక కేసీఆర్ ల‌క్కీ నంబ‌ర్ ఆధారంగా జిల్లాల విభ‌జ‌న సాగింద‌నే ఆరోప‌ణ‌లున్నాయి. పూర్వ జిల్లాకు ఉండే వైభ‌వం, రాజ‌కీయ ఐక్యత లేకుండా విభ‌జించార‌నే విమ‌ర్శలున్నాయి. దీనిలో భాగంగానే వరంగల్ ను ఆరు జిల్లాలుగా చేయడం పైన చర్చ ఇప్పటికీ ఉంది. ప్రస్తుతం ఒక్కో నియోజకవర్గం మూడు జిల్లాల పరిధిలో ఉన్నాయి. వరంగల్, హనుమకొండ జిల్లాలను కలపడం వల్ల నగరమంతా ఒక్క జిల్లా పాలన కిందకు వస్తుందేగానీ, మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా వారసత్వం తిరిగి కొనసాగే అవకాశం ప్రస్తుతం లేదు. ఎందుకంటే ములుగు, జనగామ లాంటి జిల్లాల ఏర్పాటు కోసం ఆ ప్రాంతవాసులు రోడ్డెక్కి సాధించుకున్నారు. ఇప్పుడు ఆ జిల్లాలను విలీనం చేయాలని మాటవరుసకు ఎవరైనా అన్నా… తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యే ముప్పు పొంచిఉంది. మారుమూల ములుగు లాంటి ప్రాంతాల‌ను జిల్లాలుగా ప్రకటించడంతో ప్రజ‌ల‌కు పాల‌న అందుబాటులోకి వ‌చ్చి అభివృద్ధికి దోహ‌దం చేసింద‌నే వాద‌న ఉంది. ఈ నేపథ్యంలో కొందరి ‘విలీనం’ మరి కొందరి అస్థిత్వ ప్రశ్నగా మారింది. ఈ సున్నిత సమస్యను ఎజెండాపైకి తేవడమంటే కొరివితో తలగొక్కోవడమేనంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ విభజనను సమీక్షిస్తే ప్రయోజనముంటుందేమోగానీ, ఉమ్మడి జిల్లాల వారీగా చర్చిస్తే.. కొందరు వద్దని, కొందరు కావాలని స్థానికంగా విభేదాలు తలెత్తే అవకాశం ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

వరంగల్ ప్రాంత అభివృద్ధికి చాన్స్‌?

వరంగల్, హనుమకొండ ప్రాంతాలు ఒకే జిల్లా కింద ఉన్నప్పుడు కూడా వరంగల్ ప్రాంతం తగినంత అభివృద్ధికి నోచుకోలేదనేది బహిరంగ సత్యం. ఇప్పటికీ హనుమకొండ, వరంగల్ ప్రాంతాల మధ్య క్లాస్, మాస్ వివక్ష కొనసాగుతోందనే వాదనలు ఉన్నాయి. కొందరు వరంగల్‌కు వ్యాపార కేంద్రం, మార్కెట్లు ఉన్నాయంటూ కితాబిస్తున్నప్పటికీ తేడా ఉందనేది అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వరంగల్, హనుమకొండ రెండు ప్రాంతాలకు చెందిన వారు కోరుకుంటే జరిగే విలీనాన్ని ఒక్క హనుమకొండ వాసులు మాత్రమే కోరుకోవడం వల్ల ప్రయోజనం లేదంటున్నారు. ఇదిలా ఉండగా జిల్లాల విభజన జరిగిన ఇన్నేండ్లకు మళ్ళీ కొత్త చర్చలెందుకనీ, రెండు జిల్లా కేంద్రాలుగా, ఒకే నగరంగా అభివృద్ధి చెందితే నష్టమేంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. జిల్లాల అంశం పై రాజకీయ నాయకత్వమే రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తోందనీ, నాయకులకు, ప్రజాప్రతినిధులకు కూడా స్పష్టతలేదనే విమర్శలున్నాయి. దీంతో ఆధిపత్యం, నోరున్నోనిదే మాటనెగ్గుతోందనే చర్చ సాగుతోంది. ప్రస్తుతం వరంగల్ ప్రాంతం జిల్లా కేంద్రంగా ప్రకటించారు. అయినప్పటికీ జిల్లా కలెక్టరేట్, కార్యాలయాల తరలింపు, జరుగాల్సిన అభివృద్ధి ప్రక్రియ జాప్యమవుతున్నది. ఒక్క కలెక్టరేట్ భవన నిర్మాణం మాత్రమే సాగుతోంది. కొంత ఆలస్యమైనప్పటికీ వరంగల్ జిల్లా కేంద్రంగా మారినందున పురోగతి సాధిస్తుందనే అభిప్రాయం ఉంది. ‘లేబర్ ఏరియా’ అంటూ ఈ ప్రాంతం పట్ల ఉన్న చిన్న చూపు తొలిగిపోతుందని, అందుకే హనుమకొండ కేంద్రంగా రెండు జిల్లాల ‘విలీన’ రాజకీయం పట్ల అభ్యంతరం వ్యక్తమవుతోంది. నిజంగా రెండు జిల్లాలుగా విలీనం చేయాల్సిన పరిస్థితి తలెత్తితే ఇంతకాలం సర్కారు కార్యాలయాలకు, యూనివర్సిటీ, ఎన్ఐటీ, కేఎంసీ ఇతర ఉన్నత విద్యాసంస్థలకు, చివరికి సర్కారు కాంప్లెక్సులు, స్టేడియం తదితర సౌకర్యాలపట్ల సాగిన నిర్లక్ష్యాన్ని తొలగించేందుకు వరంగల్ ప్రాంతంలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలేమిటో తేల్చాలని ముందస్తు షరతు విధిస్తున్నారు. హనుమకొండ, వరంగల్ జిల్లాలను విలీనం చేస్తే హనుమకొండ కలెక్టరేట్‌ను ఇతర అవసరాలకు వినియోగించి, వరంగల్ ప్రాంతంలో నిర్మించే కొత్త జిల్లా కలెక్టరేట్ నుంచి పాలన సాగించేందుకు ఒక్క నగరమంటూ సెంటిమెంట్ మాటలు మాట్లాడే విలీనవాదులు ముందుకు వస్తారా? అంటూ సూటిగా ప్రశ్నిస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

Goa Beach | గోవాలో బీచ్‌ల్లో మ‌ద్యం సేవించ‌డంపై నిషేధం..!
Telangana BRS MLA Defection Case | సుప్రీంకోర్టు తీర్పుపై బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల భిన్న స్పందనలు
Kaleshwaram Commission| ప్రభుత్వానికి అందిన కాళేశ్వరం కమిషన్ తుది నివేదిక