Telangana Welfare Schemes | సంక్షేమ పథకాలు మింగేస్తున్న సర్కారీ ఉద్యోగులు.. 37వేల మంది గుర్తింపు!
దోచుకునేందుకు అలవాటు పడినవాళ్లు.. సిగ్గు, లజ్జ వంటివాటిని అస్సలు పట్టించుకోరు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల్లో సుమారు 37వేల మంది ఇలా కక్కుర్తి పడుతూ.. చేయూత పెన్షన్లు, ఉపాధి హామీ, ఇందిరమ్మ ఇళ్లు తదితర పథకాల్లో లబ్ధిదారులుగా ఉన్నారని తేలిందని సచివాలయ వర్గాలు చెబుతున్నాయి.
- దారిద్య్రరేఖకు దిగువున ఉన్నవారికోసం ఉద్దేశించిన పథకాలు
- కానీ.. పెద్ద సంఖ్యలో ఉద్యోగులకు పింఛన్లు, ఇళ్లు, ఉపాధి నిధులు
- వీబీ జీ రామ్ జీలోనూ కైంకర్యాలు!
Telangana Welfare Schemes | సంక్షేమ పథకాలు! దారిద్య్రరేఖకు రేఖకు దిగువన ఉన్న పేద ప్రజల ఉన్నతికోసం, వారికి ఆసరా కోసం అమలు చేస్తున్న పథకాలు! ఉద్యోగాల్లో ఆమ్యామ్యాలకు అలవాటు పడిన కొందరు ప్రభుత్వ ఉద్యోగులు సైతం పందికొక్కుల్లా వీటిని సైతం స్వాహా చేస్తున్నారని ప్రభుత్వం దృష్టివచ్చినట్టు సమాచారం. పేద ప్రజలకు అందాల్సిన డబ్బులను జంకు గొంకు లేకుండా నిర్లజ్జగా తీసుకుంటున్నారని తెలిసింది. చేయూత, ఇందిరమ్మ ఇళ్లు, ఉపాధి హామీ (వీబీ జీ రామ్ జీ) తదితర పథకాల లబ్ధిదారుల్లో ఒకరు కాదు వంద కాదు.. ఏకంగా 37వేల మంది వరకు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నట్లు తేలింది. ప్రభుత్వం గత నాలుగు నెలలుగా సర్కార్ ఉద్యోగులు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలకు ఆధార్ అనుసంధానం చేసేంది. ఈ అనుసంధానంతో ప్రభుత్వ ఉద్యోగుల బండారం బట్టబయలైందని సెక్రటేరియట్ వర్గాలు చెబుతున్నాయి.
ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు, గౌరవ వేతనం పొందేవారి లెక్కలు తేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వీరి సంఖ్య తేల్చేందుకు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి నేతృత్వంలో కమిటీని గత జూలై నెలలో నియమించారు. ఈ కమిటీలో సాధారణ పరిపాలనా విభాగం (జీఏడీ) కార్యదర్శి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, మాజీ ఐఏఎస్ ఎన్ శివ శంకర్ సభ్యులుగా ఉన్నారు. అన్ని ప్రభుత్వ విభాగాలు, కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థలు, విశ్వ విద్యాలయాలలో సిబ్బంది హోదాను పరిశీలించేందుకు ఈ కమిటీని నియమించారు. ప్రభుత్వం అనుమతించిన అన్ని రకాల తాత్కాలిక సేవలకు సంబంధించి, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, గౌరవ వేతన, దినసరి వేతన ఉద్యోగులకు సంబంధించి అధ్యయనాన్ని కమిటీ నిర్వహిస్తున్నది. ఈ క్రమంలోనే ప్రతి ఉద్యోగి వివరాలను ఆధార్‌తో అనుసంధానం చేయాలని సర్క్యులర్ జారీ చేసింది. ప్రతి నెలా కొద్ది మంది చొప్పున మొత్తం నాలుగు లక్షల మంది వరకు ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు తమ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. అక్టోబర్ నాటికి మొత్తం త్రిసభ్య కమిటీకి అందిన వివరాల ప్రకారం ఒక లక్ష మంది బోగస్ ఉద్యోగులు ఉన్నట్లు వెల్లడి అయ్యింది. ఒక లక్ష మంది ఉద్యోగుల మూలంగా గడచిన దశాబ్ధకాలం బీఆర్ఎస్ ఏలుబడిలో సంవత్సరానికి రూ.1,500 కోట్ల చొప్పున మొత్తం రూ.15వేల కోట్లు తెలంగాణ ప్రభుత్వం నష్టపోయినట్లు స్పష్టమైందని సమాచారం. ఈ మొత్తాన్ని ప్రభుత్వ విభాగాల అధిపతులు, ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలు, మ్యాన్ పవర్ కంపెనీలు కూడబలుక్కుని మింగినట్లు తేలిందని చెబుతున్నారు. ఈ కుంభకోణంలో అప్పటి బీఆర్ఎస్ బడా నాయకుల ప్రమేయం ఉన్నట్లు ప్రభుత్వం అనుమానిస్తున్నదని సమాచారం..
వేతనాల బిల్లులకు, క్షేత్రస్థాయిలో పనిచేసే వారికి మధ్య భారీ తేడాలు గమనించిన రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు నవంబర్ నెలలో ఆదేశించింది. కొన్ని జిల్లాల్లో ప్రభుత్వ సర్వీసులో ఉన్నవారే బినామీలుగా కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నట్లు వెలుగు చూసిందని సచివాలయ వర్గాలు తెలిపాయి. పలువురు విభాగాల అధిపతులు తప్పుడు లెక్కలు చూపించి సర్కార్ సొమ్మును మింగినట్లు వెల్లడైందని చెబుతున్నాయి. రికార్డుల్లో కాంట్రాక్టు ఉద్యోగులుగా ఉన్నా, క్షేత్రస్థాయిలో వారి జాడ కన్పించకపోవడం కూడా విచారణాధికారులను విస్మయానికి గురిచేసింది. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు తో పాటు ప్రభుత్వ ఉద్యోగులు ఆన్‌లైన్‌లో నమోదు చేసిన వివరాలన్నింటినీ ప్రభుత్వం విజిలెన్స్ విభాగానికి పంపించింది. ఈ డాటా ఆధారంగా మొత్తం కూపీ లాగడంతో గుట్టు రట్టు అయ్యిందని విశ్వసనీయవర్గాల సమాచారం.
వేలాది మంది సర్కార్ ఉద్యోగులు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలలో లబ్ధిదారులుగా ఉన్నట్లు వెల్లడైందని తెలుస్తున్నది. ప్రభుత్వం నుంచి ప్రతి నెలా వేతనాలు పొందుతూ, సామాజిక ఫించన్లు పొందుతున్నారని సమాచారం. ఉపాధి హామీ పథకం కింద వచ్చే సొమ్మును కూడా వదిలేయకుండా తమ ఖాతాలలో వేసుకుంటున్నారని అంటున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం కూడా దరఖాస్తు చేసుకుని ప్రభుత్వం ఇచ్చే సొమ్మును తీసుకున్నవాళ్లు కూడా ఉన్నారని ఒక అధికారి వెల్లడించారు. ఇలా సుమారు 37వేల మంది సర్కార్ ఉద్యోగులు లబ్ధి పొందినట్లు రికార్డుల్లో వెల్లడైందని ఆయన తెలిపారు. అయితే ఔట్ సోర్సింగ్, గౌరవ వేతనం పొందేవారికి సంక్షేమ పథకాలు అమలు చేయాలా లేదా అనే దానిపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయం పై ఆధారపడి ఉంది.
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హుజూరాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో గెలుపొందేందుకు దళిత బంధు పథకాన్ని పూర్తి సబ్సిడీతో అమలు చేశారు. ఎంపికైన లబ్ధిదారుడికి రూ.10 లక్షల చొప్పున అందచేశారు. ఈ పథకం కోసం ప్రభుత్వ ఉద్యోగులు కూడా అర్హులేనని కేసీఆర్ ప్రకటించడంతో, పలువురు ఉద్యోగులు దరఖాస్తు చేసుకుని లబ్ధి పొందారు. పేద దళితుల కోసం అమలు చేయాల్సిన పథకాన్ని ఆ వర్గంలోని ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వర్తింపచేయడం కేసీఆర్‌కే చెల్లుబాటు అయ్యిందంటూ అప్పట్లో విమర్శలు కూడా వచ్చాయి. కఠిన నిబంధనలు అమలు చేయాల్సిన కేసీఆరే, నిబంధనలు రద్ధు చేసి తప్పు చేస్తే శిక్షించేవారు ఎవరనే ప్రశ్నలు అప్పట్లో తలెత్తాయి. మరి ఇప్పుడు ఈ మొత్తం అధికారులపై ఎలాంటి చర్యలు ఉంటాయన్నది ఉద్యోగ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
Read Also |
Elevated Corrdors | హైదరాబాద్ నగరం నడిబొడ్డు నుంచి ఔటర్ వరకు కొత్తగా ఫ్లైఓవర్లు
Panaji Hyderabad Highway | ఆ రహదారి పూర్తయితే పనాజీకి ప్రయాణం ఏడు గంటల్లోనే!
IRCTC Best Package | మిస్టికల్ కశ్మీర్ న్యూ ఇయర్ స్పెషల్ ట్రిప్.. 35550 మాత్రమే
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram