Explained | ఓరుగల్లుపై ప్రకృతి కన్నెర్ర వెనుక ఎవరి పాపం ఎంత!
వరంగల్ నగరంపై కుంభ వృష్టి కురవడానికి కారణాలేంటనే శోధన జరుగాల్సి ఉంది. భీమదేవర పల్లిలో 41 సెంటీమీటర్ల వర్షం పాతం, వరంగల్, ఖిలావరంగల్, సంగెం, మామునూరు తదితర ప్రాంతాల్లో 33 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం గమనార్హం. మొంథా తుపాన్ ప్రభావమే కాకుండా గతంలోనూ వరంగల్ నగరంపై క్లౌడ్ బరస్ట్ జరిగింది. గత ఏడాది కొండాయి, మోరంచ పల్లిలో జరిగిన విపత్తు తెలిసిందే. మేడారం అడవుల్లో దాదాపు లక్ష వృక్షాలు నేలపాలైన సంఘటన, మధ్యలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్న సంఘటనలు దేనికి సూచికలో శాస్త్రీయ పరిశోధన జరుగాల్సి ఉంది.
విధాత ప్రత్యేక ప్రతినిధి:
Explained | వరద ముంపుకు వరంగల్ నగరం కేరాఫ్‌గా మారిపోయింది. ఏటా మూడు పర్యాయాలు నిండా ముంచుతున్న వరదలతో నగర ప్రజల జీవనం తలకిందులవుతోంది. చెమటోడ్చి సమకూర్చుకున్న సకల వస్తువులు అకాల వర్షాలకు, అంచనాలేని వరదలకు సమర్పిస్తూ కన్నీటిపర్యంతమవుతున్నారు. పాలకులు మారి, పార్టీలు మారి, ప్రభుత్వాలు మారి, ప్రజాప్రతినిధులు మారినా అతలాకుతలమవుతోన్న బతుకులకు ఓ దారి చూపెట్టలేకపోతున్నారు. వరదముంపునకు గురైన సందర్భంలో ప్రజాప్రతినిధుల ఏరియల్ వ్యూలు, పరామర్శలు, అధికారుల పర్యటనలు, హడావుడి, హంగామా ఆ మూడు రోజులు ఎక్కడలేని ప్రేమను ఒలకబోస్తున్నారు. ఆ తర్వాత అంతా గప్ చిప్ అన్నట్లుగా మారిపోతోంది. ఈ సంవత్సరం ఇప్పటికే మూడు పర్యాయాలు వరంగల్ నగరం నిలువెత్తు వరద ముంపునకు గురైంది. నిన్నటికి నిన్న గురువారం విరుచుకుపడిన మొంథా తుఫాన్ సృష్టించిన కల్లోలం నుంచి ఇంకా నగరం తేరుకోలేదు. పేద, మధ్య తరగతి వర్గాలు వరదకు సమస్తం సమర్పించుకుని కట్టుబట్టలతో మిగిలిపోయారు. ఈ ఒక్కసారితో పోతుందా? అంటే లేదనేది తేలిపోయింది. ఇదే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం నాటి పర్యటనలో స్పష్టం చేశారు. ఆకస్మిక వరదలు, అంచనాకు మించిన వర్షాలు, క్లౌడ్ బరస్ట్‌లు రానున్న రోజుల్లో సాధారణంగా మారుతాయని, దీనికి తగిన విధంగా మన ప్రణాళికలు లేకుంటే పరిష్కారం లభించదని తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో వరంగల్ నగరం ఇప్పుడు ఎదుర్కొంటున్న ఈ దుస్థితికి కారణాలేంటనే చర్చ ఇప్పుడు తీవ్రంగా సాగుతోంది.
ప్రతీ ఏటా వరద ముంపు కామన్
ప్రతియేటా వర్షాకాలం వచ్చిందంటే ‘ది గ్రేటర్ వరంగల్ నగరం’ వరదముంపునబారిన పడుతోంది. రాజకీయ పార్టీల నేతలు, ప్రజాప్రతినిధులు, అధికారుల మాటలు కోటలు దాటుతున్నాయి. ఆచరణాత్మక అభివృద్ధి మాత్రం అంగుళం కదలడంలేదు. దీంతో ప్రతీ సంవత్సరం వర్షకాలం వచ్చిందంటే లోతట్టు ప్రాంతాలవాసులు, గుడిసెవాసులు, స్లమ్ లలో నివసించే వారూ అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఇక భారీ, అతిభారీ వర్షాలు కురిసిన సందర్భంలో నగరం పూర్తిగా జలదిగ్బంధానికి గురవుతోంది. అభివృద్ధికి ప్రతీకగా అభివర్ణించే కాలనీలకు సైతం వరద ముంపు తప్పడంలేదు. ప్రతీ సంవత్సరం వేలాది ఇండ్లు నీటమునుగుతున్నాయి. నగర జనం ఆస్త నష్టం చవిచూస్తున్నారు. అయినప్పటికీ నగర జీవనంలో మార్పులేదు. వరంగల్ నగర ప్రజలకు వర్షాల నుంచి రక్షణ ఉందా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే ప్రధాన రహదారులు సైతం జలమయమై ఆవే వాహనాలు రోడ్లపై తేలుతున్నాయి. ప్రధాన రోడ్లపైన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది బోట్లు తిప్పే దృశ్యాలను వరంగల్ వాసులు అనుభవించారు.
రాష్ట్రమొచ్చినా రాత మారలేదు
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోనైనా దశ దిశ మారుతుందని ఆశించినప్పటికీ పరిస్థితిలో పెద్దగా మార్పులేదు. వరంగల్ నగరాన్ని డల్లాస్ చేస్తామంటూ ప్రకటించిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తొమ్మిదేళ్ళకు పైగా అధికారంలో ఉన్నప్పటికీ డల్లాస్ సంగతేమోగానీ, కనీస డ్రైనేజీ వ్యవస్థను ప్రక్షాళన చేయలేదనే ఆగ్రహం నగరవాసుల్లో ఉంది. బీఆర్ఎస్ పాలనలో నగరం నిండా మునిగితే అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ హెలికాప్టర్ పర్యటనలు చేసి నగర రక్షణకు తక్షణ చర్యలన్నప్పటికీ ఆ తర్వాత పట్టించుకున్న పాపాన పోలేదు. ఆఖరికి అధికారం కోల్పోయారు. వర్షాలు కురిసినపుడు చెబుతున్న మాటలకు తర్వాత ఎలాంటి ప్రణాళిక లేక పోవడంతో పరిస్థితిల్లో మార్పు కనిపించడంలేదు.
పెరుగుతున్న నగరం పేరుకుపోయిన సమస్యలు
రెండవ రాజధానిగా చెప్పుకొనే వరంగల్.. అభివృద్ధిలో పురోగతి సాధించడంలేదు. గ్రేటర్ వరంగల్ సిటీ దాదాపు 407 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. పాత మున్సిపల్ ప్రాంతానికి 42 గ్రామాల విలీనంతో గ్రేటర్ వరంగల్‌గా రూపాంతరం చెందింది. వరంగల్ సిటీలో దాదాపు 2.25 లక్షల ఇండ్లుండగా ఇందులో సుమారు 11 లక్షల జనాభా వరకు నివసిస్తోంది. దీనికి తోడు నిత్యం నగరానికి వచ్చీపోయే వారి సంఖ్య వేలల్లో ఉంటోంది. గ్రేటర్ వరంగల్లో చిన్నా,పెద్దా కలిసి 1,450 వరకు కాలనీలు ఉన్నాయి. ఇందులో 183 స్లమ్ ఏరియాలున్నట్లు అధికారులు చెబుతున్నారు. వరంగల్ నగరం రోజురోజుకు జెట్ స్పీడ్‌తో విస్తరిస్తోంది. విద్యా, వైద్య, ఉపాధి అవకాశాల నేపథ్యంలో గ్రామాలనుంచి వలసలు పెరగడంతో కూడా నగర జనాభా పెరుగుదలకు కారణమవుతున్నది.
డ్రైనేజీ వ్యవస్థ అస్థవ్యస్థం
వరంగల్ నగరంలో 53.3 కిలోమీటర్ల ప్రధాన డ్రైనేజీలు, 1,433.02 కిలోమీటర్ల మేర సాధారణ డ్రైన్లు, 51 కిలోమీటర్ల వరకు మీటర్ వెడల్పు బాక్సు డ్రైన్లు ఉన్నాయి. మొత్తం 882.21 కిలోమీటర్ల వరకు పక్కా డ్రైన్లు, 344.27 కిలోమీటర్ల మేర కచ్చా డ్రైన్లు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇంత డ్రైనేజీ వ్యవస్థ ఉందని చెబుతున్నప్పటికీ నగరంలో సగానికి పైగా కాలనీలూ, ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థేలేదంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. ఉన్న డ్రైనేజీ వ్యవస్థ కూడా యేండ్ల క్రితం నిర్మించినవి కావడం గమనార్హం. అప్పటి పరిస్థితికి ఇప్పటి పరిస్థితికి పొంతలేకపోవడంతో కాలం చెల్లిన డ్రైనేజీలు ఇరుకుగా మారాయి. చిన్న వర్షం కురిసినా.. పొంగిపొర్లుతున్నాయి. కాలనీలను వరదతో ముంచెత్తుతున్నాయి. వర్షం నీరు, మురుగు నీరు కలిసి జనాన్ని చుట్టుముడుతున్నాయి. అర్ధరాత్రి అపరాత్రి అనే తేడా లేకుండా కాలనీల్లోకి, ఇళ్ళల్లోకి నీరు చేరి వస్తువులను, ఆహార పదార్ధాలను నాశనం చేస్తున్నాయి. ప్రతీ యేటా ఇదో తంతుగా మారింది. కాంక్రీట్ జంగిల్‌గా మారిన నగరానికి వర్షాకాలం వస్తే కనీస రక్షణలేకుండా పోతోంది.
జల దిగ్భంధానికి పలు కారణాలు
కర్ణుని చావుకు అనేక కారణాలున్నట్లు వరంగల్ నగరం జలదిగ్బంధంలో చిక్కుకోవడానికి అనేక కారణాలున్నాయి. పెరుగుతున్న నగర విస్తీర్ణం, ఇబ్బడి ముబ్బడిగా వెలుస్తున్న కాలనీలు, ప్రణాళిక లేకుండా సాగుతున్న అభివృద్ధి, పెరిగిన జనాభా వినియోగిస్తున్న నీటికి తగిన విధంగా డ్రైనేజీల నిర్మాణం చేపట్టకపోవడం, నగరమంతా నాలాలు ఆక్రమణకు గురికావడం, వర్షం నీరు, మురుగు నీటి పారుదలపై ప్రత్యేక ప్రణాళిక లేక పోవడంతో వరద ముంపు సమస్య తీవ్రమవుతోంది. ఒక గల్లీలోనే నిర్మించిన డ్రైనేజీల మధ్య సమన్వయం లేక పోవడంతో మురుగు నీటిపారుదల వ్యవస్థ ప్రశ్నార్ధకంగా మారుతోంది. కురిసేవర్షానికి తగిన విధంగా నీటిపారుదల వ్యవస్థ, వర్షపునీటినిల్వ రిజర్వాయర్లు లేక పోవడం వరదను బ్యాలెన్సు చేసే చెరువులు, కుంటలు పూర్తిగా కబ్జాలపాలై నామారూపాలు లేకుండా పోవడం ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఇక కురిసే వర్షం నీటిని ఒడిసిపట్టుకునే కార్యాచరణ కరువైందంటున్నారు. దీంతో సగటు వర్షపాతంతో పాటు ఆకస్మికంగా భారీ వర్షాలుకురిస్తే నీరంతా రోడ్లకెక్కుతున్నాయి. వీటన్నింటికీ తోడు కిందా, పైన కాంక్రీట్‌గా మారడంతో భూమిలోకి నీరు ఇంకిపోయే పరిస్థితి కరువైంది. ఫలితమే ఈ విధ్వంసం.
కుండపోతకు కారణాలేంటి?
వరంగల్ నగరంపై కుంభ వృష్టి కురవడానికి కారణాలేంటనే శోధన జరుగాల్సి ఉంది. భీమదేవర పల్లిలో 41 సెంటీమీటర్ల వర్షం పాతం, వరంగల్, ఖిలావరంగల్, సంగెం, మామునూరు తదితర ప్రాంతాల్లో 33 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం గమనార్హం. మొంథా తుపాన్ ప్రభావమే కాకుండా గతంలోనూ వరంగల్ నగరంపై క్లౌడ్ బరస్ట్ జరిగింది. గత ఏడాది కొండాయి, మోరంచ పల్లిలో జరిగిన విపత్తు తెలిసిందే. మేడారం అడవుల్లో దాదాపు లక్ష వృక్షాలు నేలపాలైన సంఘటన, మధ్యలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్న సంఘటనలు దేనికి సూచికలో శాస్త్రీయ పరిశోధన జరుగాల్సి ఉంది. చెట్టు, పుట్ట, గుట్టలు మాయం, వాగుల్లో, నదుల్లో ఇసుక మాయం, భూగర్భంలో బొగ్గు తదితర ఖనిజాల తవ్వకాలు, గోదావరి పై భారీ నీటి నిల్వలతో బ్యారేజీల నిర్మాణం తదితర అనేక అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉందంటున్నారు నిపుణులు.
గొలుసుకట్టు చెరువులు గోవిందా!
వరంగల్ నగరంతో పాటు చుట్టుపక్కల కాకతీయులు ఎంతో దూర దృష్టితో నిర్మించిన గొలుసుకట్టు చెరువులు కబ్జాదారులకు కాసుల వర్షం కురిపించాయనే ఆరోపణలు ఉన్నాయి. పదుల సంఖ్యలో చెరువులు, కుంటలు ఇప్పుడు జనావాసాలుగా మారిపోయాయి. వర్షం నీటిని, వరదను తమ కడుపులో నింపుకుని ‘కావాల్సినంత’ బయటికి పంపే చెరువులు, కుంటలు కబ్జాలపాలవుతున్నందున వరద ముంపు పెరుగుతోంది. మామునూరు, అమ్మవారి పేట, బెస్తం చెరువు, ఉర్సు చెరువు నుంచి నాలాల ద్వారా బొందివాగు నుంచి భద్రకాళిలోకి నీరు చేరేది. మడికొండ నుంచి వడ్డేపల్లి చెరువు ద్వారా చినవడ్డెపల్లి వరకు ఉన్న డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నమైంది. మీరాసాబ్ కుంట కోట చెరువు, అగర్తాల మీదుగా కాశికుంట, శాకరాసికుంట మీదుగా ఒకవైపు మరోవైపు అబ్బనికుంట శివనగర్ మీదుగా పెరుకవాడ మీదుగా మరో వైపు 12 మోరీల వరకు చేరే వరద నీరు ఇప్పుడు అస్తవ్యస్థంగా మారింది. కాశిబుగ్గ, పోచమ్మమైదాన్, ఎనుమాముల చెరువు, చినవడ్డేపల్లి, కోట చెరువులు నామ మాత్రంగా మారాయి. వీటన్నింటికి తల్లిలా మారిన భద్రకాళి చెరువు కబ్జా చెరువును కుదించి చుట్టూ ట్యాంక్ బండ్ నిర్మాణం చేసి అందాలొలికించేందుకు సిద్ధమవుతున్నారు. సహజ సిద్ధంగా పారే వరద నీటిని సరైన రీతిలో మళ్ళించకపోవడంతో నగరాన్ని ముంచెత్తుతోంది.
వరంగల్ రక్షణకు ప్రణాళిక ఉందా?
వరంగల్ నగర డ్రైనేజీ వ్యవస్థ, మురుగునీరు, వరద నీరు, నాలాలు, చెరువులు, కుంటలు, వేసవి రిజర్వాయర్లతో సహా నగరంపై శాస్త్రీయ అవగాహనకు వచ్చేందుకు ఇప్పటి వరకు కనీస అధ్యయనం, సర్వే జరుగలేదు. రాజకీయ పలుకుబడితో యథేచ్చగా సాగుతున్న కబ్జాలతో ప్రజాప్రతినిధులు, అధికారులు కాసులు దండుకుంటున్నారు. ఎఫ్‌టీఎల్‌లో అక్రమ నిర్మాణాలు భారీగా చేస్తూ తమ బొజ్జలు నింపుకుంటున్నారు. గత మూడు దశాబ్దాలుగా ఒక క్రమ పద్ధతిలో సాగిపోయినా అక్రమాల ఫలితంగా ఇప్పుడు నగరంలో నీటి నిల్వా చేసుకునే చిన్న కుంట కూడా మిగిలే పరిస్థితి లేకుండా పోయింది. ఇప్పటికైనా దీర్ఘకాలిక దృష్టితో నగరంలో మురుగు నీరెంత? సాధారణ వర్షం కురిస్తే, భారీ వర్షాలు కురిస్తే ఎన్ని క్యూసెక్కుల వరద వస్తోంది? వీటి నియంత్రణ, సమతుల్యం చేస్తూ బయటికి పంపించడం ఎలా? ప్రస్తుతం ఉన్న నాలాల సామర్ధం, భవిష్యత్ అవసరాలకు తగిన విధంగా మార్పులు చేయడం తదితర శాస్త్రీయ ప్రణాళిక రూపొందించి అమలు చేయకుండా కంటితుడుపు చర్యలెన్ని చేపట్టినా పరిష్కారం లభించదని అంటున్నారు. దీనికి తోడు వరంగల్ నగర వరద సమస్యకు ఒక పరిష్కారంగా అండర్ డ్రైనేజీ నిర్మాణం లేక పోవడం కారణమంటున్నారు. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వరంగల్ నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ. 4170 కోట్లతో వరంగల్ నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను త్వరగా ప్రారంభించడానికి చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ పథకం అమలైతే కొంత సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆశతో ప్రజలు ఉన్నారు. భవిష్యత్తు తరాలకు తగిన స్థాయిలో నగరంలో అభివృద్ధి పనులు చేపట్టకుంటే ఈ ముంపు శాశ్వతంగా మారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
India Climate Change | శత్రువులా తయారవుతున్న రుతుపవనాలు.. కారణం ఇదే?
Odisha Cyclones Explained | ఒడిశాకు తుఫాన్ల ముప్పు ఎందుకు ఎక్కువ?
Southwest Monsoon | రుతుపవనాల నిర్దిష్ట అంచనా వ్యవస్థకు ఎన్నేళ్లు పట్టిందో తెలుసా?
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram