స్టాన్ స్వామిని చంపిందెవరు?
విధాత:84 సంవత్సరాల వయసు విశ్రాంతిని కోరుకొంటుంది. విరామాన్ని కోరుకొంటుంది. పని నుండి విరమణ కోరుకొంటుంది. కానీ స్టాన్ స్వామి అవేమీ కోరుకోలేదు. చివరివరకూ ఆదివాసీల మధ్యనే పని చేయనియ్యమని కోరుకొన్నారు. ఆదివాసుల మధ్యనే మరణించే అవకాశం ఇవ్వమని కూడా కోర్టులో కోరారు. అతని వృద్దాప్యం, పార్కింగ్ సన్స్ జబ్బు -అతని అరెస్టుని ఆపలేకపోయాయి. జైల్లో అతనికొచ్చిన కోవిడ్, కోవిడ్ అనంతర పరిణామాలు కూడా అతనికి బెయిల్ నివ్వలేకపోయాయి. ఎందుకంటే అతను ప్రభుత్వం దృష్టిలో కరడు కట్టిన నేరస్తుడు. […]

విధాత:84 సంవత్సరాల వయసు విశ్రాంతిని కోరుకొంటుంది. విరామాన్ని కోరుకొంటుంది. పని నుండి విరమణ కోరుకొంటుంది. కానీ స్టాన్ స్వామి అవేమీ కోరుకోలేదు. చివరివరకూ ఆదివాసీల మధ్యనే పని చేయనియ్యమని కోరుకొన్నారు. ఆదివాసుల మధ్యనే మరణించే అవకాశం ఇవ్వమని కూడా కోర్టులో కోరారు.
అతని వృద్దాప్యం, పార్కింగ్ సన్స్ జబ్బు -అతని అరెస్టుని ఆపలేకపోయాయి. జైల్లో అతనికొచ్చిన కోవిడ్, కోవిడ్ అనంతర పరిణామాలు కూడా అతనికి బెయిల్ నివ్వలేకపోయాయి. ఎందుకంటే అతను ప్రభుత్వం దృష్టిలో కరడు కట్టిన నేరస్తుడు. బయట ప్రపంచంలో అతని ఉనికి -హిందుత్వ రాజ్య ఉనికికి అత్యంత ప్రమాదకరం. దాని కార్పొరేట్ల సావాసానికి ప్రమాదం. నాడీ వ్యవస్థని అస్తవ్యస్తం చేసి, కదలికలను నియంత్రించి, ఒక్కొక్క ఇంద్రియాన్ని పని చేయనీయకుండా చేసే పార్కర్ సన్స్ వ్యాధితో ఉన్న స్టాలిన్ స్వామిని చూసి, ప్రభుత్వం గడగడలాడి జైలు ఊచల మధ్య బంధించేటంతటి ఆయన నేరం ఏమిటి?
ఫాదర్ స్టాన్ లౌర్డుస్వామి ఒక రోమన్ కాథలిక్ పూజారి. ‘ద సొసైటీ ఆఫ్ జీసస్’ సభ్యుడు. ఈ సభ్యులను జెసూట్స్ అంటారు. విద్య, పరిశోధన, సాంస్కృతిక రంగాల్లో పని చేస్తారు. అట్టడుగు వర్గాలు ఏ సహజ వనరుల మీద జీవిస్తున్నారో వాటి దోపిడీకి వ్యతిరేకంగా; వారి రాజ్యాంగ హక్కులు, మానవ గౌరవాలను రక్షించటానికీ ప్రపంచవ్యాప్తంగా జెసూట్స్ పని చేస్తారు. బహుశా స్టాన్ స్వామి దేవుడి స్థానంలో ఆదివాసీలను ఉంచుకొన్నాడేమో. అందుకే ప్రభుత్వానికి అంత ప్రమాదకారి అయ్యాడు. ప్రజాసేవే దేవుడి సేవ అనుకొని -గోవాను పెట్టుబడిదారులకు అమ్మదలచిన ప్రభుత్వ ప్రయత్నాన్ని అడ్డుకొన్న గోవా యాక్టివిస్ట్ ప్రీస్ట్ బిస్మార్కు డయాస్ కూడా 2015లో కార్పొరేట్ గుండాల చేతిలో హత్యకు గురి అయ్యాడు. ఇప్పుడు ఇంకో ప్రీస్ట్ జాన్ దయాళ్ తో సహా ఎంతోమంది క్రైస్తవ పూజారులు హిందుత్వ వ్యతిరేక, ఇతర యాక్టివిజమ్స్ లో ఉన్నారు.
ఐదున్నర దశాబ్దాలుగా ఆదివాసీల కోసం పని చేస్తున్న స్టాన్ స్వామి -1937 ఏప్రిల్ 26న తమిళనాడులోని తిరుచ్చిలో ఒక రైతు కుటుంబంలో పుట్టారు. 1957లో అవిభాజ్య బీహార్ లో జెసూట్ గా చేరి, ఆ క్రమంలో అట్టడుగు వర్గాల ప్రజల కోసం పని చేయాలని నిర్ణయించుకొన్నారు. 1965లో జెసూట్ ట్రైనింగ్ లో భాగంలో ఝార్ఖండ్ లోని చైబాసలో ఒక బడిలో టీచర్ గా పని చేశారు. అప్పుడే అతని సామాజిక కార్యాచరణ ప్రారంభం అయ్యింది. సెలవు రోజుల్లో తన విద్యార్థుల ఇళ్లకు వెళ్లేవారు. ఆదివాసీ కుటుంబాలు ఎలా మోసాలకు గురి అవుతున్నాయో ఆయన అప్పుడే గమనించారు.
ఆ నాటి నుండి ఆయన తన జీవితాన్ని ఆదివాసీలతో ముడి వేసుకొన్నారు. 1970లో థియాలజి, సోషియాలజీల సబ్జెక్ట్స్ లో ఫిలిఫిన్స్ లో పీజీ చేశారు. 1971లో జెంషెడ్ పూర్ కు తిరిగి వచ్చి, ‘కాథలిక్ సర్వీసెస్ చారిటి’ డైరెక్టర్ గా ఎన్నికయ్యారు. 1975 నుండి 86 వరకు జెసూట్స్ నిర్వహిస్తున్న బెంగుళూర్ లోని ‘భారతీయ సామాజిక సంస్థ’ డైరక్టర్ అయ్యారు.
బెంగుళూర్ నుండి ఝార్ఖాండ్ కు వచ్చేసి ఆయన చైబాసాలో ఝర్ఖాండ్ మానవహక్కుల సంఘంలో పని చేశారు. తరువాత రాంచిలో బగైచ అనే జెసూట్ ‘సామాజిక పరిశోధన – శిక్షణ కేంద్రాన్ని’ స్థాపించారు. అందులోనే ఆయన 15 సంవత్సరాలు పని చేశారు. అధర్మ స్థానభ్రంశాలు, మానవ హక్కుల భంగాలు, చట్ట వ్యతిరేక భూ సేకరణలు, మూలవాసులను భూమికి దూరం చేయటానికి తయారైన విధానాలకు వ్యతిరేకంగా ఆయన పని చేశారు. ఈ విషయాలన్నీ ఆయనే స్వయంగా NSA విచారణలో చెప్పారు.
2013లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ సేకరణ చట్టం ప్రకారం భూమిని ప్రభుత్వం ఆక్రమించుకోవాలంటే ఇంతకు ముందులాగా సామాజిక ప్రభావాన్ని అంచనా వేసే ఎలాంటి ప్రయాసా పడనవసరం లేదు. రాజ్యాంగంలోని ఐదో అధికరణ ప్రకారం, పూర్తిగా ఆదివాసిలతో కూడిన ఆదివాసీ సలహా సంఘాన్ని ఎందుకు ఏర్పాటు చేయరనేది ఆయన ప్రభుత్వానికి వేసిన అనేకానేక ప్రశ్నలలో ఒకటి. ఆదివాసీ, గిరిజన ప్రాంతాల్లో పెసా చట్టాన్ని అమలు పర్చకపోవటం మీద ఆయన పోరాటం ఎక్కువగా నడిచింది.
1996లో సుప్రీంకోర్టు ఇచ్చిన సమతా తీర్పు ప్రకారం భూమికి యజమాని అయినవాడు, ఆ భూమి కింద ఉన్న ఖనిజాలకు కూడా యజమాని అవుతాడు. ఈ తీర్పు అమలు అయితే ఈ నాడు ఆదివాసీ ప్రాంతాల్లో కార్పొరేట్ల, వారికి అండదండలు ఇస్తున్న ప్రభుత్వాల ఆగడాలు చెల్లవు. ఆ తీర్పు అమలు గురించి కూడా స్టాన్ స్వామి పని చేశాడు. ఒక్క మాటలో చెప్పాలంటే రాజ్యానికి పక్కలో బల్లెం లాగానే ఉన్నాడు.
స్టాన్ స్వామిని గత 50 ఏళ్లుగా ఎరిగిన వ్యక్తి జాన్ దయాళ్ చెప్పిన దాని ప్రకారం ఆయన ఆదివాసీల కోసం పని చేస్తున్న క్రమంలో Persecuted Prisoners Solidarity Committee లో సుధా భరద్వాజ్ తో బాటు భాగస్వామ్యం తీసుకొన్నారు. వారిద్దరు ఉమ్మడిగా వెలువరించిన పత్రంలో జైళ్లలో ఉన్న ఆదివాసీల మీద చట్టాతీతంగా అమలు అవుతున్న హింసను బయట పెట్టారు. జైళ్లలో ఆదివాసీలను ఏకాంతవాసంలో ఉంచే విధానాన్ని ఆయన ప్రశ్నించారు.
ఆదివాసీల్లో ‘పథల్ గాడి’ అనే ఆచారం ఒకటి ఉంది. జార్ఖండ్ లోని ఖుంటి ప్రాంతంలో ఆదివాసులు తమ పూర్వీకుల సమాధుల మీద బండరాళ్లను ఉంచి గౌరవించే ఆచారం అది. ఇటీవల కాలంలో మరణించిన ఆదివాసీల ఆత్మబంధువైన అయ్యేస్ ఆఫీసర్ బీడీ శర్మ, అతని సహ ఉద్యోగి బండి ఒరవన్ లు ఆ బండల మీద పెసా చట్టాన్ని, రాజ్యాంగ ఐదో అధికారణను చెక్కించటం చేశారు. దీన్నే పథల్ గాడి ఉద్యమం అనేవారు. ఆ ఉద్యమానికి స్టాన్ స్వామి గట్టి మద్దతునిచ్చాడు. ఈ ఉద్యమం కారణంగా ఈయన మీద మొదటి ఎఫ్ఫైయార్ నమోదు అయ్యింది.
2018 ఆగస్టు 28న, బగైచలోని అతని గదిలోకి పుణె పోలీసులు దాడి చేసారు. అతని పేరు భీమా కోరేగావ్ కేసులో ఉందని చెప్పారు. అతని లాప్ టాప్, అతని ఫోన్, కొన్ని సీడీలు, డాక్యుమెంట్లు పట్టుకొని పోయారు. ఇంకో పది నెలల తరువాత 2019 జూన్ 12న మళ్లీ అతని గది మీద రైడ్ చేసి అతని హార్డ్ డిస్క్, ఫోన్, అతని సోషల్ మీడియా అక్కౌంట్స్ పట్టుకొని పోయారు. మొదట పెట్టిన ఎఫ్ఫైయ్యార్ లో పథల్ గాడ్ ఉద్యమ కేసు, ఫేస్ బుక్ పోస్టుల ద్వారా హింసను ప్రేరేపించాడనే ఆరోపణ ఉంది. ఆ కేసుని రద్దు చేయించుకొనే ప్రయత్నంలో ఉండగానే భీమా కోరేగావ్ కేసులో ఇరికించారు. అతన్ని హైకోర్టు అడ్వకేట్ జనరల్ ‘కరడు కట్టిన నేరస్తుడని’ అన్నాడు. చివరికి అన్ని చట్టపరమైన ప్రయత్నాలు విఫలం అయ్యి 2020 అక్టోబర్ 8న ఆయనను అరెస్టు చేశారు.
అరెస్టుకు రెండు రోజుల ముందు ఆయన విడుదల చేసిన వీడియో మెసేజ్ లో ‘నా మీద ఆరోపణ చేసినట్లు నేను ఎప్పుడూ భీమా కోరేగావ్ కేసులో లేను. అయితే ఈ రోజు నాకు జరుగుతున్నది, నాకు ఒక్కడికే జరుగుతున్నది కాదు. ఇదంతా దేశమంతా జరుగుతున్నపెద్ద ప్రక్రియ. భారత పాలక అధికారం మీద ప్రశ్నలు వేస్తున్నారనీ, అసమ్మతిని వెలిబుచ్చుతున్నారనీ -ప్రఖ్యాత మేధావులు, లాయర్లు, రచయితలు, కవులు, కార్యకర్తలు, విద్యార్థి నాయకులను జైళ్లలో పెడుతున్నారని మనకు తెలుసు’ అని చెప్పాడు. ఈ ప్రక్రియ మొత్తంలో తాను మౌన వీక్షకుడిగా ఉండిపోకుండా అందులో భాగం పంచుకోగలిగినందుకు సంతోషిస్తున్నానని చెప్పాడు. తను చేసిన పనికి ఎలాంటి మూల్యమైన చెల్లించటానికి తాను సిద్దంగా ఉన్నానని చెప్పాడు. భారత ప్రభుత్వం ఆయన ప్రాణాల రూపంలో ఎక్కువ మూల్యమే తీసుకొన్నది.
ముఖ్యమంత్రుల దగ్గర నుండి రాజకీయ పార్టీలు, ఎంపీలు, యాక్టివిస్టులు, సామాన్య ప్రజలు, మహిళలు ఆయన అరెస్టును ఖండించారు. అయితే NSA కానీ, ఢిల్లీ ప్రభుత్వం కానీ కించిత్తు చలించలేదు. భీమా కోరేగావ్ అనే అఖండ జ్వాలలో మన కాలపు అరుదైన మానవతవాదిని తోసేశారు.
స్టాన్ స్వామి చివరి రోజులు ఒక్కొకటీ -మన సకల వ్యవస్థలు ఎంత తప్పుడివో చెబుతాయి. అతని వయసు, ఆరోగ్యంతో సంబంధం లేకుండా ఆయన జైల్లో పెట్టి, బయట ప్రపంచానికి ఒక ఉదాహరణను చూపించింది ప్రభుత్వం. ఎన్ని సార్లు అప్పీల్ చేసుకొన్నా అతనికి బెయిల్ దొరకలేదు. ఆయన ఎంత ధైర్యంగా లోపలికి వెళ్లినా జైలు అతని ఆరోగ్యాన్ని మింగేసింది.
ఆహారం తీసుకోవటం ఆయన కష్టమైన తరుణంగా, దాన్ని పీల్చుకోవటానికి అవసరం అయిన సిప్పర్ కోసం పెద్ద కోర్టు యుద్ధం చేయాల్సి వచ్చింది. రోజువారీ పనులు కూడా చేసుకోలేకపోయారు. NSA కక్ష గట్టి ఆయనకు బెయిల్ రానీయకుండా గట్టి ప్రయత్నాలు చేసింది. కోర్టులు గట్టిగా నోరుమూసుకొన్నాయి.
మే 21న ఆయన బొంబే హై కోర్టుకు ‘తినలేక పోతున్నాను, నడవలేకపోతున్నానని’ చెప్పారు. తాత్కాలిక మెడికల్ బెయిల్ ఇవ్వమని అడిగారు. మే 31న ఆయన కోవిడ్ పాజిటివ్ అయ్యారు. అప్పుడు తన సొంత ఖర్చులతో ప్రైవేట్ హాస్పిటల్ కి వెళతానని అడిగి, బొంబే లోని హోలీ ఫ్యామిలి హాస్పిటల్ లో చేరటానికి అనుమతి పొందారు. జులై 2న ఊపా చట్టంలోని కొన్ని సెక్షన్లను ఆయన కోర్టులు సవాలు చేశారు. జులై 4న ఆయనకు హార్ట్ అటాక్ వచ్చింది. జులై 5న మరణించారు.
ఆరోగ్యపరంగా దీనావస్థలో ఉన్నా చనిపోయే వరకూ అన్యాయపు చట్టాలను ప్రశ్నించారే కానీ ఆయన ఎప్పుడూ తన విడుదలకు వేడుకోలేదు. చట్టం ముందూ, న్యాయం ముందూ ఆయన ఛాతీ చూపించి నుల్చోన్నారు. భారత రాజకీయ, న్యాయ, రక్షణ వ్యవస్థలు ఆయనను బలవన్మరణానికి తోసి వాటికవి ఆత్మహత్య చేసుకొన్నాయి. ఫాదర్ స్టాన్ స్వామి చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం, స్ఫూర్తి ఆకాశమంతా కమ్ముకొన్నది.