Drumstick Farming | సిరులు కురిపిస్తున్న మునగ పంట.. ఎకరాకు రూ. 8 లక్షలు సంపాదిస్తున్న రైతు
Drumstick Farming | మునగకాయ పంట( Drumstick Farming )సిరులు కురిపిస్తుంది.. ఈ పంటను సేంద్రీయ( Organic ) విధానంలో సాగు చేస్తున్న అన్నదాతలు( Farmers ) ఊహించని లాభాలు గడిస్తున్నారు. ఓ రైతు మునగ పంటతో ఎకరానికి రూ. 8 లక్షలు సంపాదిస్తూ పది మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.

Drumstick Farming | వ్యవసాయం దండగ కాదు.. పండుగ అని రుజువు చేశాడు ఓ రైతు. వ్యవసాయంలో కొత్త మెళకువలు పాటిస్తూ.. సేంద్రీయ( Organic ) విధానాన్ని అనుసరిస్తూ లక్షల రూపాయాలు సంపాదిస్తున్నాడు. ఆ రైతుకు వందల ఎకరాల పొలం కూడా లేదు. కేవలం తనకున్న మూడు ఎకరాల్లోనే మునగ పంట(Drumstick Farming )వేసి.. ఎకరాకు రూ. 8 లక్షల చొప్పున సంపాదిస్తున్నాడు. మరి ఆ అన్నదాత గురించి తెలుసుకోవాలంటే మహారాష్ట్ర( Maharashtra )లోని షోలాపూర్( Solapur )కు వెళ్లక తప్పదు.
షోలాపూర్‌లోని మోహల్ తాలుకా పరిధిలోని అంగర్ గ్రామానికి చెందిన అప్పా కరంకర్( Appa Karamkar ) అనే వ్యక్తి.. మొదట్లో టీచర్. ఆయన ఎంఏ మరాఠీ, బీఎడ్ చదివాడు. కానీ పిల్లలకు పాఠాలు చెబుతూనే వ్యవసాయంపై దృష్టి సారించాడు. తనకున్న మూడు ఎకరాల్లో చెరుకు సాగు( Sugarcane Farming ) చేశాడు. కానీ ఆ ఏరియాలో నీటి కొరత ఉండడంతో చెరుకు పంటలో దిగుబడి లేక నష్టాల బాట పట్టాడు అప్పా కరంకర్.
ఈ క్రమంలో మునగ పంట వైపు ఆ రైతు దృష్టి కేంద్రీకరించాడు. ఓడీసీ3 అనే మునగ రకాన్ని అతను ఎంచుకున్నాడు. చెరుకు పంటను పూర్తిగా తొలగించి.. 2017లో తొలిసారిగా మునగ పంట వేశాడు. ఆవు పేడతో తన పొలాన్ని సారవంతం చేశాడు. ఎకరానికి 800 మొక్కల చొప్పున మునగ విత్తనాలను నాటాడు. మూడు నుంచి నాలుగు నెలల్లో మునగ చెట్టు పువ్వులు పూయడం ప్రారంభించింది. మరో మూడు నెలల్లో మునగకాయలు చేతికొచ్చాయి. తొలిసారి కేజీ మునగకాయలను రూ. 70 చొప్పున విక్రయించాడు. కానీ కాలక్రమేణా మునగకు డిమాండ్ పెరగడంతో.. ఇప్పుడు కేజీ రూ. 500 చొప్పున విక్రయిస్తున్నాడు. ఇలా మూడు ఎకరాలకు కలిపి రూ. 24 లక్షలు సంపాదిస్తున్నాడు అప్పా కరంకర్.
ఈ సందర్భంగా రైతు అప్పా కరంకర్ మాట్లాడుతూ.. మునగకాయలతో పాటు దాని ఆకులకు మార్కెట్‌లో భలే డిమాండ్ ఉందన్నాడు. గతేడాది డిసెంబర్‌లో కేజీ మునగకాయలను రూ. 500 చొప్పున విక్రయించినట్లు తెలిపాడు. మునగలో విటమిన్ ఏ, సీతో పాటు క్యాల్షియం, పొటాషియం వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయని, దీన్ని మెడిసిన్ తయారీలో కూడా ఉపయోగిస్తారని తెలిపాడు. దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా మునగకు డిమాండ్ ఉందన్నాడు. గత కొన్నేండ్ల నుంచి మిడిల్ ఈస్ట్, సౌత్ ఈస్ట్ ఆసియాకు అధికంగా ఎగుమతి అవుతుందని చెప్పాడు.
మునగ పంటకు పెద్దగా నీటి అవసరం ఉండదన్నాడు. ఈ పంట సాగుకు డ్రిప్ ఇరిగేషన్ ఉత్తమమని పేర్కొన్నాడు. అధిక నీటిని వినియోగించడం వల్ల వేర్లు దెబ్బతిని పంట దిగుబడి తక్కువగా వచ్చే అవకాశం ఉందని తెలిపాడు. సేంద్రీయ వ్యవసాయం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని అప్పా కరంకర్ పేర్కొన్నాడు.